ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపునకు విద్యుత్ శాఖ వాహనాలు
ABN , Publish Date - Jul 16 , 2025 | 12:37 AM
రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని, ఇందులో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపునకు విద్యుత్ శాఖ తరుపున వాహనాలను సమకూరుస్తున్నామని టీజీ ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ మేక రమేష్‌బాబు తెలిపారు.
గణేశ్‌నగర్, జూలై 15 (ఆంధ్రజ్యోతి): రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తున్నామని, ఇందులో భాగంగా ట్రాన్స్‌ఫార్మర్ల తరలింపునకు విద్యుత్ శాఖ తరుపున వాహనాలను సమకూరుస్తున్నామని టీజీ ఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ మేక రమేష్‌బాబు తెలిపారు. సర్కిల్ పరిధిలో ఏర్పాటు చేసిన 12 వాహనాలను ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోయింది అని తెలియగానే ఈ వాహనంలో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ను అక్కడి పంపించి అమర్చుతామని తెలిపారు. వ్యవసాయ సర్వీసులను యుద్ధ ప్రాతిపదికన మంజూరు చేస్తున్నామన్నారు. ఇటీవల నిర్వహహించిన పొలంబాటలో భాగంగా వంగిన స్తంభాలను, లూజ్ లైన్‌లను సరి చేశామన్నారు. అవసరమున్న ప్రాంతాల్లో స్తంభాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 1,176 లైన్లు, 529 వంగిన స్తంభాలను సరి చేశామన్నారు. 1,981 కొత్త స్తంభాలు ఏర్పాటు చేశామని తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు కెపాసిటర్లను ఏర్పాటు చేసుకోవాలని రైతులకు ఆవగాహన కల్పిస్తున్నామన్నారు. రైతులకు సులభంగా అర్ధమయ్యే రీతిలో ఉండేందుకు ఎస్టిమేట్ వివరాలన్నీ తెలుగులో అందిస్తున్నామని వివరించారు. కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకున్న రైతుల ఫోన్లకు అన్ని వివరాలు తెలుగులో ఎస్‌ఏంఎస్ పంపిస్తున్నామని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతుల కోసం కొత్తగా ఎస్పీఎం షెడ్‌లు ఏర్పాటు చేశామన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లపై పిడుగులు పడకుండా ప్రత్యేక పరికాలు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. 363 కొత్త ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేశామన్నారు. ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే పట్టణ ప్రాంతాల్లో 24 గంటలు, గ్రామీణ ప్రాంతాల్లో 48 గంటల్లో మార్చుతున్నామని తెలిపారు. రైతులకు ఎటువంటి విద్యుత్ సమస్య ఉన్న 1912కి ఫోన్ చేసి తెలపాలని సూచించారు.