Share News

పడిపోయిన సన్న బియ్యం ధరలు

ABN , Publish Date - Jul 23 , 2025 | 01:14 AM

జిల్లాలోని మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు తగ్గాయి. సర్కారు బోనస్‌ ప్రకటనతో ఈసారి సన్న వడ్ల సాగు పెరగడం, మూడు నెలల రేషన్‌ కింద ప్రభుత్వం సన్న బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో మార్కెట్‌లో సన్నబియ్యం రేట్లు భారీగా తగ్గినట్లుగా వ్యాపార వర్గాలు అంటున్నాయి.

పడిపోయిన సన్న బియ్యం ధరలు

జగిత్యాల, జూలై 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మార్కెట్‌లో సన్న బియ్యం ధరలు తగ్గాయి. సర్కారు బోనస్‌ ప్రకటనతో ఈసారి సన్న వడ్ల సాగు పెరగడం, మూడు నెలల రేషన్‌ కింద ప్రభుత్వం సన్న బియ్యం ఒకేసారి పంపిణీ చేయడంతో మార్కెట్‌లో సన్నబియ్యం రేట్లు భారీగా తగ్గినట్లుగా వ్యాపార వర్గాలు అంటున్నాయి. అన్ని రకాల బియ్యంపై సుమారు రూ.500 వరకు తగ్గడంతో ప్రస్తుతం మార్కెట్‌లో ఏ రకమైనా క్వింటాల్‌ బియ్యం రూ.4,000 నుంచి 4,600 మధ్య దొరుకుతున్నాయి. జిల్లాలో వరి సాగు విస్తీర్ణం పెరగడంతో ధాన్యం దిగుబడి భారీగా పెరిగింది. ఫలితంగా సప్లయ్‌కి తగ్గ డిమాండ్‌ లేకపోవడంతో ధరలు పడిపోయాయని వ్యాపారులు చెబుతున్నారు. జూన్‌ నుంచి క్రమంగా తగ్గుతున్న బియ్యం ధరలు జూలై మూడో వారం వరకు భారీగా పడిపోయాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాలైన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్‌, ధర్మపురిలతో పాటు ఇతర ప్రాంతాల మార్కెట్‌లలో సైతం బియ్యం ధరలు తగ్గుముఖం పట్టాయి.

ఫతగ్గిన కొనుగోళ్లు

తగ్గిన ధరలు మధ్య తరగతి వినియోగదారులకు ఊరట కలిగిస్తున్నప్పటికీ బహిరంగ మార్కెట్‌లో బియ్యం వ్యాపారులకు గిరాకీ సుమారు పాతిక శాతానికి పైగా పడిపోయింది. ప్రధాన పట్టణాల్లో రోజూవారీ కొనుగోళ్లు భారీగా తగ్గాయని, కొన్ని ప్రాంతాల్లో రైస్‌ షాపులకు బోనీ కూడా లేని పరిస్థితి నెలకొందని వ్యాపారులు వాపోతున్నారు. భవిష్యత్‌లో బియ్యం షాపులు మూత పడి మాల్స్‌లోనే బియ్యం కొనుగోలు చేసే పరిస్థితి వస్తుందని పలువురు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఫవినియోగదారులకు లబ్ధి

రాష్ట్రంలో రేషన్‌ కార్డులు లేని దాదాపు 40 వేల కుటుంబాలు మాత్రమే ప్రస్తుతం బహిరంగ మార్కెట్‌లో బియ్యం కొంటున్నాయన్న అంచనా ఉంది. ఈ కుటుంబాలకు నెలకు 60 వేల టన్నుల బియ్యం అవసరమవుతుంది. అయితే రేషన్‌ ద్వారా సన్నబియ్యం పంపిణీతో మార్కెట్‌లో డిమాండ్‌ గణనీయంగా తగ్గింది. దీంతో ధరలు క్వింటాలుకు రూ.500 నుంచి 1,000 వరకు తగ్గాయని, ఇది వినియోగదారులకు లాభదాయంకంగా ఉందని కొనుగోలుదారులు అంటున్నారు.

ఫసన్న బియ్యానికి తగ్గిన డిమాండ్‌

జిల్లాలో మొత్తం జనాభా 2011 లెక్కల ప్రకారం 8,13,451 మంది కాగా ప్రస్తుతం సుమరు పది లక్షల వరకు జనాభా ఉంది. ప్రస్తుతం ఉన్న రేషన్‌ కార్డుల ఆధారంగా జిల్లా వ్యాప్తంగా 3,07,127 కుటుంబాలు ఉన్నాయి. రేషన్‌ కార్డులు లేని కుటుంబాలు ఇంకా సుమారు 40 వేల వరకు ఉన్నాయన్న అంచనా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అన్నమే ఎక్కువ తింటుంటారు. దీంతో జిల్లాకు ప్రతి నెలా కనీసం సరాసరి ఐదు లక్షల క్వింటాళ్ల బియ్యం అవసరమన్న అంచనా ఉంది. అయితే రేషన్‌ కార్డులు లేని కుటుంబాలు మాత్రమే ప్రైవేటు మార్కెట్‌లో సన్నబియ్యం కొంటున్నారన్న అంచనా ఉంది. తగ్గిన ధరలతో సామాన్య, మధ్య తరగతి కుటుంబీకులపై ఆర్థిక భారం తగ్గి ఊరట చెందుతున్నారు.

బియ్యం రకం గత ఏడాది ధర ...ప్రస్తుతం (క్వింటాలుకు)

హెచ్‌ఎంటీ రూ.5,600-రూ.4,600

సోనా మసూరి రూ.4600-రూ.4,000

జైశ్రీరాం రూ.5,800-రూ.4,600

Updated Date - Jul 23 , 2025 | 01:14 AM