జడ్పీ చైర్మన్ పదవిపై ఉత్కంఠ!
ABN , Publish Date - Sep 26 , 2025 | 12:46 AM
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, పెద్దపల్లి జిల్లా చైర్మన్ పదవి ఏ వర్గానికి దక్కనున్నదనే ఉత్కంఠ మొదలయ్యింది.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తి కాగా, పెద్దపల్లి జిల్లా చైర్మన్ పదవి ఏ వర్గానికి దక్కనున్నదనే ఉత్కంఠ మొదలయ్యింది. ఇవేగాకుండా సర్పంచ్, ఎంపీటీసీ, ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాలు ఏ వర్గానికి చెందిన వారికి రిజర్వు అయ్యాయనే విషయమై రాజకీయ వర్గాల్లో పెద్దఎత్తున చర్చ జరుగుతున్నది. జిల్లాలో గల ఎంపీపీ, జడ్పీటీసీ స్థానాల రిజర్వేషన్లకు స్పందించి ఈనెల 24వ తేదీన ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ప్రచురితమైన కథనంపై కూడా జిల్లాలో చర్చ జరుగుతున్నది. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేస్తున్న దృష్ట్యా పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పదవి ఏ వర్గానికి దక్కుతుందనే చర్చ జరుగుతున్నది. 2019లో జరిగిన ఎన్నికల్లో చైర్మన్ స్థానం బీసీ జనరల్‌కు కేటాయించగా, ఈసారి ఎస్సీలకు గానీ, జనరల్‌కు గానీ కేటాయించాల్సి ఉంది. ఆ సమయంలో రాష్ట్రంలో గల 32జడ్పీల్లో 5సీట్లను ఎస్సీలకు కేటాయించారు. 16స్థానాలను జనరల్‌కు కేటాయించారు. జడ్పీచైర్మన్ల రిజర్వేషన్లను రాష్ట్రస్థాయిలో పంచాయతీరాజ్ కమిషనర్ ఖరారు చేయనున్నారు. 2011జనాభా లెక్కల ప్రకారం మండల, జిల్లా పరిషత్‌ల పరిధిలోని మొత్తం జనాభా, జిల్లా ఎస్సీల జనాభాతో లెక్కించగా వచ్చే శాతాన్ని పైనుంచి కిందకు వరుసక్రమంలో జిల్లాలను చేరుస్తారు. రొటేషన్ పద్ధతిలో రిజర్వేషన్లు ఖరారు చేస్తుండడంతో మొదటి 5జిల్లాలను మినహాయించి ఆ తర్వాత 5జిల్లాల జడ్పీచైర్మన్ పదవులను ఎస్సీలకు కేటాయించనున్నారు. జిల్లాలో గ్రామీణప్రాంతాల్లో ఉన్న మొత్తం జనాభాలో ఎస్సీలు 19.14శాతం ఉన్నారు. ఎస్సీ జనాభాలో పెద్దపల్లి జిల్లా మొదటి 10స్థానాల్లో ఉంటే మాత్రం తప్పరిసరిగా ఎస్సీ వర్గాలకు చైర్మన్ పదవిని ఖరారు చేయనున్నారు. లేదంటే జనరల్‌కు కేటాయించే అవకాశాలున్నాయి.
ఎస్సీలకు మూడు జడ్పీటీసీ స్థానాలు..
జిల్లాలో గల 13గ్రామీణ మండలాల్లో కోటా ప్రకారం 3స్థానాలను ఎస్సీ సామాజికవర్గానికి చెందిన వారికి రిజర్వు చేయనున్నారు. 2011జనాభా లెక్కల ప్రకారమే ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్లు ఖరారు చేస్తున్న దృష్ట్యా జిల్లాలో 3స్థానాలు రిజర్వు అవుతున్నాయి. జిల్లాలోని మంథని మండలంలో 29.42 శాతం, అంతర్గాం మండలంలో 26.62శాతం, ఎలిగేడు మండలంలో 24.85శాతం, పాలకుర్తి మండలంలో 22.82శాతం, జూలపల్లి మండలంలో 21శాతం, ధర్మారం మండలంలో 20.50శాతం, సుల్తానాబాద్ మండలంలో 20.31శాతం, పెద్దపల్లి మండలంలో 18.54శాతం, కాల్వశ్రీరాంపూర్ మండలంలో 17.52శాతం, రామగిరి మండలంలో 17.27శాతం, కమాన్‌పూర్ మండలంలో 16.22 శాతం, ఓదెల మండలంలో 16.21శాతం, ముత్తారం మండలంలో 12.55శాతం షెడ్యూల్ కులాలకు చెందిన వారి జనాభా ఉంది. 2019లో జరిగిన ఎన్నికల్లో మంథని, అంతర్గాం, ఎలిగేడు మండలాలను ఎస్సీ వర్గాలకు కేటాయించారు. ఈసారి ఆ వరుసలో పాలకుర్తి, జూలపల్లి, ధర్మారం మండలాల స్థానాలు ఎస్సీలకు రిజర్వు అవుతున్నాయి. అలాగే గత ఎన్నికల్లో ఎంపీపీ స్థానాల్లో మంథని, అంతర్గాం మండలాలను ఎస్సీ వర్గాలకు కేటాయించగా, ఈసారి ఎలిగేడు, పాలకుర్తి, జూలపల్లి, ధర్మారం మండలాలు ఎస్సీ వర్గాలకు కేటాయించారు. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించినా, మొత్తంగా 50శాతానికి మించకుండా రిజర్వేషన్లు కల్పించినా కూడా ఎస్సీస్థానాల్లో ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవు. కేవలం బీసీ, జనరల్ స్థానాలే అటు, ఇటుగా మారనున్నాయి.
జడ్పీ చైర్మన్ ఎస్సీలకు కేటాయిస్తే ఆ 3మండలాల నుంచే పోటీ..
జడ్పీ చైర్మన్ పదవి ఎస్సీలకు రిజర్వు చేస్తే మాత్రం పాలకుర్తి, జూలపల్లి, ధర్మారం మండలాల నుంచి గెలుపొందే జడ్పీటీసీల్లో ఎవరో ఒకరు జడ్పీ చైర్మన్ పదవిని దక్కించుకోనున్నారు. దీంతో ఈ మూడు స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది. అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్‌ఎస్, భారతీయ జనతాపార్టీలకు చెందిన నాయకులు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తీవ్రంగా శ్రమించ నున్నారు. సాధారణంగా రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజారిటీ సీట్లు దక్కుతాయి. ఒకవేళ జడ్పీ చైర్మన్ పదవి జనరల్‌కు కేటాయిస్తే మంథని, అంతర్గాం, ఎలిగేడు, సుల్తానాబాద్, పెద్దపల్లి, కాల్వశ్రీరాంపూర్, ఓదెల, రామగిరి, కమాన్‌పూర్, ముత్తారం మండలాల నుంచి గెలుపొందే వాళ్లు జడ్పీ చైర్మన్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. అయితే మహిళలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్న దృష్ట్యా జడ్పీ చైర్మన్ పదవిని మహిళలకు కేటాయిస్తే మహిళలకు చైర్మన్ పదవి దక్కనున్నది. జనరల్‌కు కేటాయిస్తే పురుషులతో పాటు మహిళలు కూడా చైర్మన్ అయ్యేందుకు అవకాశం ఉంది. ప్రభుత్వం అధికారికంగా రిజర్వేషన్లు ప్రకటించే వరకు ఉత్కంఠ కొనసాగుతూనే ఉంటుంది.