నిలిచిన ఆర్థిక సంఘం నిధులు
ABN , Publish Date - Sep 10 , 2025 | 01:09 AM
సరిగ్గా రెండేళ్ల క్రితం ఎక్కడ చూసినా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలే... కొబ్బరికాయలను కొట్టేందుకు, ఫొటోలు దిగేందుకు నాయకులు పోటీపడ్డారు. ఓవైపు పట్టణ ప్రగతి, మరోవైపు సీఎం హామీ, ఇంకోవైపు స్మార్ట్‌సిటీ, మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులు కోట్లాది రూపాయలతో 60 డివిజన్లలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులే కనిపించాయి.
కరీంనగర్ టౌన్, సెప్టెంబర్ 9 (ఆంధ్రజ్యోతి): సరిగ్గా రెండేళ్ల క్రితం ఎక్కడ చూసినా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలే... కొబ్బరికాయలను కొట్టేందుకు, ఫొటోలు దిగేందుకు నాయకులు పోటీపడ్డారు. ఓవైపు పట్టణ ప్రగతి, మరోవైపు సీఎం హామీ, ఇంకోవైపు స్మార్ట్‌సిటీ, మున్సిపల్ జనరల్ ఫండ్ నిధులు కోట్లాది రూపాయలతో 60 డివిజన్లలో ఎక్కడ చూసినా అభివృద్ధి పనులే కనిపించాయి. అసెంబ్లీ ఎన్నికల్లోగా నగరంలో మట్టిరోడ్లు లేని సుందర నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పడంతో ప్రజలు ఇక అన్ని సమస్యలు తీరుతాయని ఆశించారు. అక్టోబరు 9, 2023న అసెంబ్లీ ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిలిచిపోయాయి.
ఫ అసంపూర్తిగా అభివృద్ధి పనులు
డిసెంబరు 9న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. 2024 జనవరి 29న మున్సిపల్ పాలకవర్గం పదవీకాలం ముగిసింది. దీంతో ఇక అభివృద్ధి పనులకు గ్రహణం పట్టింది. ఆనాడు ప్రారంభించిన పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి. దాదాపు 50కిపైగా రోడ్లను తవ్వి అసంపూర్తిగా వదిలివేశారు. నగరపాలక సంస్థకు గత ప్రభుత్వం పట్టణ ప్రగతి ఏడాదికి వంద కోట్ల చొప్పున మూడేళ్ళలో 300 కోట్లతోపాటు అదనంగా మరో 50 కోట్లను విడుదల చేసింది. సీఎం హామీ నుంచి నిధులు మంజూరయ్యాయి. దీనికి తోడు కేంద్రప్రభుత్వం నుంచి 14వ ఆర్థిక సంఘం నిధులు ఒక ఏడాది, ఆ తర్వాత నాలుగేళ్ళు 15వ ఆర్థిక సంఘం నిధులు విడుతల వారీగా దాదాపు 250 కోట్లకుపైగానే విడుదలయ్యాయి.ు అమృత్ పథకం పేజ్-1,ఫేజ్-2 కింద కూడా వందల కోట్ల నిధులు రావడంతో కరీంనగర్‌లో అభివృద్ధి పనులు పరుగులు పెట్టాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు నగరపాలక సంస్థకు ఎలాంటి నిధులు, గ్రాంట్లను మంజూరు చేయలేదు. స్మార్ట్‌సిటీ గడువు పూర్తయింది. మరోవైపు పాలకవర్గంలేక పోవడంతో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 15వ ఆర్థిక సంఘం నిధులు నిలిచి పోయాయి. పాలకవర్గ పదవీ కాలంపూర్తయినప్పటి నుంచి రెండు విడుతల్లో దాదాపు 50 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు వచ్చేవి. పాలకవర్గం లేక పోవడంతో ఆ నిధులు ఆగిపోయాయి. ఇలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి బల్దియాకు ఎలాంటి నిధులు రాక పోవడంతో అభివృద్ధి పనులపై తీవ్ర ప్రభావం పడుతోంది.
ఫ బల్దియాకు తగ్గిన ఆదాయం
ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీం (ఎల్‌ఆర్‌ఎస్) ద్వారా వచ్చే నిధులు కూడా మున్సిపల్‌కు రావడం లేదు. మున్సిపల్ పరిధిలో ప్లాట్ల క్రయవిక్రయాల ద్వారా రిజిస్ట్రేషన్‌శాఖ నుంచి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. ఇతర ఆదాయాలు పెద్దగా లేక పోవడంతో బల్దియా ఖజానా జనరల్ ఫండ్‌కే పరిమితమైంది. ఇళ్ల నిర్మాణాలు తగ్గడంతో అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం చాలా మేరకు తగ్గినట్లు తెలుస్తోంది. ఇక ప్రజలు చెల్లించే ఆస్తిపన్నులు, నల్లాబిల్లులు, ట్రేడ్ లైసెన్సు ఫీజులు, ప్రచార సాధానాల ద్వారా వచ్చే టాక్సులతో వచ్చే ఆదాయం లక్ష్యం మేరకు వసూలు కాక పోడంతో జనరల్ ఫండ్‌లోనూ అరకొరగా నిధులు జమవుతున్నట్లు సమాచారం. నగరపాలక సంస్థకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నిధులు రాక పోవడం, జనరల్ ఫండ్ నిధులు అరకొరగానే ఉండడంతో కార్యాలయ నిర్వహణ, అత్యవసర సేవలకు మాత్రమే ఇబ్బంది లేకుండా చెల్లింపులు చేస్తున్నారు. పెండింగ్ పనులు, కొత్తగా చేపట్టే పనులు ముందుకు కదలలేని పరిస్థితి ఏర్పడింది. మున్సిపల్ ఎన్నికలు నిర్వహిస్తే తప్ప కేంద్రం నుంచి నిధులు వచ్చే పరిస్థితి లేదు. ముందుగా సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీల ఎన్నికలు నిర్వహిస్తారని, ఆ తర్వాత మున్సిపల్ ఎన్నికలు జరుగుతాయని, అక్టోబరు, నవంబరు పాలకవర్గాలు కొలువుతీరితే నిధులు వస్తాయని అంచనా వేశారు. బీసీ రిజర్వేషన్ల అంశంతో ‘స్థానిక’ ఎన్నికలు మరింత ఆలస్యంగా జరుగుతాయని వార్తలు వస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికలు ఈయేడు ఉండక పోవచ్చని, అప్పటి వరకు అభివృద్ధి ముందుకు కదలడం కష్టమేనని మాజీ కార్పొరేటర్లు, వివిధ పార్టీల నాయకులు, ప్రజలు చెప్పుకుంటున్నారు. అసంపూర్తి పనులతో ఇబ్బందులు పడుతున్నామని, ప్రత్యేకంగా నిఽధలు విడుదల చేసి పనులు పూర్తి చేయాలని నగరవాసులు కోరుతున్నారు.