ప్రవేశాల పెంపునకు కసరత్తు
ABN , Publish Date - May 21 , 2025 | 01:18 AM
వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు అధ్యాపకులు కసరత్తు చేస్తున్నారు. వేసవిలో జూనియర్ లెక్చరర్లు కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. జూనియర్ లెక్చరర్లు పల్లె బాట పట్టి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వ కళాశాలల్లో వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు.
జగిత్యాల, మే 20 (ఆంధ్రజ్యోతి): వచ్చే విద్యా సంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు అధ్యాపకులు కసరత్తు చేస్తున్నారు. వేసవిలో జూనియర్ లెక్చరర్లు కళాశాలల్లో ప్రవేశాల పెంపునకు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు. జూనియర్ లెక్చరర్లు పల్లె బాట పట్టి ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వ కళాశాలల్లో వసతులపై తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రభుత్వ కళాశాలల్లో తమ పిల్లలను చేర్పించాలని అభ్యర్థిస్తున్నారు. కార్పొరేట్ కళాశాలలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో లెక్చరర్లు, వసతులు ఉన్నాయని ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని అధ్యాపకులు ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఫజిల్లాలోని కళాశాలలు..
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు కస్తూర్బా, ఇతర గురుకుల జూనియర్ కళాశాలలు 47 వరకు ఉన్నాయి. ఇందులో 15 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, 13 మోడల్ కళాశాలలు, 5 మైనార్టీ జూనియర్ కళాశాలలు, 5 కస్తూర్బా జూనియర్ కళాశాలలు, 3 మహాత్మా జ్యోతిరావు ఫూలే జూనియర్ కళాశాలు, 6 గురుకుల జూనియర్ కళాశాలలున్నాయి. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో సుమారు 3 వేల మంది ప్రథమ సంవత్సర విద్యార్థులు, 3,335 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు అభ్యసిస్తున్నారు. సుమారు రెండు వేల వరకు రెసిడెన్షియల్, మైనార్టీ, బీసీ తదితర జూనియర్ కళాశాలల్లో సీట్లు అందుబాటులో ఉన్నాయి. గురుకులాలు, కేజీబీవీలు, ఆదర్శ పాఠశాలల్ని కళాశాలలుగా అప్‌గ్రేడ్ చేయడంతో ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు మొగ్గు చూపడం లేదని అధ్యాపకులు అంటున్నారు. ప్రభుత్వ అనుబంధ యాజమాన్యాల పరిధిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలతో పాటు ఆదర్శ కళాశాలలు, కేజీబీవీల సంఖ్య ఎక్కువగా ఉండడంతో గ్రామీణ విద్యార్థులు వసతి గృహం ఉన్న కళాశాలల్లో చేరేందుకు ఇష్టపడుతున్నారు.
ఫవసతులపై విస్తృతంగా ప్రచారం..
జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల్లో 2025-26 విద్యా సంవత్సరానికి జూన్ తొలి వారం నుంచి ప్రారంభించాలని ఇంటర్ విద్యాశాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామీణ జిల్లా జగిత్యాలలో ప్రవేశాలు కల్పించేందుకు సంబంధిత ప్రిన్సిపాల్స్ సన్నద్ధం అవుతున్నారు. జిల్లాలోని పల్లెలు, పట్టణాలల్లో తల్లిదండ్రులకు అవగాహన కల్పించి ప్రభుత్వ కళాశాలల్లో ప్రవేశాలు పెంచేందుకు స్పెషల్ క్యాంపెనింగ్ నిర్వహించాలని ప్రిన్సిపాల్స్ యోచిస్తున్నారు. దీనికి అనుగుణంగా కొందరు లెక్చరర్లు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వ కళాశాలల్లో లభించే వసతులు, బోధన గురించి వివరిస్తున్నారు. వీటిలో చేరడం ద్వారా విద్యార్థులకు కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు. కళాశాలల్లో ఆంగ్లం, తెలుగు మాధ్యమాల్లో బైపీసీ, ఎంపీసీ, సీఈసీ, హెచ్‌ఈసీ కోర్సులు అందుబాటులో ఉన్నాయని వివరిస్తున్నారు. వీటితో పాటు పలు కళాశాలల్లో ఉర్దూ మీడియం కోర్సులు, ఒకేషనల్ కోర్సులు సైతం అందుబాటులో ఉన్నాయని ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఫకార్పొరేట్‌కు దీటుగా ప్రయత్నాలు..
పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఆర్థిక భారం తగ్గించేందుకు, కార్పొరేట్‌కు దీటుగా విద్యను అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా ఉచిత పాఠ్య పుస్తకాలు, ఫీజు లేకుండా ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తున్నారు. అనుభవజ్ఞులైన అధ్యాపకుల చేత విద్యాబోధన, పరీక్ష సమయంలో విద్యార్థులకు ప్రత్యేక తరగతుల గురించి లెక్చరర్లు తల్లిదండ్రులకు వివరిస్తున్నారు. ఎంసెట్, ఐఐటీ, నీట్ వంటి ఉన్నత పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ తరగతుల గురించి కూడా తెలియజేస్తున్నారు. ఆర్థిక, కుటుంబ కారణాలతో పదో తరగతి తర్వాత కొంతమంది ఆడపిల్లలు చదువు ఆపేయాల్సి వస్తోంది. అలాంటి తల్లిదండ్రులు గుర్తించి తమ పిల్లలు బాగా చదువుకొని జీవితంలో ఉన్నతంగా ఎదగడానికి ఎలాంటి అవకాశాలున్నాయో వివరిస్తున్నారు. పదిహేను రోజులుగా జూనియర్ లెక్చరర్ల కాంపెయినింగ్ జోరుగా సాగుతోంది.
ప్రభుత్వ కళాశాలల్లో ఉత్తమ బోధన
-నారాయణ, జిల్లా ఇంటర్ విద్య నోడల్ అధికారి
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థులు ప్రవేశాలు పొందాలి. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అన్ని సౌకర్యాలతో కూడిన ఉత్తమ విద్యా బోధన కల్పిస్తున్నాం. ఇంటర్ బోర్డు ఆదేశాల మేరకు తరగతులను ప్రారంభిస్తాం. జూన్ నెలలో ప్రవేశాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం.