Share News

రిజర్వేషన్లపై ఉత్కంఠ

ABN , Publish Date - Sep 24 , 2025 | 12:54 AM

స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఆయా పార్టీల్లో, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ల వ్యవహారం ఎటూ తేలకపోవడంతో ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి.

రిజర్వేషన్లపై ఉత్కంఠ

- కసరత్తు పూర్తి చేసిన అధికార యంత్రాంగం

- కమిషనరేట్‌కు స్థానాల వారీగా జాబితా

- నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశం

జగిత్యాల, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లపై ఆయా పార్టీల్లో, ఆశావహుల్లో ఉత్కంఠ నెలకొంది. రిజర్వేషన్ల వ్యవహారం ఎటూ తేలకపోవడంతో ఎన్నికలు వాయిదా పడుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేస్తుండగా ప్రభుత్వం కూడా రిజర్వేషన్ల ఖరారుపై దృష్టి సారించింది. రెండు రోజులుగా ఈ వ్యవహారంపై అధికార వర్గాలు కసరత్తు చేస్తున్నాయి. రిజర్వేషన్లు ఖరారైతే నెలాఖరులోగా జడ్పీటీసీ, ఎంపీటీసీ, గ్రామ పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ వెలువడే అవకాశముందన్న ప్రచారం జరుగుతోంది. దీంతో ఆశావహులు తమకు రిజర్వేషన్లు అనుకూలిస్తాయో లేదోనని ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు.

ఫజిల్లాలో 385 పంచాయతీలు

జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల పాలక వర్గాల పదవీ కాలం 2024 ఫిబ్రవరి 1న ముగిసింది. 16 నెలల నుంచి పంచాయతీలు ప్రత్యేక అధికారుల పాలనలో కొనసాగుతున్నాయి. జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలకు సైతం 2024 జూన్‌తో గడువు ముసిగింది. ప్రస్తుతం ఎంపీటీసీ, జడ్పీటీసీ స్థానాలను పునర్విభజన చేయగా ఈనెల 30లోగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలన్న హైకోర్టు ఆదేశాలతో ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. జిల్లాలోని 385 పంచాయతీలు, 3,536 వార్డులు అంతేస్థాయిలో పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి. 205 ఎంపీటీసీ, 20 జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు నిర్వహించడానికి కసరత్తు జరుగుతోంది. పోలింగ్‌ రెండు విడతల్లో నిర్వహించడానికి నిర్ణయించారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని ఎంపిక చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశించడంతో ఆ దిశగా అధికారులు కసరత్తు చేస్తున్నారు.

ఫప్రధాన అడ్డంకి రిజర్వేషన్లే..

స్థానిక సంస్థల ఎన్నికలు ఆలస్యమయ్యేందుకు రిజర్వేషన్ల వ్యవహారమే ప్రధాన అడ్డంకిగా మారింది. 2019 ఎన్నికల సందర్భంగా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం 2018 గ్రామ పంచాయతీ చట్టాన్ని తీసుకువచ్చింది. ఈ చట్టం ప్రకారం జీపీల రిజర్వేషన్లు పదేళ్ల పాటు కొనసాగాలి. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక పంచాయతీరాజ్‌ చట్టాన్ని సవరించడంతో రిజర్వేషన్లు మారనున్నాయి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయించడంతో ప్రభుత్వం రిజర్వేషన్లపై ఎలా ముందుకు వెళ్తుందో అనే ఉత్కంఠ నెలకొంది.

ఫఎన్నికల పనుల్లో అధికారుల బిజీ

ఎన్నికల్లో రిజర్వేషన్‌ విధానాన్ని ఖరారు చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జడ్పీటీసీ, జడ్పీ చైర్మన్‌, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్‌, వార్డు సభ్యుల రిజర్వేషన్లపై అధికారులు కసరత్తు ప్రారంభించారు. సీఎస్‌ ఆదేశాలతో జిల్లాల వారీగా రిజర్వేషన్ల విధానం అమలు చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బీసీలకు 42 శాతం, ఎస్సీ, ఎస్టీలకు 2011 జనాభా లెక్కల ప్రకారం రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో లాటరీ విధానంలో మహిళా రిజర్వేషన్లు ప్రకటించనున్నారు. ఇక షెడ్యూల్డ్‌ ఏరియాలో ఎస్టీ జనాభా ఆధారంగా రిజర్వేషన్లను కేటాయించి, వంద శాతం ఎస్టీ గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌లు, వార్డు సభ్యుల పదవులు వారికే రిజర్వే చేయనున్నట్లు అధికార వర్గాలు అంటున్నాయి. జిల్లా పరిషత్‌ కార్యాలయంలో రిజర్వేషన్ల ప్రక్రియపై కసరత్తు జరుగుతోంది.

ఫరెండు రోజుల్లోనే ప్రక్రియ..

గ్రామ పంచాయతీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీల ఎన్నికలకు రిజర్వేషన్లను కేటాయించే బాధ్యతలను ప్రభుత్వం సంబంధిత అధికారులకు అప్పగించింది. ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల మేరకు కేవలం ఒకటి, రెండు రోజుల్లోనే రిజర్వేషన్ల కేటాయింపు ప్రక్రియను పూర్తి చేసేలా అధికారులు పనిచేస్తున్నారు. ఈ మేరకు కలెక్టర్‌, అదనపు కలెక్టర్లు, పంచాయతీ, జడ్పీ అధికారులతో ఉన్నతాధికారులు ఇప్పటికే వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. జడ్పీ చైర్మన్‌ స్థానాల రిజర్వేషన్లను రాష్ట్ర స్థాయిలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ ఖరారు చేయనున్నారు. జడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల రిజర్వేషన్లను కలెక్టర్‌ కేటాయించనున్నారు. ఎంపీటీసీ, సర్పంచ్‌ స్థానాలను ఆర్డీవో ఖరారు చేయనుండగా, గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల స్థానాల రిజర్వేషన్లను ఆయా మండలాల ఎంపీడీవోలు కేటాయించనున్నారు.

ఫపూర్తయిన ఓటరు జాబితా..

పంచాయతీ, ప్రాదేశిక ఎన్నికల నిర్వహణకు వార్డుల వారీగా తుది ఓటరు జాబితా ఇప్పటికే పూర్తయింది. ఎన్నికల సంఘం ఎప్పుడు నోటిఫికేషన్‌ ఇచ్చినా ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా కసరత్తు పూర్తయింది. ఓటరు జాబితాతో పాటు పోలింగ్‌ కేంద్రాల గుర్తింపు, మ్యాపింగ్‌ పూర్తి కాగా బ్యాలెట్‌ బాక్సులతో పాటు బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణకు అనుగుణంగా సిద్ధంగా ఉంచారు. ఎన్నికల సిబ్బందికి పలు విడతలుగా శిక్షణ సైతం ఇచ్చారు.

ఫపల్లెల్లో ఆశావహుల సందడి...

పల్లెల్లో స్థానిక ఎన్నికలపై రాజకీయ పార్టీలతో పాటు ఆశావహులు గంపెడాశతో ఎదురుచూస్తున్నారు. ఈ మేరకు ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుండడంతో ఆశావహులు తమ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. గ్రామంలో ఇప్పటి వరకు పట్టించుకోని పలువురు ఓటర్లను సైతం ఆప్యాయంగా పలకరిస్తూ యోగ క్షేమాలు తెలుసుకుంటున్నారు. యువతకు విందులు ఏర్పాటు చేస్తున్నారు. తమను గెలిపిస్తే గ్రామానికి అవసరమైన పనులన్నీ చేసి పెడతామనే నమ్మకం కల్పించేలా గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీంతో పల్లెల్లో రాజకీయ హడావుడి పెరిగింది.

ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు..

-బుదుమజ్జి సత్యప్రసాద్‌, కలెక్టర్‌

జిల్లాలో గ్రామ పంచాయతీలు, మండల పరిషత్‌లు, జిల్లా పరిషత్‌ ఎన్నికలను ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు నిర్వహిస్తాం. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఎన్నికలను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాం. ఇందుకు అవసరమైన ప్రాథమిక కసరత్తు పూర్తి చేశాం. ఎన్నికల సంఘం ఆదేశాలను కచ్చితంగా అమలు చేస్తాం.

జిల్లాలో స్థానిక సంస్థల వివరాలు...

-------------------------------------------

జడ్పీటీసీ స్థానాలు...20

ఎంపీటీసీ స్థానాలు...216

ఎంపీపీ స్థానాలు..20

సర్పంచ్‌ స్థానాలు..385

వార్డులు..3,586

పంచాయతీ ముసాయిదా ఓటర్లు...6,07,222

పురుషులు.. 2,89,249

మహిళలు...3,17,964

ఇతరులు..9

Updated Date - Sep 24 , 2025 | 12:54 AM