Share News

మైనార్టీలకు ఆర్థిక భరోసా

ABN , Publish Date - Sep 25 , 2025 | 12:56 AM

జగిత్యాల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతి కోసం రెండు కొత్త పథకాలను ప్రవేశ పెట్టింది. ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’, ‘రేవంతన్నకా సహ రా మిస్కీన్‌ లే’ పేరుతో తెచ్చిన పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబన, అట్టడుగు సముదాయాల సామాజిక ఉద్ధరణకు దోహదపడతాయని ఆశిస్తున్నారు. ఈనెల 19వ తేదీన సెక్రటేరియట్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు.

మైనార్టీలకు ఆర్థిక భరోసా

-‘ఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన’ ప్రారంభం

-ఒంటరి మహిళలకు రూ.50వేల ఆర్థిక సాయం

- రేవంతన్న కా సహారా మిస్కీన్‌లే’ పథకం కింద రూ.లక్ష గ్రాంట్‌

- వచ్చే నెల 6 వరకు దరఖాస్తుకు గడువు

జగిత్యాల, సెప్టెంబరు 24 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం మైనార్టీల అభ్యున్నతి కోసం రెండు కొత్త పథకాలను ప్రవేశ పెట్టింది. ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’, ‘రేవంతన్నకా సహ రా మిస్కీన్‌ లే’ పేరుతో తెచ్చిన పథకాలు మహిళల ఆర్థిక స్వావలంబన, అట్టడుగు సముదాయాల సామాజిక ఉద్ధరణకు దోహదపడతాయని ఆశిస్తున్నారు. ఈనెల 19వ తేదీన సెక్రటేరియట్‌లో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ ఈ పథకాలను లాంఛనంగా ప్రారంభించారు. మొత్తం రూ. 30 కోట్ల బడ్జెట్‌తో అమలు చేసే ఈ పథకాలకు దరఖాస్తులు సెప్టెంబరు 19 నుంచి అక్టోబరు 6వ తేదీ వరకు టీజీవోబీఎమ్‌ఎస్‌ పోర్టల్‌ ద్వారా ఆన్‌లైన్‌లో స్వీకరించనున్నారు.

ఫఇందిరమ్మ మైనార్టీ మహిళా యోజన

ఈ పథకం మైనార్టీ మహిళలు (ముస్లిం, సిక్కు, బౌద్ద, జైన, పార్సీ వర్గాలకు చెందినవారు) ఆర్థికంగా స్వతంత్రంగా మారేలా సహాయపడుతుందని సర్కారు భావిస్తోంది. వితంతువులు, విడాకులు పొందినవారు, అనాథలు, అవివాహితులు, ఒంటరి మహిళలకు చిన్న వ్యాపారాల ప్రారంభానికి ఒక్కొక్కరికి రూ.50 వేల గ్రాంట్‌ అందిస్తారు. ఇది రాష్ట్రంలో మైనార్టీ మహిళల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, ఉద్యోగాల సృష్టికి దోహదపడుతుందని భావిస్తున్నారు.

పథకానికి నిబంధనలు

ఫ తెలంగాణ స్థిరనివాసులు, మైనార్టీ వర్గాలకు చెందినవారు అర్హులు

ఫ వయసు 22 ఏళ్లనుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ఫ విద్యా అర్హత 5వ తరగతి ఉండాలి.

ఫ వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షలు, పట్టణాల్లో రూ.2 లక్షలకు తక్కువ ఉన్నవారు అర్హులు.

ఫ గత ఐదేళ్లలో ఇతర ఆర్థిక సహాయాలు పొందకూడదు.

ఫ రేషన్‌కార్డు, ఆధార్‌, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు ఉండాలి.

ఫరేవంతన్నకా సహారా మిస్కీన్‌ లే...

ముస్లిం సముదాయాల అభ్యున్నతికీ ఈ పథకం రూపొందించబడింది. ఫకీర్‌, దూదేకుల, ఇతర అట్టడుగు ముస్లిం వర్గాల సభ్యులకు మోపెడ్‌లు, బైక్‌ లేదా ఈ-బైక్‌లు అందించడానికి రూ.లక్ష గ్రాంట్‌ (100శాతం) రాయితీ మంజూరు చేస్తారు. తెలంగాణ మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ (టీజీఎంఎఫ్‌సీ) ద్వారా అమలు చేసే ఈ పథకం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని ఆశిస్తున్నారు. జిల్లాలో అర్హులైన మైనార్టీలు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ అధికారి ఆర్‌ఎస్‌ చిత్రు కోరుతున్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్‌లోని జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ కార్యాలయంలో సంప్రదించాలని ఆయన సూచించారు.

పథకానికి నిబంధనలు

ఫ తెలంగాణ స్థిర నివాసులు, మైనారిటీ వర్గాలకు చెందినవారు.

ఫ వయసు 21 నుంచి 55 ఏళ్ల మధ్య ఉండాలి.

ఫ రేషన్‌ లేదా ఫుడ్‌ సెక్యూరిటీ కార్డు ఉండాలి.

ఫ గత ఐదేళ్లలో టీజీఎంఎఫ్‌ నుంచి సహాయం పొందకూడదు.

ఫ కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ప్రయోజనం

ముఖ్యమంత్రి దూరదృష్టితోనే పథకాల అమలు

-అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, రాష్ట్ర మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి

మైనార్టీల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి దూరదృష్టితోనే ఈ రెండు పథకాలు రూపకల్పన చేశారు. ఈ పథకాలకు ప్రభుత్వం రూ.30 కోట్లు కేటాయించింది. ఫకీర్‌, దూదేకుల వర్గాలకు మోపెడ్‌ వాహనాలు ఇవ్వడంతో వారిని ఆర్థికంగా మరింత బలోపేతం చేస్తుంది. మైనార్టీల అభివృద్ధి అంటే కేవలం సబ్సిడీలు కాదు.. వారి స్వయం ఉపాధికి దారి చూపడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యం.

Updated Date - Sep 25 , 2025 | 12:56 AM