బకాయిల ఊబిలో విద్యుత్ శాఖ
ABN , Publish Date - May 25 , 2025 | 01:08 AM
విద్యుత్ శాఖకు ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు గుదిబండగా మారాయి.

- ప్రభుత్వరంగ సంస్థల బకాయిలు రూ.3,599.97 కోట్లు
- ఇరిగేషన్, మిషన్ భగీరథ రూ. 3,460.75 కోట్లు
- మున్సిపల్ శాఖ రూ. 86.16 కోట్ల బాకీ
- పంచాయతీరాజ్ శాఖ రూ. 39.94 కోట్లు
- ప్రతి నెలా చెల్లించే విధానం ఉండాలంటున్న విద్యుత్‌శాఖ
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
విద్యుత్ శాఖకు ప్రభుత్వ కార్యాలయాల బకాయిలు గుదిబండగా మారాయి. స్థానిక సంస్థలైన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలు, హెల్త్ డిపార్ట్‌మెంట్, పోలీస్ శాఖల్లో సైతం పెద్ద మొత్తంలో బకాయిలు పేరుకుపోయాయి. జిల్లాలో వివిధ సంస్థలు, ప్రభుత్వ శాఖలు ఎన్‌పీడీసీఎల్‌కు 3,599 కోట్ల 97 లక్షల రూపాయలు చెల్లించాల్సి ఉన్నది. ఇరిగేషన్, మిషన్ భగీరథ శాఖల బకాయిలు 3,460 కోట్ల 75 లక్షల 60 వేలు ఉండగా మిగతా శాఖలు కలిపి 139.21 కోట్ల రూపాయలు ఉన్నాయి. మున్సిపల్ శాఖ 86.16 కోట్లు, పంచాయతీరాజ్‌శాఖ 39.94 కోట్లు బకాయిలుగా చెల్లించాల్సి ఉంది. నెల వారీగా చెల్లించే విధానం లేకపో వడంతో ప్రభుత్వ శాఖల బకాయిలు పేరుకుపోతున్నాయి. బకాయిలను దశలవారీగా చెల్లించాలని ఆయా శాఖల ఉన్నతాధికారులను కోరుతున్నామని విద్యుత్ శాఖ అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, వాటి పరిధిలోని ఇతర వినియోగాల నిమిత్తం నెలనెలా వచ్చే బిల్లులకు పొంతన లేకుండా చెల్లింపులుంటున్నాయని, దీంతో ప్రతి నెలా పెండింగ్ బకాయిలు ఉంటాయని, అవి పేరుకుపోయి సంస్థకు భారంగా మారాయని విద్యుత్ అధికారులు పేర్కొంటున్నారు. ఆయా శాఖల్లో సంబంధిత పద్దు కింద నిధులు విడుదలైతే తప్ప బిల్లులు చెల్లించే పరిస్థితి ఉండదు. ప్రభుత్వ కార్యాలయాలు కావడంతో నోటీసులివ్వడం తప్ప డిస్ కనెక్ట్ చేయలేని పరిస్థితి. గృహ వినియోగదారులు, వాణిజ్య, పారిశ్రామిక, ఇతర వినియోగదా రులకు వర్తింపజేసినంత కఠినంగా బిల్లుల చెల్లింపునకు ఈ శాఖలపై ఒత్తిడి చేయలేని పరిస్థితి ఉంది.
పాలకవర్గాలు లేక పేరుకుపోతున్న బకాయిలు
జిల్లాలో పేరుకుపోయిన విద్యుత్ బిల్లుల బకాయిల్లో అత్యధికంగా స్థానిక సంస్థలైన పంచాయతీలు, మున్సిపాలిటీ, హెల్త్ డిపార్ట్‌మెంట్, రెవెన్యూశాఖ, పోలీస్‌శాఖల్లో ఉన్నాయి. ప్రధానంగా మున్సిపాలిటీలో పెండింగ్ బిల్లులు అత్యధికంగా 86 కోట్ల 16 లక్షల 91 వేల రూపాయలు దాటాయి. జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీలకు సంబంధించి కార్యాలయాలు, తాగునీటి పథకాలు, వీధి దీపాల నిర్వహణకు విద్యుత్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. దీంతో ఈ సంస్థల పద్దుల కింద కనెక్షన్లకు విద్యుత్ బిల్లులు భారీగా వస్తున్నాయి. అయితే వీటికి పాలకవర్గాలు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్లు, కేద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిచాయి. ఫలితంగా ఈ సంస్థల విద్యుత్ బిల్లుల చెల్లింపు సామర్థ్యం తగ్గింది. గ్రామ పంచాయతీలతో పోల్చితే మున్సిపాలిటీలకు ఆస్తి, ఇంటి పన్నుల వసూళ్లతో కొంత రెవెన్యూ వస్తుండ గా వాటిని అత్యవసర పనులకు వినియోగిస్తున్నారు. దీంతో విద్యుత్ బిల్లులు వస్తుంటే విద్యుత్ సంస్థకు చెల్లించేది తక్కువే. మిగిలిన బిల్లు పెండింగ్‌లో ఉంటోంది. గ్రామ పంచాయతీలకు నెలనెలా సుమారు 3.61 కోట్ల రూపాయల వరకు బిల్లులు వస్తుంటే అందులో కేవలం రెండు మూడు లక్షల వరకే చెల్లింపులు ఉంటు న్నాయి. మున్సిపాలిటీవి 86 కోట్ల రూపాయల పైచిలుకు పెండింగ్ ఉండగా గ్రామ పంచాయతీలవి 39 కోట్ల రూపాలయకు పైనే పెండింగ్ బిల్లులు ఉన్నాయి.
ఫ శాఖల వారీగా బకాయిలు
గ్రంథాలయాలు 0.55 లక్షలు, వ్యవసాయం 16.17 లక్షలు, ఎనిమల్ హస్పెండరీ 1.7 లక్షలు, ఆర్టీసీ 41 వేలు, సెంట్రల్ గవర్నమెంట్ 2.6 లక్షలు, చైల్డ్ వెల్ఫేర్ 1.92 లక్షలు, కో-ఆపరేటివ్ 69 వేలు, విద్యాశాఖ 16.71 లక్షలు, ఎండోమెంట్స్ 36 వేలు, ఫిషరీష్ 1.1 లక్షలు, ఫారెస్ట్ శాఖ 6.71 లక్షలు, హెల్ట్ డిపార్ట్‌మెంట్ 5 కోట్ల 16 లక్షల 57 వేలు, ఇన్‌కం టాక్స్ శాఖ 1.74 లక్షలు, ఇరిగేషన్, మిషన్ భగీరథ 3,460 కోట్ల 75.60 లక్షలు, ఐటీ, కమ్యూనికేషన్ డిపార్ట్‌మెంట్ 74 వేలు, జుడిషియల్ 41 వేలు, లేబర్ డిపార్ట్‌మెంట్ 15.31 లక్షలు, మైనార్టీ వెల్ఫేర్ శాఖ 3.87 లక్షలు, మున్సిపాలిటీ 86.16కోట్లు, పంచాయతీరాజ్‌శాఖ 39.94 కోట్లు, పోలీస్‌శాఖ 2.29 కోట్లు, ఆర్‌అండ్‌బి 28.84 లక్షలు, రైతు వేదిక 7.52 లక్షలు, రిజిస్ర్టేషన్ శాఖ 6.23 లక్షలు, రెవెన్యూశాఖ 4 కోట్ల 44 లక్షల 16 వేలు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ 38 వేలు, స్పోర్ట్స్ 2.4 లక్షలు, తెలుగు అకాడమీ 11 వేలు, ట్రెజరీ 12 వేలు, ఉర్దూ అకాడమీ 60 వేలు, వెటర్నరీ 4.80 లక్షలు, విద్యుత్ బకాయిలు మొత్తం 3,599 కోట్ల 97 లక్షల 47 వేల రూపాయలు ఉన్నాయి.
ఫ సకాలంలో బిల్లులు చెల్లించి సంస్థకు సహకరించాలి
- టీజీఎన్‌పీడీసీఎల్ ఎస్‌ఈ మేక రమేష్‌బాబు
జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ శాఖల్లో విద్యుత్ బిల్లులు కోట్లలో పెండింగ్‌లో ఉన్నాయి. అధికారులు స్పందించి వెంటనే పెండింగ్‌లో ఉన్న విద్యుత్ బిల్లులను సకాలంలో చెల్లించి సంస్థకు సహకరించాలి. విద్యుత్ సంస్థను కాపాడుకునే బాధ్యత మనందరిపైన ఉందని ప్రభుత్వ శాఖలు గుర్తిస్తే బాగుంటుంది.