‘ఉపాధి’ యాక్షన్ ప్లాన్‌కు కసరత్తు
ABN , Publish Date - Oct 22 , 2025 | 12:07 AM
గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వలసలను నివారించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టింది.
(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల)
గ్రామీణ ప్రాంతాల్లో కూలీల వలసలను నివారించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ పథకాన్ని ప్రవేశపెట్టింది. 2006 సంవత్సరం నుంచి ఈ పథకం నిరాటంకంగా కొనసాగుతూనే ఉంది. ఉపాధిహామీ పథకంలో పారదర్శకత కోసం సాంకేతిక వనరులను కూడా ఉపయోగిస్తున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 2026-27 సంవత్సరానికి ఉపాధిహామీలో కూలీలకు పనులు కల్పించడానికి యాక్షన్ ప్లాన్ రూపకల్పనకు కసరత్తు ప్రారంభించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 260 గ్రామపంచాయతీల పరిధిలో 97878 జాబ్ కార్డులు ఉండగా 1.99 లక్షల మంది కూలీలు ఉన్నారు. యక్టివ్ లేబర్ కార్డులు 61 వేలు ఉండగా 93 వేలమంది యాక్టివ్ కూలీలుగా ఉన్నారు.
స్థానిక అవసరాలపై దృష్టి..
జిల్లాలోని 260 గ్రామపంచాయతీలో గ్రామీణ అభివృద్ధి శాఖ 58 రకాల పనులను చేపట్టడానికి గ్రామసభలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం వచ్చే ఏడాది మార్చుతో ముగిసిపోతున్న నేపథ్యంలో జిల్లాలోని గ్రామాల్లో స్థానిక అవసరాల మేరకు గ్రామసభల ద్వారా 2026-27 ఆర్థిక సంవత్సరానికి గ్రామపంచాయతీలో భవన నిర్మాణాలు, అంగన్‌వాడీ భవనాలు, సీసీ రోడ్లు, పాఠశాలల్లో టాయిలెట్లు, ప్రహరీలు, కిచెన్‌షెడ్లు వంటి పనులను గుర్తిస్తున్నారు. మట్టి పనులను తగ్గించి ఇతర పనులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఉపాధిహామీ పథకంలో కూలీలకు వంద రోజుల పని కల్పించాల్సిన లక్ష్యంగా గ్రామసభల్లో పనులు, బడ్జెట్ వివరాలపై తీర్మానాలు చేసి ఉపాధిహామీ వెబ్‌సైట్‌లో పొందుపరిచి కేంద్ర ప్రభుత్వం అనుమతి తీసుకుంటారు. ఇందుకోసం గ్రామ సభల నిర్వహిస్తున్నారు.
ఈసారి ఇందిరమ్మ ఇళ్లకు లింకు..
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఉపాధి పథకాన్ని ఈసారి అనుసంధానం చేయనుంది. ఇందుకోసం ప్రభుత్వం గ్రామీణాభివృ ద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖలకు ఉత్తర్వులు జారీ చేసింది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 7918ఇళ్లు మంజూరుకాగా, 5332ఇళ్ల పనులు నడుస్తున్నాయి. ఇందిరమ్మ ఇళ్ల మంజూ రులో జాబ్‌కార్డులు ఉన్నవారికి, లేనివారు కూడా దరఖాస్తు చేసుకుంటే ఆమోదం పొందేలా చర్యలు తీసుకున్నారు. దీని ద్వారా ఒక్కో ఇందిరమ్మ ఇంటికి ఉపాధిహామీ ద్వారా రూ.27వేలు, స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా రూ.12 వేలు అందుతాయి.