Share News

‘పుర’ పీఠాలపై కన్ను..

ABN , Publish Date - Dec 26 , 2025 | 12:58 AM

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిపోవడంతో పరిషత్‌ ఎన్నికల నిర్వహిస్తారని భావిస్తున్నారు..

‘పుర’ పీఠాలపై కన్ను..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిసిపోవడంతో పరిషత్‌ ఎన్నికల నిర్వహిస్తారని భావిస్తున్నారు.. ఈ నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికలు జరగబోతున్నట్లు సంకేతాలు వస్తున్న క్రమంలో జిల్లాలోని సిరిసిల్ల వేములవాడ మున్సిపాలిటీల్లో హడావుడి మొదలైంది. జనవరిలో షెడ్యూల్‌ జారీ చేసి ఫిబ్రవరిలో ఎన్నికలు జరుగుతాయని చర్చలు మొదలయ్యాయి. దీంతో ప్రధాన పార్టీలు ‘పుర’ పీఠాలవైపు చూపు పెట్టాయి. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీల మధ్య పోటీ ఉండబోతుందని భావిస్తున్నారు. ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల్లో 260 సర్పంచుల్లో కాంగ్రెస్‌ 96 మంది, బీఆర్‌ఎస్‌ 106 మంది, బీజేపీ 21 మంది, సీపీఎం ముగ్గురు, ఇతరులు 34మంది గెలుపొందారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు మెజార్టీగా గెలుపొందడంతో మున్సిపల్‌ ఎన్నికల్లో కూడా రెండు పార్టీల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చర్చించుకుంటున్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కే తారకరామారావు ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న వేములవాడ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ మద్దతుదారులు గెలుపొందారు. ఇదే పద్ధతిలో రాబోయే మున్సిపల్‌ ఎన్నికల్లో సిరిసిల్లలో బీఆర్‌ఎస్‌, వేములవాడలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపు కోసం ప్రధానంగా దృష్టి పెడతారని భావిస్తున్నారు. ఈసారి బీజేపీ రెండు మున్సిపాలిటీలో గట్టి ప్రభావం చూపే అవకాశం కనిపిస్తోంది.

రెండు మున్సిపాలిటీలో త్రిముఖ పోరు..

సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో ఎన్నికలు ఎప్పుడు వచ్చిన ఈసారి త్రిముఖ పోరు తప్పదని చర్చించుకుంటున్నారు. రెండు మున్సిపాలిటీలో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఇదే క్రమంలో పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో ఉన్న సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలో బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం కేంద్ర హోం సహాయ శాఖ మంత్రి బండి సంజయ్‌ ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు చెప్పుకుంటున్నారు. సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ప్రాతినిఽధ్యం వహిస్తున్న క్రమంలో ఈసారి ఎన్నికలు త్రిముఖ పోరుతో ఫలితాలు ఆసక్తికరంగా మారనున్నట్లు చెప్పుకుంటున్నారు. 2020 జనవరిలో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ప్రభావం తక్కువగా ఉంది. సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో 67 వార్డులు ఉండగా, ఐదు వార్డుల్లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ముందుగానే ఏకగ్రీవం కాగా, బీఆర్‌ఎస్‌ 38, కాంగ్రెస్‌ మూడు, బీజేపీ 9మంది, ఇతరులు 17 మంది గెలుపొందారు. సిరిసిల్లలో 39 వార్డుల్లో 22 మంది బీఆర్‌ఎస్‌, రెండు కాంగ్రెస్‌, మూడు బీజేపీ, 12 స్థానాల్లో బీఆర్‌ఎస్‌ రెబల్స్‌ గెలిచారు. తర్వాత వారు బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు. వేములవాడలో 28 వార్డుల్లో బీఆర్‌ఎస్‌ 16 మంది, బీజేపీ ఆరుగురు, కాంగ్రెస్‌ ఒకరు, స్వతంత్రులు ఐదుగురు గెలుపొందారు. ఈసారి వేములవాడలో బల్దియా పీఠం చేజిక్కించుకునే విధంగా కాంగ్రెస్‌ ఇప్పటినుంచే కసరత్తు ప్రారంభించింది. సిరిసిల్ల మున్సిపాలిటీలో మళ్లీ బీఆర్‌ఎస్‌ పాగా వేసే విధంగా మాజీ మంత్రి కేటీఆర్‌ దృష్టిపెట్టారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ సిద్ధమవుతున్న క్రమంలో మున్సిపల్‌ ఎన్నికలు ఆసక్తికరంగానే ఉంటాయని భావిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ సర్వే.. కాంగ్రెస్‌ ఇంటెలిజెన్స్‌ నివేదిక

జిల్లాలోని సిరిసిల,్ల వేములవాడ మున్సిపాలిటీలకు 2020 సంవత్సరం జనవరి 22న ఎన్నికలు జరిగాయి. 25న ఫలితాలు వెల్లడించారు. ఈ సంవత్సరం జనవరి 25న పాలకవర్గాల గడువు ముగిసిపోయింది. పురపాలన ముగిసి 11నెలలు గడిచిపోయింది. పంచాయతీ ఎన్నికలు ముగిసిపోవడంతో మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లుగా అధికార పార్టీ నేతలు చర్చలు చేస్తున్నారు. ఈక్రమంలోనే సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ఎంపికపై సర్వే నిర్వహించనుంది. పంచాయతీ ఎన్నికల్లో ఆ పార్టీ ముఖ్య నేతలతో సర్వే నిర్వహించిన సంగతి తెలిసిందే. అదే మాదిరిగా పకడ్బందీగా అభ్యర్థులను ఎంపిక చేయాలని భావిస్తోంది. అధికార కాంగ్రెస్‌ పార్టీ మున్సిపాలిటీలో వ్యూహాత్మకంగా అభ్యర్థులను ఎంపిక చేసే దిశగా ఇంటెలిజెన్స్‌ వర్గాల నుంచి వార్డుల వారీగా నివేదికలు తెప్పించుకున్నట్లుగా చెప్తున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై ప్రజల అభిప్రాయాలతో పాటు బలమైన అభ్యర్థుల జాబితాలను ఇంటెలిజెన్స్‌ ద్వారా వచ్చిన వాటిని పరిశీలించి చైర్మన్‌, కౌన్సిలర్‌ అభ్యర్థులను ప్రకటించనున్నట్లుగా తెలుస్తోంది.

పార్టీల చుట్టూ ఆశావహులు

మున్సిపల్‌ ఎన్నికల హడావుడి మొదలు కావడంతోనే కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, బీజేపీ పార్టీలో ఆశావహులు పార్టీ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. గత ఎన్నికల్లో సిరిసిల్ల మున్సిపాలిటీలో బీఆర్‌ఎస్‌ టికెట్లు ఆశించి భంగపడ్డ వారు రెబల్స్‌గా బరిలో దిగి 12 మంది గెలుపొందడం విశేషం. ఈసారి గెలుపు అభ్యర్థులను ఎంపిక చేసే కసరత్తు మొదలుపెట్టారు. ఈసారి కాంగ్రెస్‌ అధికారంలో ఉండడంతో ఆశావహుల సంఖ్య ఆ పార్టీలో ఎక్కువగానే ఉంది. కొంతమంది బీఆర్‌ఎస్‌లో అవకాశం రాదని భావిస్తున్న వారు కాంగ్రెస్‌ వైపు దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్‌ రెండు పార్టీలకు కొత్త అధ్యక్షులను నియమించిన నేపథ్యంలో మున్సిపల్‌ ఎన్నికల్లో సందడి కూడా పెరుగుతుందని తెలుస్తోంది. మూడు పార్టీల్లోనూ పోటీకి అవకాశం ఇవ్వని పక్షంలో స్వతంత్రులుగా రంగంలోకి దిగడానికి ఇప్పటికే కొంతమంది వార్డుల్లో ప్రజల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.

Updated Date - Dec 26 , 2025 | 12:58 AM