అభ్యర్థుల ఎంపికపై కసరత్తు
ABN , Publish Date - Oct 04 , 2025 | 12:29 AM
జగిత్యాల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నిల్లో పోటీకి దింపేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు జరుపుతున్నాయి. అంగబలం, అర్ధబలం కలిగిఉండడంతో పాటు ప్రజల్లో పేరు ప్రతిష్టలు కలిగిన్న నాయకులను రంగంలోకి దింపేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి.
- స్థానిక ఎన్నికలకు సిద్ధమవుతున్న రాజకీయ పార్టీలు
- ముగ్గురు పేర్లతో జాబితా రూపొందించి అధిష్ఠానానికి పంపే యత్నంలో కాంగ్రెస్
- స్థానికంగానే బీఆర్‌ఎస్ అభ్యర్థుల ఖరారు
- అన్ని స్థానాల్లో పోటీకి బీజేపీ సిద్ధం
- చేరికలపై దృష్టి సారించిన రాజకీయ పక్షాలు
జగిత్యాల, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): జిల్లా పరిషత్, మండల పరిషత్, గ్రామపంచాయతీ ఎన్నిల్లో పోటీకి దింపేందుకు రాజకీయ పార్టీలు అభ్యర్థుల ఎంపికపై కసరత్తులు జరుపుతున్నాయి. అంగబలం, అర్ధబలం కలిగిఉండడంతో పాటు ప్రజల్లో పేరు ప్రతిష్టలు కలిగిన్న నాయకులను రంగంలోకి దింపేందుకు ప్రధాన రాజకీయ పార్టీలు సిద్ధమవుతున్నాయి. అధిష్ఠానం సూచన మేరకు కాంగ్రెస్ పార్టీ ముగ్గురు పేర్లను పంపనుంది. స్థానిక నాయకత్వం అభీష్టం మేరకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బీఆర్‌ఎస్ ఉంది. బీజేపీ అన్ని స్థానాల్లో పోటీకి సిద్ధమవుతోంది. జిల్లా వ్యాప్తంగా 20 జడ్పీటీసీ, ఎంపీపీ, 216 ఎంపీటీసీ, 385 పంచాయతీలు, 3,536 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.
ఎంపీటీసీలుగా పోటీకి అనాసక్తి..
సర్పంచ్‌లు, ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు ఒకేసారి రావడంతో ఆశావహులు ఎక్కువగా సర్పంచ్ పదవులకు మొగ్గు చూపుతున్నారు. సీట్లు దక్కించుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఎంపీటీసీలుగా పోటీ చేయడానికి అంతగా ఆసక్తి కనబరచడం లేదు. గ్రామంలో సర్పంచ్ స్థానానికి పోటీ చేయడంపైనే దృష్టి సారించి పావులు కదుపుతున్నారు.
కాంగ్రెస్‌లో ఆశావహులు ఫుల్..
కాంగ్రెస్ అధికారంలో ఉండడంతో ఆశావహులు అధికంగా ఉన్నారు. దీంతో పార్టీ నాయకత్వం ఆచితూచి అడుగులు వేస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజాధరణతో పాటు ఆర్థికంగా ఉన్న నాయకుల కోసం అన్వేషిస్తోంది. ముగ్గురు పేర్లను పరిశీలించి, వారిలో గెలిచే వ్యక్తి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయనుంది. ప్రధానంగా జడ్పీటీసీ సంబంధించి ప్రతీ మండలానికి ముగ్గురు చొప్పున ఆశావహుల పేర్లను తమకు పంపించాలని అధిష్ఠానం ఎమ్మెల్యేలు, పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జిలను ఆదేశించింది. జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ పదవి జనరల్ మహిళలకు రిజర్వ్ కావడంతో సంబంధిత స్థానాల్లో పోటీ తీవ్రంగా ఉండనుంది. నియోజకవర్గ నేతల బంధువులు, మాజీ ప్రజాప్రతినిధుల బంధువులు, గత ఎన్నికల్లో ప్రయత్నాలు చేసి విఫలమైన నేతలు పోటీ పడుతున్నారు. రిజర్వేషన్లు కలిసి వచ్చిన వారు పోటీపై తమ ఆసక్తిని బయటపెడుతున్నారు. దీంతో ఖర్చు భరించే స్థోమత ఉందా..? లేదా అని అంచనా వేస్తున్నారు. ఈ మేరకు జాబితా సిద్ధం చేసే పనిలో కాంగ్రెస్ నేతలు నిమగ్నమయ్యారు.
అన్నిస్థానాల్లో పోటీకి బీజేపీ సిద్ధం..
జిల్లావ్యాప్తంగా అన్ని జడ్పీటీసీ, ఎంపీటీసీ స్థానాలతో పాటు సర్పంచ్ పదవులకు పోటీలో అభ్యర్థులను నిలపడానికి బీజేపీ సిద్ధమవుతోంది. కొత్త నాయకత్వం తో పాటు గతంలో పార్టీ కోసం పనిచేసి అవకాశాలు రానివారికి ప్రాధాన్యం ఇచ్చేందుకు ప్రణాళికలు వేస్తున్నారు. బీజేపీలో నియోజకవర్గ ఇన్‌చార్జీలు జిల్లా నాయకత్వం ఆధ్వర్యంలో రిజర్వేషన్లకు అనుగుణంగా ఉన్న వారికోసం వేట మొదలైంది. ఆదరణ, అధికార పార్టీ అభ్యర్థులను ఎదుర్కొనే శక్తి ఉన్న నాయకులకు అవకాశం ఇచ్చేందుకు ఆసక్తి చూపుతున్నారు. పార్టీ బలహీనం గా ఉండి పోటీలో నిలిచేందుకు అభ్యర్థులు లేని చోట్ల ఇతర పార్టీల నుంచి వచ్చే నేతలకు అవకాశం ఇవ్వడానికి యోచిస్తున్నారు. కాగా స్థానిక నాయక త్వం అభీష్టం మేరకు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో బీఆర్‌ఎస్ అదిష్ఠానం ఉంది.
సర్వేల ఆధారంగా..
అభ్యర్థుల విషయంలో ప్రధాన రాజకీయ పార్టీలు సర్వే చేయిస్తున్నాయి. సర్వేల నివేదిక ఆధారంగా అభ్యర్థులను రంగంలోకి దించనున్నాయి. మరోవైపు కేడర్ అభిప్రాయాలను కూడా సేకరించేందుకు పార్టీలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా జడ్పీటీసీ అభ్యర్థుల విషయంలో ఏజెన్సీలతో సర్వే చేయిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి.
ముఖ్యనేతలు, అసంతృప్తులకు గాలం..
మెజార్టీ స్థానాలను కైవసం చేసుకునేందుకు రాజకీయ పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి. ఇతర పార్టీల్లోని ముఖ్య నాయకులు, అసంతృప్తులకు గాలం వేస్తున్నాయి. తమకు టికెట్ దక్కదనే అభిప్రాయానికి వచ్చిన పలువు రు ఆశావహులు ఇతర పార్టీల వైపు చూస్తున్నారు. ఇదే సమయంలో ఆయా రాజకీయ పార్టీలు సైతం తమ బలాన్ని పెంచుకునేందుకు ఫిరాయింపు రాజకీ యాలపై దృష్టి సారించాయి. కాగా అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికలు జరుగు తాయనే నమ్మకంతో ముందుకు వెళ్తుండగా... ప్రతిపక్షాలు మాత్రం రిజర్వేషన్లపై ఈనెల 8వ తేదీన కోర్టు ఇచ్చే ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నా యి. రాజకీయ పక్షాల నేతలు అభ్యర్థుల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు. దీంతో పల్లెల్లో రోజురోజుకు రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది.