గార్బెజ్ పాయింట్స్‌లో చెత్తవేస్తే జరిమానా
ABN , Publish Date - Sep 30 , 2025 | 11:41 PM
నగరంలోని 16 ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన గార్బెజ్ పాయింట్స్‌లో చెత్త వేస్తే జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ శానిటేషన్ అధికారులను ఆదేశించారు.
కరీంనగర్ టౌన్, సెప్టెంబరు 30 (ఆంధ్రజ్యోతి): నగరంలోని 16 ప్రాంతాల్లో నగరపాలక సంస్థ ఏర్పాటు చేసిన గార్బెజ్ పాయింట్స్‌లో చెత్త వేస్తే జరిమానా విధించాలని మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్ శానిటేషన్ అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నుంచి గార్బెజ్ పాయింట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సిబ్బందితోపాటు పారిశుధ్య విభాగానికి చెందిన ఒక శానిటరీ ఇన్‌స్పెక్టర్, జవాన్ ప్రతి రోజు గార్బెజ్ పాయింట్లను పరిశీలించాలని ఆదేశించారు. చెత్త కలెక్షన్ పాయింట్ల వద్ద సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా పర్యవేక్షణ చేసి చెత్తవేసే వారిని ఫొటోల ద్వారా గుర్తించి జరిమానా విధిస్తామని చెప్పారు. చెత్తసేకరణ పాయింట్లలో చెత్త వేయవద్దని, తడి, పొడిచెత్తను వేరు చేసే ఇంటి వద్దకు వచ్చ స్వచ్ఛ ఆటోలు, స్వచ్ఛ రిక్షాలకు ఇవ్వాలని నగరవాసులకు సూచించారు.