Share News

తనిఖీలతో మాదక ద్రవ్యాల నిర్మూలన

ABN , Publish Date - Dec 23 , 2025 | 12:11 AM

మాదక ద్రవ్యాల వాడకం నిర్మూలించేందుకు జిల్లాలో అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్‌ పమేలా సత్పతి పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు.

తనిఖీలతో మాదక ద్రవ్యాల నిర్మూలన
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ క్రైం, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): మాదక ద్రవ్యాల వాడకం నిర్మూలించేందుకు జిల్లాలో అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని కలెక్టర్‌ పమేలా సత్పతి పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి నార్కో కో ఆర్డినేషన్‌ సెంటర్‌ కమిటీ సమావేశం కలెక్టరేట్‌ కాన్ఫరెన్స్‌ హాల్లో సోమవారం జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ పోలీస్‌, ఎక్సైజ్‌, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ అధికారులు సమన్వయంతో మాదకద్రవ్యాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలు జిల్లాలో సత్ఫలితాలను ఇస్తున్నాయని అన్నారు. పోలీస్‌, ఎక్సైజ్‌ అధికారులు సమన్వయంతో డ్రగ్స్‌ మూలాలను పెకిలించి వేయాలన్నారు. ప్రైవేట్‌ మెడికల్‌ స్టోర్స్‌లో అమ్మకాలను పరిశీలించాలని ఆదేశించారు. వైద్యుల చీటీ లేకుండా మత్తు కలిగించే మందులు విక్రయిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అన్ని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలలు, హాస్టళ్లు, కళాశాలలను సందర్శించి డ్రగ్స్‌ పైనే కాకుండా మద్యపానం, ధూమపానం అనర్థాలపై కూడా విద్యార్థులకు అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్‌ ఆదేశించారు. పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం మాట్లాడుతూ పోలీస్‌ శాఖ తరపున విద్యార్థులకు మత్తు పదార్థాల అనర్థాలపై అవగాహన కల్పిస్తున్నామని, డాగ్‌ స్క్వాడ్‌ ద్వారా ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. డ్రగ్స్‌ అమ్మకాలు, వినియోగం, రవాణా వంటి నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సమావేశంలో అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రపుల్‌ దేశాయ్‌, ఆర్డీవోలు మహేశ్వర్‌, రమేష్‌ బాబు, ఎక్సైజ్‌ సూపరింటెండెంట్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు.

Updated Date - Dec 23 , 2025 | 12:11 AM