మద్దతు ధరలపై అన్నదాత అసంతృప్తి
ABN , Publish Date - May 30 , 2025 | 01:00 AM
వచ్చే వానాకాలం, యాసంగి సీజన్లకు గాను కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరలపై జిల్లా రైతాంగం అసంతృృప్తి వ్యక్తం చేస్తున్నది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
వచ్చే వానాకాలం, యాసంగి సీజన్లకు గాను కేంద్ర ప్రభుత్వం పెంచిన మద్దతు ధరలపై జిల్లా రైతాంగం అసంతృృప్తి వ్యక్తం చేస్తున్నది. రెండు సీజన్లలో రైతులు అత్యధికంగా వరి సాగు చేస్తున్నప్పటికీ, క్వింటాలుకు 69 రూపాయలు మాత్రమే పెంచింది. గతేడాది కంటే 31 రూపాయలు తక్కువ. పత్తి పంటకు ధర ఆశించిన స్థాయిలో పెంచినప్పటికీ, మార్కెట్‌లో మద్దతు ధరలు దక్కక రైతులు నష్టపోతున్నారు. జిల్లాలో పత్తికి ప్రత్యా మ్నాయంగా వరి సాగు వైపు అడుగులు వేస్తున్నారు. గత ఐదేళ్ల నుంచి యేటా క్రమంగా పత్తి పంట తగ్గుతూ వస్తున్నది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ ఢిల్లీలో నిర్వహించిన కేబినెట్ సమావేశంలో 14 రకాల పంటల మద్దతు ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. వరిపై 3 శాతం, పప్పు దినుసులపై 5.96 శాతం, నూనె గింజలపై 9 శాతం కనీస మద్దతు ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. ఈ ధరలు ఈ వానాకాలం సీజన్ నుంచి అమలు కానున్నాయని పేర్కొన్నారు. యేటా దేశ వ్యాప్తంగా రైతులు చేపట్టే పంటల సాగుకు సంబంధించి విత్తనాలు, ఎరువులు, యంత్రాలు, కూలీల ధరలు పెరుగుతూ ఉంటాయి. ఆ ధరలకు అనుగుణంగా పంట పెట్టుబడులపై అధ్య యనం చేసి కేంద్రం కనీస మద్దతు ధరలను పెంచు తుంది. అందులో భాగంగా 2025-26 సీజన్లకు కూడా మద్దతు ధరలు పెంచింది. దేశంలో నూనె గింజల ఉత్పత్తి, పప్పు దినుసుల ఉత్పత్తి యేటా తగ్గి పోతు న్నది. ఈ పంటలతోపాటు, సంప్రదాయ పంటలను ప్రోత్సహించేందుకు మద్దతు ధరలు పెంచుతున్నా మార్కెట్‌లో ఆ ధరలు వ్యాపారులు చెల్లించడం లేదు. వరి పంటను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే గ్రామ గ్రామానికి ధాన్యం కొనుగోలు కేంద్రాలు పెట్టి మద్దతు ధరకు కొనుగోలు చేస్తుండడంతో రైతులు ఎక్కువగా వరి సాగు చేస్తున్నారు. ఈ వానాకాలం సీజన్‌లో 2,72,678 ఎకరాల్లో పంటలు సాగు కానున్నాయని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ఇం దులో అత్యధికంగా 2,12,500 ఎకరాల్లో వరి, 52,500 ఎకరాల్లో పత్తి, మిగతా మొక్కజొన్న. కంది, పెసర, వేరుశెనగ, బబ్బెర, ఆయిల్‌పామ్, కూరగాయలు సాగు కానున్నాయని అంచనా వేశారు. అంటే మొత్తం పంట అంచనాలో 77.93 శాతం వరి, యాసంగి సీజన్‌లో 95 శాతానికి పైగా వరి పంటనే రైతులు సాగు చేస్తున్నారు. పత్తి సాగు యేటా తగ్గుతూ వస్తున్నది. ప్రస్తుతం వరి క్వింటాలు సాధారణ రకం రూ.2300 ఉండగా, పెంచిన ధరతో 2369 రూపాయలు, ఏ గ్రేడ్ రకం 2320 నుంచి 2389 రూపాయలకు పెరిగింది. 14 రకాల పంటల్లో తక్కువ ధర 69 రూపాయలు వరి పంటకు పెంచడంపై జిల్లాకు చెందిన రైతులు అసం తృప్తి చెందుతున్నారు. ఈ ధరలు గిట్టుబాటు కాదని చెబుతున్నారు. ఎకరం వరి సాగు చేస్తే 32 వేల రూపాయలకు పైగా పెట్టుబడి అవుతుందని, యాసం గిలో 35 వేలు అవుతుందని రైతులు తెలిపారు. కౌలుకు తీసుకుంటే మిగిలేది ఏమి లేదని, ఎకరానికి 10 వేల నుంచి 18 వేల రూపాయల వరకు పట్టాదా రులు తీసుకుంటున్నారని కౌలు రైతులు తెలిపారు. ప్రత్యామ్నాయ పంటలు సాగు పరిస్థితి జిల్లాలో లేదని రైతులు అంటున్నారు. ప్రభుత్వం ఆయిల్‌పామ్ సాగు ప్రోత్సహిస్తుండడంతో 5 వేల ఎకరాలకు పైగా రైతులు ఆ పంటను సాగు చేస్తున్నారు. ఆయిల్‌పామ్ పెరిగితే తద్వారా ఆరుతడి పంటల సాగు కూడా పెరగనున్నది. ఆయిల్‌పామ్ మధ్యలో వివిధ రకాల పప్పు దినుసు పంటలు సాగు చేసేందుకు అవకాశాలున్నాయి. పత్తి మీడియం మద్దతు ధర గత ఏడాది 7,121 ఉండగా, 589 పెంపుతో 7,710కు చేరింది. పత్తి లాంగ్ స్టేబుల్ ధర 7,521 నుంచి 8,110 రూపాయలకు పెరిగింది. ధర పెరిగినా కూడా పంట చేతికి వచ్చే సమయానికి మద్దతు ధరలు లభించడం లేదని రైతులు తెలిపారు. పప్పు దినుసులు, నూనె గింజల ధరలు ఆశించిన స్థాయిలో పెరిగినా వరి ధర పెరగక పోవడంపై జిల్లా రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.