ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలి
ABN , Publish Date - Oct 08 , 2025 | 12:32 AM
త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు.
- జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): త్వరలో జరుగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశమందిరంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు, ఎన్నికల ప్రక్రియ నిర్వహణపై ఎన్నికల నోడల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణలో భాగంగా అధికారులు తమ విధులను బాధ్యతాయుతంగా నిర్వహించాలని, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా సమన్వయంతో పని చేయాలన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలు పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. ప్రభుత్వశాఖలు, సంస్థల్లో పనిచేస్తున్న అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనరాదని, అలాంటి వారిపై నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎన్నికల విధులు నిర్వహించే సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి చేశామన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే, డీఆర్వో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో శ్రీనివాస్, జిల్లా పంచాయతీ అధికారి జగదీశ్వర్ పాల్గొన్నారు.