పడిపోతున్న భూగర్భ జలాలు
ABN , Publish Date - May 09 , 2025 | 01:04 AM
ఎండలు మండిపోతుండడంతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. మార్చితో పోల్చితే ఒక్క నెలలోనే సగటున రెండు మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లాలో గత మూడు రోజులు మినహా మిగతా రోజుల్లో 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తున్నది. కరీంనగర్‌తోపాటు పలు గ్రామాలకు తాగునీటి వనరు అయిన లోయర్ మానేరు డ్యాంలో నీటిమట్టం కనీస స్థాయికి పడిపోయే స్థితికి వచ్చింది. మిడ్ మానేరు నుంచి నీటిని వదలడంతో తాగునీటి ఇబ్బంవది తప్పింది.
- నెలరోజుల్లో రెండు మీటర్ల లోతుకు..
- చొప్పదండిలో 16.64 మీ, గంగాధరలో 16.62 మీటర్లలో నీరు
- జిల్లా సగటు 9.02 మీటర్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఎండలు మండిపోతుండడంతో భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతున్నాయి. మార్చితో పోల్చితే ఒక్క నెలలోనే సగటున రెండు మీటర్ల లోతుకు భూగర్భ జలాలు పడిపోయాయి. జిల్లాలో గత మూడు రోజులు మినహా మిగతా రోజుల్లో 43 నుంచి 46 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతూ వస్తున్నది. కరీంనగర్‌తోపాటు పలు గ్రామాలకు తాగునీటి వనరు అయిన లోయర్ మానేరు డ్యాంలో నీటిమట్టం కనీస స్థాయికి పడిపోయే స్థితికి వచ్చింది. మిడ్ మానేరు నుంచి నీటిని వదలడంతో తాగునీటి ఇబ్బంవది తప్పింది. డ్యాం పూర్తి స్థాయి సామర్థ్యం 24.03 టీఎంసీలకు ప్రస్తుతం 6.93 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది. డెడ్ స్టోరేజీ లెవల్ 2.5 టీఎంసీలకు వస్తే తాగునీటికి ఇబ్బంది ఏర్పడుతుంది.
రోజురోజుకు.. ఆందోళనకరంగా..
జిల్లాలో మార్చితో పోల్చితే ఏప్రిల్ మాసాంతానికి ఇల్లందకుంట మండలంలో 2.84 మీటర్ల లోతుకు నీరు పడిపోయింది. కరీంనగర్ అర్బన్ మండలంలో 2.22 మీటర్లు, చొప్పదండిలో 2.17 మీటర్ల లోతుకు నీరు పడిపోయి ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నది. ప్రస్తుతం జిల్లాలో చొప్పదండిలో 16.64 మీటర్ల లోతున, గంగాధరలో 16.62 మీటర్ల లోతున, కరీంనగర్ అర్బన్ మండలంలో 12.82 మీటర్ల లోతున, గన్నేరువరంలో 9.63 మీటర్ల, కొత్తపల్లిలో 9.53 మీటర్ల లోతున నీరు లభిస్తున్నది. హుజూరాబాద్ మండలంలో 9.51 మీటర్లు, తిమ్మాపూర్‌లో 9.32 మీటర్లు, చిగురుమామిడి మండలంలో 8.13 మీటర్లు, సైదాపూర్‌లో 7.80 మీటర్లు, ఇల్లందకుంటలో 6.17 మీటర్లు, కేశవపట్నంలో 6.16 మీటర్లు, కరీంనగర్ రూరల్ మండలంలో 5.46 మీటర్లు, జమ్మికుంటలో 4.69 మీటర్లు, వీణవంకలో 4.41 మీటర్లు, మానకొండూర్‌లో 4.21 మీటర్ల లోతున నీరు లభ్యమవుతున్నది. మార్చితో పోల్చితే ఏప్రిల్‌లో నీటి వినియోగం తగ్గింది. వ్యవసాయ అవసరాలకు నీటి వినియోగం తగ్గినా భూగర్భ జలాలు అడుగంటుతుండడంతో రానున్న రోజుల్లో తాగునీటికి ఇబ్బందులు వచ్చే పరిస్థితి కనిపిస్తున్నది.
జల వనరుల్లో తగ్గుతున్న నీరు
జల వనరులలో నీటి నిల్వలు తగ్గిపోతుండడంతో మిషన్ భగీరథకు ఇబ్బంది తప్పదేమో అనే ఆందోళన వ్యక్తమవుతున్నది. కరీంనగర్‌లో భూగర్భ జలాలు అడుగంటి పోతుండడంతో బోరుబావులు ఎండిపోతున్నాయి. ఇప్పటికే అపార్ట్‌మెంట్లలో, విద్యానగర్ లాంటి ఎగువ ప్రాంతాల్లో బోర్లు అడుగంటిపోయాయి, కరీంనగర్ అర్బన్ మండలంలో 12.82 మీటర్ల లోతుకు నీరు పడిపోయింది. గత నెలలో 10.60 మీటర్ల లోతున నీరు లభ్యం కాగా ఇప్పుడు అది 12.82కు పడిపోవడంతో బోర్లు వట్టిపోతున్నాయి.