Share News

జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి

ABN , Publish Date - Nov 08 , 2025 | 01:26 AM

జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు. ఆయన కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖులతో శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు.

జిల్లా అభివృద్ధికి కృషి చేయాలి
ప్రసంగిస్తున్న గవర్నర్‌ జిష్ణు దేవ్‌ వర్మ

- టీబీ, డ్రగ్స్‌ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

- గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ

సుభాష్‌నగర్‌, నవంబరు 7 (ఆంధ్రజ్యోతి): జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు. ఆయన కలెక్టరేట్‌ ఆడిటోరియంలో జిల్లా అధికారులు, ప్రముఖులతో శుక్రవారం ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సమగ్ర స్వరూపంతోపాటు జిల్లా విశేషాలను కలెక్టర్‌ పమేలాసత్పతి పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరించారు. అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో శుక్రవారం సభ నిర్వహిస్తూ మహిళలు, పిల్లల పోషణ ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టామని తెలిపారు. దివ్యాంగుల సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించేందుకు అధికారులకు, సిబ్బందికి సైన్‌ లాంగ్వేజీలో శిక్షణ ఇచ్చామని తెలిపారు. అనంతరం గవర్నర్‌ మాట్లాడుతూ టీబీ, డ్రగ్స్‌ రహిత కరీంనగర్‌గా తీర్చిదిద్దడానికి మిషన్‌మోడ్‌లో పని చేయాలని సూచించారు. టీబీ ముక్త్‌ భారత్‌లో జిల్లాలోని కవులు, కళాకారులు, రచయితలతోపాటు వివిద రంగాలలోని ప్రముఖులను భాగస్వాములను చేయాలన్నారు.

ఫ మేధావులు, విద్యావంతులు ఇంటికే పరితం కాకూడదు...

జిల్లాలో ఉన్న మేధావులు, విద్యావంతులు ఇంటికే పరిమితం కాకుండా జ్ఞానాన్ని సమాజానికి పంచాలని గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ సూచించారు. ప్రపంచంలో ఎక్కడ లేని యువత మనదేశంలో ఎక్కువగా ఉందన్నారు. సమాజంలో నాటుకున్న సామాజిక రుగ్మతలను రూపుమాపాలని పిలుపునిచ్చారు. జిల్లాలో కవులు, కళాకారులు, మేధావులకు కొదవ లేదని, వారి సేవలను అధికారులు వినియోగించుకోవాలని సూచించారు. వందేమాతరం గీతానికి 150 సంవత్సరాలు పూర్తయ్యాయని, ఈ గీతం ప్రజలకు ఎప్పుడూ స్ఫూర్తిదాయకంగానిలుస్తుందన్నారు. అనంతరం సీనియర్‌ ఫిజీషియన్‌ డాక్టర్‌ లక్ష్మీనారాయణ, కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత డాక్టర్‌ నలిమెల భాస్కర్‌, గద్దర్‌ అవార్డు గ్రహీత పొన్నం రవిచంద్ర, దాశరథి అవార్డు గ్రహీత అన్నవరం దేవేందర్‌, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత గండ్ర లక్ష్మణరావు, సినీ నటుడు కేతిరెడ్డి మాల్లరెడ్డి, నటుడు ఆర్‌ఎస్‌ నంద, అగ్రికల్చర్‌ సైంటిస్టు డాక్టర్‌ ఎన్‌ వెంకట్వేరరావు, శ్రీబాలాజీ ట్రస్టు(ఎన్‌జీవో) అధ్యక్షుడు గంప వెంకట్‌, శ్రీబాలాజీ ట్రస్టు(ఎన్‌జీవో)కు చెందిన ఇద్దరిని, ఆల్ఫోర్స్‌ విద్యాసంస్థల చైర్మెన్‌ వి నరేందర్‌రెడ్డి, విద్యావేత్త వై శేఖర్‌రావు, సంగీత దర్శకురాలు, నేపథ్యగాయని ఎంఎం శ్రీలేఖ, రెడ్‌క్రాస్‌ సొసైటీ చైర్మెన్‌ పెండ్యాల కేశవరెడ్డి, వైస్‌ చైర్మన్‌ చిదుర సురేష్‌, కార్యదర్శి ఉట్కూరి రాధాకృష్ణారెడ్డి, స్టేట్‌ ఈసీ మెంబర్‌ పెద్ది విద్యాసాగర్‌, ఎంజేఎఫ్‌ చైర్మన్‌ కొండ వేణుమూర్తి, ఎంజేఎఫ్‌ ఈపీఎంసీసీ హెచ్‌ రాజిరెడ్డి, ఎంజేఎఫ్‌ ఎఫ్‌జిఎల్‌ టి కోఆర్డినేటర్‌ ఇనుగుర్తి రమేశ్‌, ఎంజేఎఫ్‌ రీజియన్‌ చైర్‌పర్సన్‌ వడుకాపురం జగదీశ్వరాచారిని గరవ్నర్‌ సన్మానించారు. కార్యక్రమంలో గవర్నర్‌ ప్రిన్సిపల్‌ సెక్రటరీ దానకిషోర్‌, కలెక్టర్‌ పమేలాసత్పతి, సీపీ గౌస్‌ ఆలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజి వాఖడే, లక్ష్మి కిరణ్‌, మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌, కరీంనగర్‌ ఆర్‌డీవో మహేశ్వర్‌, హుజురాబాద్‌ ఆర్‌డీవో రమేశ్‌బాబు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రముఖులు, కలెక్టరేట్‌ సిబ్బంది పాల్గొన్నారు.

ఫ గవర్నర్‌ పర్యటనకు 300 మందితో బందోబస్తు

కరీంనగర్‌ క్రైం: కరీంనగర్‌లో గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ పర్యటను శుక్రవారం ప్రశాతంగా ముగిసింది. శాతవాహన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి గవర్నర్‌ విశిష్ట అతిథిగా హాజరయ్యారు. ఈ రెండు చోట్ల గవర్నర్‌ కార్యక్రమాలకు హాజరవుతుండడంతో పోలీస్‌ కమిషనర్‌ పర్యవేక్షణలో పటిష్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. ఒక అడిషనల్‌ డీసీపీతోపాటు ఆరుగురు ఏసీపీలు, సీఐ, ఎస్‌ఐ, ఏఎస్‌ఐ, ఇతర సిబ్బంది కలిసి 300 వరకు బంందోబస్తుకు వినియోగించారు. శాతవాహన విశ్వవిద్యాలయం వద్ద వేదిక, కలెక్టరేట్‌లో ఆడిటోరియం ప్రాంతాలను గురువారం సాయంత్రం నుంచే డాగ్‌, బాంబ్‌ స్క్వాడ్‌లతో తనిఖీ చేసి, సాయుధ పోలీసులతో బందోబస్తును ఏర్పాటు చేశారు. గవర్నర్‌ రోడ్డు మార్గంలో ఎన్టీఆర్‌ చౌక్‌ నుంచి మానేరు బైపాస్‌ రోడ్డు, చింతకుంట ద్వారా శాతవాహన విశ్వవిద్యాలయానికి చేరుకున్నారు. అక్కడ కార్యక్రమం ముగిసిన తరువాత మద్యాహ్నం కలెక్టరేట్‌కు చేరుకుని సాయంత్రం హైదరాబాద్‌కు తిరిగివెళ్లారు. గవర్నర్‌ పర్యటన సందర్భంగా కొందరు బీసీ సంఘాల నాయకులు నిరసన కార్యక్రమాలు చేసే అవకాశముందనే సమాచారంతో 19 మంది బీసీ సంఘ నాయకులను గురువారం అర్ధరాత్రి అదుపులోకి తీసుకుని పీటీసీకి తరలించి మద్యాహ్నం తరువాత వదిలిపెట్టారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చేందుకు ప్రైవేట్‌ కళాశాలల సంఘాలు సమాయత్తమవుతున్నట్లు తెలుసుకున్న పోలీసులు వారిని వారించినట్లు తెలిసింది.

Updated Date - Nov 08 , 2025 | 01:26 AM