Share News

ముగిసిన ప్రచారం

ABN , Publish Date - Dec 13 , 2025 | 12:55 AM

జిల్లాలోని మలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది. జిల్లా వ్యాప్తంగా 144 సర్పంచ్‌, 1,276 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న అభ్యర్థులు చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు.

ముగిసిన ప్రచారం

- పల్లెల్లో ప్రలోభాలకు ఎర

- మహిళా, యువజన, కుల సంఘాల ఓట్లపై దృష్టి

-144 సర్పంచ్‌, 1,276 వార్డు స్థానాలకు ఎన్నికలు

-బరిలో సర్పంచ్‌ పదవులకు 521 మంది, వార్డులకు 2,662 మంది

-రేపు మలి విడత పోలింగ్‌

జగిత్యాల, డిసెంబరు 12 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని మలి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి శుక్రవారం సాయంత్రంతో తెర పడింది. జిల్లా వ్యాప్తంగా 144 సర్పంచ్‌, 1,276 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. గెలుపే ధ్యేయంగా పావులు కదుపుతున్న అభ్యర్థులు చివరి రోజు ముమ్మరంగా ప్రచారం నిర్వహించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు మేజర్‌ పంచాయతీలు, మండల కేంద్రాలు, ఇతర ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించారు. జిల్లాలోని వైన్‌ షాపులు మూత పడ్డాయి. జగిత్యాల, చొప్పదండి నియోజకవర్గాల్లో రాజకీయం పతాక స్థాయికి చేరింది. ఎన్నికలకు గడువు సమీపిస్తుండడంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునుందుకు గ్రామాల్లో పెద్ద ఎత్తున ప్రలోభాలకు దిగుతున్నారు. యథేచ్ఛగా మధ్యంతో పాటు డబ్బు పంపిణీతో ఓటర్లను ప్రలోభాలకు గురిచేస్తున్నారు.

ఫచిన్న గ్రామాల్లోనూ భారీగానే..

మలి విడత ఎన్నికలకు గడువు సమీపిస్తున్న కొద్ది అభ్యర్థుల్లో టెన్షన్‌ పెరుగుతోంది. వెయ్యి లోపు ఓటర్లు ఉన్న చిన్న గ్రామ పంచాయతీల్లోనూ రూ.15 లక్షల వరకు ఖర్చు పెట్టేందుకు పలువురు అభ్యర్థులు వెనకాడడం లేదు. గ్రామాల్లోని వార్డుల వారీగా లెక్కలు వేసి కేటాయింపులు చేస్తున్నారు. ఒక్కో వార్డుకు రూ.లక్ష, ఒక్కో కుల సంఘానికి రూ.2 లక్షల వరకు ముట్టజెప్పుతున్నారు. కుల సంఘాల పెద్దల వద్ద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు ఉంచుతూ గంపగుత్తగా ఓట్లను పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. అధిక సంఖ్యలో ఉన్న మహిళా ఓటర్లపై అభ్యర్థులు ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. మహిళా సంఘాల సమస్యల పరిష్కారంపై హామీలు గుప్పిస్తున్నారు. పెద్ద సంఖ్యలో మహిళల ఓట్లు పొందేందుకు మహిళా సంఘాలకు రూ.లక్షల్లో ముట్టజెప్పుతూ ప్రలోభాలను సాగిస్తున్నారు.

ఫ10 సర్పంచ్‌ స్థానాలు ఏకగ్రీవం..

జిల్లాలో మలి విడతలో 144 సర్పంచ్‌, 1,276 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలకు ఏర్పాట్లు చేశారు. ఇందులో 10 సర్పంచ్‌, 330 వార్డు సభ్యుల స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 124 సర్పంచ్‌, 946 వార్డు సభ్యుల స్థానాలకు గాను 521 మంది సర్పంచ్‌ అభ్యర్థులు, 2,662 మంది వార్డు సభ్యుల అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈనెల 14వ తేదీన పోలింగ్‌ నిర్వహించనున్నారు. జిల్లాలో రెండో విడతలో జగిత్యాల రూరల్‌ మండలం చర్లపల్లి సర్పంచ్‌గా మేడిపల్లి వనిత, కొడిమ్యాల మండలం చింతలపల్లి సర్పంచ్‌గా ఎలకపల్లి సుమలత, రాయికల్‌ మండలం వీరాపూర్‌ సర్పంచ్‌గా దిండిగల గంగు, సారంగపూర్‌ మండలం నాయకపు గూడెం సర్పంచ్‌గా పుష్పనాథ్‌, సారంగపూర్‌ మండలం రంగపేట వడ్డెర కాలనీ సర్పంచ్‌గా పల్లెపు మాదవి, సారంగపూర్‌ మండలం బీంరెడ్డి గూడెం సర్పంచ్‌గా మేన్నేని ప్రమీళ, బీర్‌పూర్‌ మండలం గోండు గూడెం సర్పంచ్‌గా పురుక దీప కల్పన, రాయికల్‌ మండలం వస్తాపూర్‌ సర్పంచ్‌గా గుడ్లవత్‌ తిరుపతి, జగిత్యాల అర్బన్‌ మండలం అంబారిపేట సర్పంచ్‌గా ఒడిసెల గంగాధర్‌ గౌడ్‌, జగిత్యాల రూరల్‌ మండలం కన్నాపూర్‌ సర్పంచ్‌గా పొట్టవర్తిని సతీష్‌ కుమార్‌లు ఏకగ్రీవమయ్యారు.

ఫజోరుగా మద్యం పంపిణీ

ఎన్నికలకు మరొక్క రోజే గడువు ఉండటంతో అభ్యర్థులు ఓట్లు రాబట్టే పనిలో నిమగ్నమయ్యారు. అన్ని అస్త్రాలు ప్రయోగిస్తూ వస్తున్న అభ్యర్థులు ఇప్పుడు ప్రలోభాలకు తెర లేపబోతున్నారు. పోలింగ్‌ కేంద్రాలపై దృష్టి పెట్టిన అభ్యర్థులు పోలింగ్‌ ఏజెంట్లకు పెద్ద మొత్తంలో డబ్బులు అప్పగిస్తున్నారు. గ్రామాల్లో పలువురు అభ్యర్థులు జోరుగా మద్యం పంపిణీ చేస్తున్నారు. ఆయా పోలింగ్‌ కేంద్రాల ఏజెంట్లతో ప్రధాన పార్టీల అభ్యర్థులు మాట్లాడి డబ్బులు సమకూర్చుతున్నట్లు తెలిసింది. ప్రధానంగా మహిళా సంఘాలు, కుల సంఘాలు, యువజన సంఘాలపై దృష్టి కేంద్రీకరించి, వారికి పెద్ద ఎత్తున నగదు పంపిణీ చేసే పనిలో ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. ఇలా గెలుపే ధ్యేయంగా అభ్యర్థులు ఇన్నాళ్లు ప్రచారం చేయగా, ఇప్పుడు ప్రలోభాలకు తెర లేపబోతున్నారు.

ఫసమస్యాత్మక ప్రాంతాలపై అధికారుల దృష్టి

ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘించే అభ్యర్థులపై కఠిన చర్యలు ఉంటాయని అధికారులు వెల్లడించారు. ఇప్పటికే సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించి అధికారులు పోలీసు అదనపు బలగాలతో ఫ్లాగ్‌ మార్చ్‌ నిర్వహించి ఆంక్షలపై అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రత్యేక బృందాలు తనిఖీలు ముమ్మరం చేశారు. అభ్యర్థులు నిబంధనలు పాటించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ప్రకటించారు. ఎఫ్‌ఎస్‌టీ, ఎస్‌ఎస్‌టీ, ఎంసీసీ బృందాలు, పోలీస్‌ అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Updated Date - Dec 13 , 2025 | 12:55 AM