వ్యవసాయ పనుల్లో అన్నదాతలు బిజీబిజీ
ABN , Publish Date - Jul 24 , 2025 | 02:32 AM
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు అన్నదాతల్లో ఆశలు పెంచాయి.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
అల్పపీడన ప్రభావంతో కురుస్తున్న వర్షాలు అన్నదాతల్లో ఆశలు పెంచాయి. జూన్ మాసంలో వరుణుడు మొఖం చాటేశాడు. జూలై మొదటివారంలో ముసురు నుంచి మోస్తరు వర్షాలు కురియడంతో సాగు పనులు మొదలుపెట్టారు. మళ్లీ వర్షాలు లేక రైతులు ఆందోళన చెందుతుండగా, రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలు మళ్లీ పంటలకు ఊపిరినిచ్చాయి. దీంతో అన్నదాతలు సంతోషంగా సాగు పనుల్లో బిజీగా మారిపోయారు. మంగళవారం నుంచి బుధవారం ఉదయం వరకు జిల్లాలో 30.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ముస్తాబాద్‌లో 70.9 మిల్లీమీటర్లు, గంభీరావుపేటలో 49.8, ఇల్లంతకుంటలో 43.7, బోయిన్‌పల్లిలో 41.1, వేములవాడలో 35.4, తంగళ్ళపల్లి 33.6, వేములవాడ రూరల్‌లో 26.7, ఎల్లారెడ్డిపేటలో 20.9, చందుర్తిలో 18.8, సిరిసిల్లలో 17.4, కోనరావుపేటలో 15.1, వీర్నపల్లిలో 14.4, రుద్రంగిలో 4.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ప్రస్తుత సీజన్లో జూన్, జూలైలో సాధారణ వర్షపాతం 292.5 మిల్లీమీటర్లు ఉండగా, నమోదైన వర్షపాతం 248.1 మిల్లీమీటర్లు ఉంది. జిల్లాలో ఇప్పటివరకు ఆరు మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. ఇందులో రుద్రంగి, చందుర్తి, వేములవాడ రూరల్, బోయిన్‌పలి,్ల సిరిసిల,్ల కోనరావుపేట మండలాలు ఉండగా సాధారణ వర్షపాతంలో ఎనిమిది మండలాలు ఉన్నాయి. ఇందులో వేములవాడ, కోనరావుపేట, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, ముస్తాబాద్, తంగళ్ళపలి,్ల ఇల్లంతకుంట, మండలాలు ఉన్నాయి. జిల్లాలో ఇప్పటికీ 15.0 శాతం లోటు వర్షపాతంగా ఉంది. జిల్లాలో కురుస్తున్న వర్షాలకు చెరువులు, కుంటల్లోకి వరద నీరు చేరుతోంది. జిల్లాలోని ప్రధానమైన శ్రీరాజరాజేశ్వర మిడ్ మానేరు ప్రాజెక్టులోకి మూలవాగు, మానేరు వాగుల నుంచి నుంచి 210 క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రాజెక్టులో ఇప్పటివరకు 27.55 టీఎంసీల సామర్థ్యానికి 6.84 టీఎంసీల నీటి నిల్వ మాత్రమే ఉంది. ఎగువ మానేరు ప్రాజెక్టులో 0.63 టీఎంసీలు, అన్నపూర్ణ ప్రాజెక్టులో 1.22 టీఎంసీల నీటి నిల్వ ఉంది.
ఫ జిల్లాలో 1,68,180 ఎకరాల్లో పంటల సాగు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వానాకాలంలో 2 లక్షల 43,783 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేయడానికి రైతులు నిమగ్నమయ్యారు. వరి సాగు లక్షా 84 వేల 860 ఎకరాలు, మొక్కజొన్న 1,600 ఎకరాలు, పత్తి 49,760 ఎకరాలు, కందులు 1,155 ఎకరాలు, పెసర 79 ఎకరాలు, ఇతర పంటలు 6,304 ఎకరాలు, ఇతర పంటలు 6,900 ఎకరాల్లో సాగు చేస్తారని అంచనాలు వేశారు. జిల్లాలో ఇప్పటివరకు 1,68,180 ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఇందులో వరి 1.21లక్షల ఎకరాలు నాట్లు వేశారు. విత్తన వెదజల్లే పద్ధతిలో 50 ఎకరాలు సాగు చేశారు. పత్తి 43,320 ఎకరాలు, మొక్కజొన్న 2,903 ఎకరాలు, కందులు 522 ఎకరాలు, పెసర 18 ఎకరాలు, ఇతర పంటలు 56 ఎకరాలో వేశారు. వర్షాలు లేక ఆందోళన చెందుతున్న పత్తి రైతులకు ఊరట లభించింది. వరినాట్లు జోరందుకున్నాయి.
జూలై 23వ తేది వరకు జిల్లాలో వర్షపాతం(మిల్లీమీటర్లలో)
మండలం సాధారణం కురిసింది
రుద్రంగి 324.1 114.3
చందుర్తి 339.1 239.7
వేములవాడ రూరల్ 314.9 251.1
బోయినపల్లి 276.2 200.7
వేములవాడ 319.9 262.9
సిరిసిల్ల 309.6 214.8
కోనరావుపేట 273.8 296.9
వీర్నపల్లి 288.2 231.7
ఎల్లారెడ్డిపేట 283.9 232.6
గంభీరావుపేట 278.4 272.2
ముస్తాబాద్ 247.1 268.7
తంగళ్లపల్లి 311.8 330.0
ఇల్లంతకుంట 325.3 280.0
-----------------------------------------------------------------------------------------------------
సగటు వర్షపాతం 292.5 248.1
-----------------------------------------------------------------------------------------------------
జిల్లాలో ఇప్పటి వరకు వానకాలం పాగు ఇలా..
మండలం వరి పత్తి మొత్తం
గంభీరావుపేట 8,500 110 8,623
ఇల్లంతకుంట 19,500 12,000 32,470
ముస్తాబాద్ 16,000 400 16,605
సిరిసిల్ల 3,000 650 3,656
తంగళ్లపల్లి 10,000 870 10,953
వీర్నపల్లి 7,000 300 7,300
ఎల్లారెడ్డిపేట 11,000 2,500 13,500
బోయినపల్లి 4,800 6,400 11,280
చందుర్తి 9,800 6,100 15,922
కోనరావుపేట 14,000 3,200 17,200
రుద్రంగి 5,910 2,190 1,01,194
వేములవాడ 3,800 4,600 8,438
వేములవాడ రూరల్ 8,000 4,000 12,039
-----------------------------------------------------------------------------------------------------
మొత్తం 1,21,310 43,320 1,68,180
----------------------------------------------------------------------------------------------------