ప్రశాంత వాతావరణంలో పండుగలు జరుపుకోవాలి
ABN , Publish Date - Aug 24 , 2025 | 12:06 AM
గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ పండుగ నేపథ్యంలో శాంతి కమిటీ సభ్యులతో, ఏర్పాట్లపై అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సమావేశం నిర్వహించారు.
కరీంనగర్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి కోరారు. రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలు, మిలాద్ ఉల్ నబీ పండుగ నేపథ్యంలో శాంతి కమిటీ సభ్యులతో, ఏర్పాట్లపై అధికారులతో కలెక్టరేట్ ఆడిటోరియంలో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మున్సిపల్, విద్యుత్, పోలీస్ సిబ్బంది సమన్వయంతో నగరంలో లో-లెవెల్‌లో ఉన్న విద్యుత్ తీగలను పరిశీలించి తగు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా గణేష్ నిమజ్జనానికి వెళ్లే రూట్లలో విద్యుత్ తీగల విషయంలో ఆ శాఖ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. వేడుకల కోసం లైటింగ్, శానిటేషన్, బ్లీచింగ్ వంటి పనులను మున్సిపల్ ఆధ్వర్యంలో పక్కాగా చేపట్టాలని ఆదేశించారు. అగ్నిమాపక, మైనింగ్, ఆర్‌అండ్‌బీ తదితర శాఖల అధికారులు తమకు కేటాయించిన విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో మాదిరిగానే ఈసారి కూడా గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్ ఉంటుందని, మిలాన్ ఉల్ నబి వేడుకలకు ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేస్తామని వెల్లడించారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ ఈసారి నగరంలో సుమారు 3,300 గణేష్ విగ్రహాలు ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. నిర్వాహకులు పోలీస్ వెబ్‌సైట్‌లలో గణేష్ మండపం పూర్తి వివరాలు నమోదు చేయాలని కోరారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్లు అశ్విని తానాజీ వాకడే, లక్ష్మీ కిరణ్, ఆర్‌డీఓ మహేశ్వర్, ఉత్సవ కమిటీ ప్రతినిధులు, శాంతి కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
యువత, విద్యార్థులు డ్రగ్స్ బారిన పడకుండా చూడాలి
కరీంనగర్ క్రైం,: మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని, యువత, విద్యార్థులు మత్తుపదార్థాల బారిన పడకుండా చూడాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. జిల్లాస్థాయి నార్కో కోఆర్డినేషన్ సెంటర్ కమిటీ సమావేశం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్‌లో శనివారం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. పాఠశాలలు, వసతి గృహాలు, విద్యా సంస్థల్లో మత్తుపదార్థాల నివారణకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. షీ టీమ్‌లను కూడా అవగాహన కార్యక్రమాలలో భాగస్వామ్యం చేయాలన్నారు. పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం మాట్లాడుతూ తనిఖీలు 31,.360 కేజీల గంజాయి సీజ్ చేసినట్లు తెలిపారు. 16 కేసులు నమోదు చేసి 39 మందిని అరెస్టు చేశామని వెల్లడించారు. సమావేశంలో అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ పి శ్రీనివాస్‌రావు, నార్కొటిక్ విభాగం సీఐ పుల్లయ్య, ఆర్‌డీఓలు మహేశ్వర్, రమేష్ బాబు, జిల్లా సంక్షేమ అధికారి సరస్వతి, జిల్లా వైద్యాధికారి వెంకటరమణ, జిల్లా వ్యవసాయ అధికారి భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.