Share News

డంపింగ్‌ యార్డులో ఎగిసిపడుతున్న మంటలు

ABN , Publish Date - Nov 29 , 2025 | 12:23 AM

నగరంలోని డంపింగ్‌ యార్డు కాలుష్య విషాన్ని చిమ్ముతోంది. గుట్టలుగుట్టలుగా పేరుకు పోయిన చెత్త తగలబడడంతో శుక్రవారం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి.

డంపింగ్‌ యార్డులో ఎగిసిపడుతున్న మంటలు

కరీంనగర్‌ టౌన్‌, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): నగరంలోని డంపింగ్‌ యార్డు కాలుష్య విషాన్ని చిమ్ముతోంది. గుట్టలుగుట్టలుగా పేరుకు పోయిన చెత్త తగలబడడంతో శుక్రవారం ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. సాయంత్రం వేళల్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలతో స్థానికులు తీవ్రభయాందోళనకు గురికాగా, యార్డు నుంచి వెలువడుతున్న కాలుష్యం, పొగతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరయ్యారు. చెత్తగుట్టను తొలగించేందుకు బయోమైనింగ్‌ ప్రక్రియ చేపట్టినా అది ఒక అడుగు ముందకు రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగడంతో సమస్యకు పరిష్కారం లభించడం లేదు. టన్నులకొద్దీ పేరుకుపోయిన చెత్తచెదారం గుట్టపై మంటలు ఆర్పివేస్తున్నప్పటికి కొద్దిసేపటికే మరోచోట నుంచి మంటలు, పొగ వెలువడుతోంది. హైదరాబాద్‌- రామగుండం బైపాస్‌ రోడ్డులోని దశాబ్దాల కాలం క్రితం ఏర్పాటు చేసిన ఈ డంపింగ్‌యార్డుకు చెత్తను తగ్గించేందుకు బయోమైనింగ్‌ చేయాలని నిర్ణయించారు. స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ ద్వారా బయోమైనింగ్‌ ప్రక్రియను ఏడాదిలోగా పూర్తిచేయాలనే ఒప్పందంతో 16.5 కోట్ల రూపాయలకు ప్రాజెక్టు పనులను 2022 ఫిబ్రవరి మాసంలో అప్పగించారు. కొద్దిరోజులు వేగంగా బయోమైనింగ్‌ ప్రక్రియను కొనసాగించి గత ఏడాది మే నుంచి పూర్తిగా నిలిపివేశారు. మున్సిపల్‌ అధికారులు ఆ సంస్థకు నోటీసులు ఇవ్వడంతో తిరిగి ఇటీవలనే బయోమైనింగ్‌ ప్రక్రియ ప్రారంభించారు. కాంట్రాక్టు అప్పగించి దాదాపు రెండేళ్ళు అవుతున్నా నేటికీ గుట్టలు తగ్గడం లేదు. ప్రతీరోజు నగరంలో లక్షా 50 వేల మెట్రిక్‌ టన్నుల వరకు చెత్త వెలువడుతోంది. మంటలంతో డంపింగ్‌యార్డుకు పరిసరాలైన ఆటోనగర్‌, అల్గునూర్‌, సదాశివపల్లి, కోతిరాంపూర్‌, అలకాపురికాలనీ, కమాన్‌, సిక్కువాడ వరకు పొగ విస్తరిస్తోంది. దీంతో తాము రోగాలబారిన పడుతున్నామని ఆయా కాలనీల వాసులు వాపోతున్నారు. బయోమైనింగ్‌ ప్రక్రియ ద్వారా చెత్తను వేగంగా శుద్ధి చేయడంతోపాటు తిరిగి ఇక్కడ చెత్త గుట్ట పేరుకుపోకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

Updated Date - Nov 29 , 2025 | 12:23 AM