Share News

సామాన్యులు సైతం సాయుధులై..

ABN , Publish Date - Sep 17 , 2025 | 01:20 AM

తెలంగాణ విమోచన పోరాటం.. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తికోసం సాగిన మహోజ్వల ఉద్యమం... నాజీలను మించిన నిజాం సైన్యాలు, రజాకారులు పల్లెల్లో జరిపిన అకృత్యాలు, నిరంకుశత్వానికి వెల్లువెత్తిన తిరుగుబాటు బావుటా... బాంచెన్‌ నీ కాల్మొక్తం... అంటూ మోకరిల్లిన తెలంగాణ.. సామాన్యులే సాయుధులై సాగించిన రణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రభాగాన నిలిచింది.

సామాన్యులు సైతం సాయుధులై..

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)

తెలంగాణ విమోచన పోరాటం.. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తికోసం సాగిన మహోజ్వల ఉద్యమం... నాజీలను మించిన నిజాం సైన్యాలు, రజాకారులు పల్లెల్లో జరిపిన అకృత్యాలు, నిరంకుశత్వానికి వెల్లువెత్తిన తిరుగుబాటు బావుటా... బాంచెన్‌ నీ కాల్మొక్తం... అంటూ మోకరిల్లిన తెలంగాణ.. సామాన్యులే సాయుధులై సాగించిన రణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అగ్రభాగాన నిలిచింది. సాయుధ పోరులో జిల్లాకున్న ప్రాముఖ్యతను ప్రాణాలు వదిలిన వారి చరిత్రలే చెబుతాయి. నైజాంకు వ్యతిరేకంగా అనేక వ్యూహాలు, ఆయుధ శిక్షణ క్యాంపులు జిల్లాలోనే సాగాయి. ఆ మహోజ్వల పోరాటంలో సిరిసిల్ల ధిక్కార స్వరాన్ని వినిపించింది. రజాకార్ల దౌర్జన్యం, వెట్టి చాకిరిని రూపుమాపడం కోసం సాగిన గెరిల్లా పోరాటాలు, పోలీసుల చర్యలు సిరిసిల్లపై చెరగని ముద్రగా మిగిలిపోయాయి. మహోజ్వల పోరాటంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గాలిపెల్లి గ్రామంతో పాటు అనేక గ్రామాల్లో పలువురు రక్త తర్పణం చేశారు.

ఫ నేడు ప్రజాపాలన దినోత్సవం..

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పోలీస్‌ పెరేడ్‌ గ్రౌండ్‌లో సెప్టెంబరు 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రజాపాలన దినోత్సవంగా వేడుకలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ ఆవిష్కరించున్నారు. ఉదయం 10 నుంచి 10.10గంటల వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించానున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రజలు ప్రజాపాలనలో దినోత్సవంలో భాగస్వామ్య కావడానికి సిద్ధమయ్యారు. తెలంగాణ విమోచన, ప్రజాపాలన దినోత్సవం నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో నిజాం సర్కారుకు వ్యతిరేకంగా సాగిన పోరాట జ్ఞాపకాలను ప్రజలు నెమరువేసుకుంటున్నారు. దేశమంతా 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకున్న నిజాం పాలనలో హైదరాబాద్‌ సంస్థాన వాసులు మాత్రం ఆ మధుర క్షణాలను అనుభవించడానికి 1948 సెప్టెంబరు 17 వరకు పోరాడాల్సి వచ్చింది. 224ఏళ్ల పాటు పాలించిన నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా చారిత్రాత్మకంగా సాగిన పోరాటాన్ని ప్రజలు ఆ నెత్తుటి జ్ఞాపకాలను మననం చేసుకుంటున్నారు. ఈ పోరులో సిరిసిల్ల ప్రాంతం ముఖ్య భూమికను పోషించింది. నిజాం ప్రభుత్వం కమ్యూనిస్టు పార్టీని నిషేధించినా కదిలిన పల్లెల ఆగ్రహాన్ని చూడలేక నిషేధాన్ని ఎత్తివేసింది. అలాంటి మహత్తర తెలంగాణ విమోచన పోరులో సిరిసిల్ల ప్రాంత గెరిల్లా యోధులు రక్త తర్పణం చేశారు. జిల్లాలోని ఇల్లంతకుంట మండలం గాలిపల్లికి చెందిన కమ్యూనిస్టు నాయకుడు బద్దం ఎల్లారెడ్డితోపాటు సిరిసిల్లకు చెందిన అమృతలాల్‌శుక్లా, మామిడిపల్లి హన్మంతరావు, సిహెచ్‌ రాజలింగం, నిమ్మపల్లి ఓదెలురెడ్డి, నాగారం కిష్టయ్య, మంచాల రాజేశం, రాగులపల్లి నర్సయ్య, సింగిరెడ్డి భూపతిరెడ్డి, ఇలా అనేక మంది తెలంగాణ పోరాటంలో పాలుపంచుకున్నారు.

ఫ సిరిసిల్లలో చేనేత కార్మిక సభ...

ఆంధ్ర మహాసభ స్ఫూర్తితో సిరిసిల్ల నేత కార్మికులు కూడా ముందుకు సాగారు. చేనేత కార్మికుల సమస్యలను పరిష్కరించడం కోసం చేనేత కార్మిక సంఘం ఏర్పడింది. సంఘం తెలంగాణ తృతీయ మహాసభను సిరిసిల్లలో జరుపుకున్నారు. అనేక మంది చేనేత కార్మిక ప్రతినిధులు సిరిసిల్లకు తరలివచ్చారు. చేనేత కార్మిక మహాసభ ఒక చారిత్రాక్మక సంఘటనగా రూపుదిద్దుకుంది. మహాసభ తర్వాత అమృతలాల్‌శుక్లాను ఉద్యోగం నుంచి తొలగించే ప్రయత్నం చేయగా స్వచ్ఛందగా ఉద్యోగానికి రాజీనామా చేసి పోరాటాన్ని ముందుకు నడిపించారు.

ఫ ఉద్యమానికి ఊపిరినిచ్చిన ఆంధ్రమహాసభ..

తెలంగాణ సాయుధ పోరాటానికి సిరిసిల్లలో జరిగిన ఆంధ్రమహాసభ ఊపిరినిచ్చింది. నాలుగవ మహాసభ 1935లో మాడపాటి హన్మంతరావు అధ్యక్షతన సిరిసిల్లలో భీమకవి నగరంగా జరిగింది. 1944లో నల్గొండ జిల్లా భువనగిరిలో జరిగిన ఆంధ్రమహాసభ తరువాత కాంగ్రెస్‌ వాదులు, కమ్యూనిస్టులకు మధ్య విభేదాలు చోటు చేసుకున్నాయి. గాలిపల్లికి చెందిన బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణరెడ్డి తదితరులు కమ్యూనిస్టు ఉద్యమం వైపు వెళ్లారు. దీంతో రైతాంగ పోరాటాలు మరింత ఊపునందుకున్నాయి. ఈ ఉద్యమంలో 1947లో ఇల్లంతకుంట మండలం గాలిపల్లి కేంద్రంగా ఉద్యమకారులు ఆయుధాలను సమకూర్చుకుంటున్నారని, గ్రామ ప్రజలు ఉద్యమం వైపు వెళుతున్నారని నిజాం సర్కార్‌ 300 మంది పోలీసులతో క్యాంప్‌ను ఏర్పాటు చేసింది. గాలిపల్లివాసులు పోలీసుల చర్యను తీవ్రంగా ప్రతిఘటించగా, పోలీసులు జరిపిన కాల్పులకు 14మంది నేలరాలారు. దీంతో గ్రామస్థులు పోలీస్‌ క్యాంప్‌పై దాడి చేసి ఎస్‌ఐతోపాటు ఆరుగురిని చంపారు. ఇదే సమయంలో గర్జనపల్లి, కోనరావుపేట, శివంగాలపల్లి పోలీసు క్యాంప్‌లపై కూడా దాడులు జరిగాయి. ఈ నేపథ్యంలో 1950 జూన్‌ 10న గెరిల్లాలు సిరిసిల్ల పోలీస్‌స్టేషన్‌పై దాడి జరిపి ఆరు తుపాకులు, రెండు 12బోర్‌ తుపాకులను ఎత్తుకెళ్లారు. ఇదే సమయంలో తహసీల్‌ కార్యాలయం వద్ద కాపాలా ఉన్న పోలీసులు కూడా ఆయుధాలు వదిలిపారిపోవడం గమనార్హం. స్వాతంత్రోద్యమం, నిజాం వ్యతిరేక పోరాటంలో మహిళలు తుపాకులు పట్టి ఉద్యమ బాటలో నడిచారు. దానికి ఆంధ్ర మహిళా సభ స్ఫూర్తిని ఇచ్చింది. 1935లో సిరిసిల్లలో ఆంధ్రమహిళా సభను మాడపాటి మాణిక్యమ్మ అధ్యక్షతన జరిగింది. సభలో యెల్ల ప్రగడ సీతాదేవిలు పాల్గొన్నారు.

ఫ గెరిల్లాల శిక్షణ కేంద్రం మానాల..

నిజాం సర్కార్‌కు వ్యతిరేకంగా సాగిన తెలంగాణ సాయుధ పోరు నుంచి మొన్నటి వరకు మావోయిస్టుల దళాలకు ఆశ్రయం ఇచ్చి ఉద్యమ స్ఫూర్తిని మానాల చాటుకుంటుంది. ఆసియా కండంలోని పీపుల్స్‌వార్‌ నిర్మించిన తొలి మహిళా స్తూపం మానాల పోరాటాల జ్ఞాపకాలను గుర్తుచేస్తుంది. సిరిసిల్ల డివిజన్‌ సరిహద్దులో ఉన్న మానాల గిరిజన ప్రాంతం ఎంతో మంది వీరులను తీర్చిద్దింది. ఆ ప్రాంతం తెలంగాణ పోరాటయోధులకు శిక్షణ జోన్‌గా ఉండేది. సిరిసిల్లకు చెందిన అమృత్‌లాల్‌శుక్లా, బద్దం ఎల్లారెడ్డిల నాయకత్వంలో కార్యకర్తలకు ఆ అరణ్యం గాయిది గుట్ట శిక్షణా కేంద్రంగా ఉండేది. కమ్యూనిస్టు గెరిల్లాకు ఆ గ్రామ భూస్వామి రాజిరెడ్డి భోజనాలు సరఫరా చేసేవారు. ఎంతో నమ్మకంగా మానాల స్థావరం ఉండేది. మానాలలో గెరిల్లాలు శిక్షణ పొందుతుండగా... వంద మంది నిజాం సర్కారు పోలీసులు నిర్బంధించి రుద్రంగి క్యాంపునకు గెరిల్లాలను తరలించారు. ఆ తరువాత పలువురిని మానాల అడవుల్లోకి తీసుకువెళ్లి తుపాకులతో కాల్చి చంపారు. ఇలా గెరిల్లా యోధులకు ఆనాడు అండగా నిలిస్తే... ఆ పోరాట స్ఫూర్తి నక్సల్‌ ఉద్యమంలో కూడా మానాలనే కేంద్రంగా మారింది.

ఫ పోరాటాల పురిటి గడ్డ.. గాలిపల్లి..

ప్రపంచ చరిత్రలో తెలంగాణ సాయుధ పోరాటానికి మహోన్నత స్థానం ఉంది. జిల్లాలోని గాలిపల్లి తెలంగాణ సాయుధ పోరాటంలో నిజాం సర్కార్‌కు ఎదురొడ్డి తుపాకులు చేతబూని నిలిచింది. మహాత్మాగాంధీ పిలుపునందుకొని బద్దం ఎల్లారెడ్డి పోరాటంలో ముందుకు సాగారు. గాలిపల్లిలో బద్దం ఎల్లారెడ్డితోపాటు గెరిల్లా దళనాయకుడు అమృత్‌లాల్‌ శుక్లా, ఉద్యమకారులు, దళ నాయకులు తలదాచుకుంటున్నారని కలెక్టర్‌తో కలిసి పోలీసు బలగాలు చుట్టు ముట్టాయి. పోలీసుల తీరుకు గాలిపల్లి వాసులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కలెక్టర్‌ ఆదేశాల మేరకు కాల్పులు చోటు చేసుకున్నాయి. 14 మంది మృతిచెందారు. ఇలా తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్యభూమికను పోషించిన గాలిపల్లి ప్రజలు ఇప్పటికి ఆ జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు.

Updated Date - Sep 17 , 2025 | 01:20 AM