కర్షకుల్లో కలవరం..
ABN , Publish Date - May 22 , 2025 | 01:58 AM
ఉరుములు, మెరుపులు, పిడుగులతో కురుస్తున్న అకాల వర్షాలు కర్షకులను కలవర పెడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు వర్షపు జల్లులు జడివానగా మరికొన్ని చోట్ల కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడ్డారు. తడిసిన ధాన్యంతో దిగాలు పడుతున్నారు. వాతావరణంలో ఒకవైపు మార్పులు వచ్చి 40గరిష్ట డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నా ఉక్కపోత మాత్రం వదలడం లేదు. బుధవారం సరాసరి 20.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
- ఒకవైపు ఉక్కపోత.. మరోవైపు ఉరుములు, మెరుపుల వాన
- జడివానతో తడిసిన ధాన్యం
- త్వరగా కొనుగోలు చేయాలని రైతుల ఆందోళనలు
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
ఉరుములు, మెరుపులు, పిడుగులతో కురుస్తున్న అకాల వర్షాలు కర్షకులను కలవర పెడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం రాత్రి నుంచి బుధవారం సాయంత్రం వరకు వర్షపు జల్లులు జడివానగా మరికొన్ని చోట్ల కురవడంతో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడ్డారు. తడిసిన ధాన్యంతో దిగాలు పడుతున్నారు. వాతావరణంలో ఒకవైపు మార్పులు వచ్చి 40గరిష్ట డిగ్రీల కంటే తక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నా ఉక్కపోత మాత్రం వదలడం లేదు. బుధవారం సరాసరి 20.6 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రుద్రంగిలో 25.3, చందుర్తిలో 35.9. వేములవాడ రూరల్‌లో 9.0, బోయినపల్లిలో 12.9, వేములవాడలో 23.1, సిరిసిల్లలో 16.3, కోనరావుపేటలో 40.6, ఎల్లారెడ్డిపేటలో 15.3, వీర్నపల్లిలో 35.3, ముస్తాబాద్‌లో 4.9, గంభీరావుపేటలో 22.3, ఇల్లంతకుంటలో 12.1 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. బుధవారం సాయంత్రం ఒక్కసారిగా కురిసిన వర్షానికి బోయినపల్లి, వీర్నపల్లి, చందుర్తి, కోనరావుపేట, సిరిసిల్ల, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, రుద్రంగి మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి రైతులు ఇబ్బందులు పడ్డారు. తడిసిన ధాన్యంతో పాటు ఉరుములు, మెరుపులతో పిడుగులు పడడంతో పొలాల వద్ద ఉన్న పశువులు చనిపోతున్నాయి. వర్షాల పరిస్థితి అంతు చిక్కకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.
ఫ 74 కేంద్రాల్లో కొనుగోళ్లు పూర్తి...
యాసంగి ధాన్యం కొనుగోలు కోసం జిల్లాలో 244 కేంద్రాలను పౌరసరఫరాల శాఖ ప్రారంభించింది. ఇందులో 74 కేంద్రాల్లో కొనుగోళ్లను పూర్తి చేసింది. ఐకేపీ ద్వారా 190 కేంద్రాల్లో కొనుగోళ్లు ప్రారంభించి 62 కేంద్రాల్లో పూర్తి చేశారు. సింగిల్‌విండోలో 44 కేంద్రాల్లో 8 కేంద్రాలు, మెప్మాలో 7 కేంద్రాల్లో 4 కేంద్రాల్లో పూర్తి చేసి కేంద్రాలు మూసివేశారు. కొనుగోలు కేంద్రాల వద్ద ధాన్యం కాంటా వేయకపోవడం, మిల్లులకు తరలించకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతూ రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు.
ఫ జిల్లాలో 2.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు
జిల్లాలో యాసంగిలో 1.78 లక్షల ఎకరాల్లో రైతులు వరిసాగు చేశారు. 3.67 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనాలు వేశారు. ఇందులో 2.92 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దొడ్డురకం, 8 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం సన్నరకం వస్తుందని అంచనాలు వేసి కొనుగోళ్లకు ఏర్పాట్లు చేశారు. ఇందులో పౌరసరఫరాల శాఖ 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలనే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం ఇప్పటివరకు పౌరసరఫరాల శాఖ 2.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. ఐకేపీ ద్వారా 1,69,996 మెట్రిక్ టన్నులు, సింగిల్‌విండోల ద్వారా 45,124 మెట్రిక్ టన్నులు, డీసీఎంఎస్ ద్వారా 2276 మెట్రిక్ టన్నులు మెప్మా ద్వారా 5,291 మెట్రిక్ టన్నుల దొడ్డురకం ధాన్యం కొనుగోలు చేశారు.
ఫ రైతుల ఖాతాల్లో రూ.347.71 కోట్లు
ధాన్యం కొనుగోళ్లకు సంబంధించి జిల్లాలో రైతుల ఖాతాల్లో డబ్బులు వెంటవెంటనే జమచేస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇప్పటి వరకు 33,072 మంది రైతుల నుంచి రూ.516.64 కోట్ల విలువైన ధాన్యం సేకరించారు. ఇందులో 27,248 మంది రైతులకు సంబంధించి 1,75,029 మెట్రిక్ టన్నుల ధాన్యానికి సంబంధించి రూ.406.07 కోట్లు అన్‌లైన్ చేశారు. అన్‌లైన్ చేసిన వాటిలో 24,385 రైతులకు సంబంధించి 1,49,875 మెట్రిక్ టన్నుల ధాన్యం డబ్బులు రూ.347.71 కోట్లు జమ చేశారు. ఇందులో ఐకేపీ ద్వారా 25,736 మంది రైతుల నుంచి రూ.394.39 కోట్ల విలువైన ధాన్యం సేకరించగా 19,592 మంది రైతుల ఖాతాల్లో రూ.272.89 కోట్లు, సింగిల్ విండోల ద్వారా 6,401 మంది రైతుల నుంచి రూ.104.69 కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించి 4,153 మంది రైతుల ఖాతాల్లో రూ.63.57 కోట్లు, డీసీఎంఎస్ ద్వారా 261 మంది రైతుల నుంచి రూ.5.28 కోట్ల విలువైన ధాన్యంకు సంబంధించి 184 మంది రైతుల ఖాతాల్లో రూ.3.13 కోట్లు, మెప్మా ద్వారా 674 మంది రైతుల నుంచి రూ.12.28కోట్ల విలువైన ధాన్యానికి సంబంధించి 456 మంది రైతుల ఖాతాల్లో రూ.8.12 కోట్లు జమ చేశారు. అకాల వర్షాల దృష్ట్యా వేగంగా కొనుగోలు పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.