Share News

విద్యాశాఖ కార్యక్రమాలు భేష్‌

ABN , Publish Date - Nov 14 , 2025 | 12:05 AM

కలెక్టర్‌ పమేలాసత్పతి నేతృత్వంలో విద్యారంగ అభివృద్ధికి చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు బాగున్నాయని రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి ప్రశంసించారు. ఆయన జిల్లాలో విద్యారంగ అభివృద్ధిపై కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులతో సమీక్ష గురువారం నిర్వహించారు.

విద్యాశాఖ కార్యక్రమాలు భేష్‌

కరీంనగర్‌, నవంబరు 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కలెక్టర్‌ పమేలాసత్పతి నేతృత్వంలో విద్యారంగ అభివృద్ధికి చేపడుతున్న వినూత్న కార్యక్రమాలు బాగున్నాయని రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి ప్రశంసించారు. ఆయన జిల్లాలో విద్యారంగ అభివృద్ధిపై కలెక్టర్‌, విద్యాశాఖ అధికారులతో సమీక్ష గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పమేలా సత్పతి జిల్లాలో విద్యారంగ అభివృద్ధికి ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న కార్యక్రమాలను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. అనంతరం విద్యాశాఖ చైర్మన్‌ ఆకునూరి మురళి మాట్లాడుతూ 20 అంశాలకుపైగా విద్యారంగ అభివృద్ధికి ప్రత్యేక కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు. జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని, ఆయనతో చర్చించి రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాలు అమలయ్యేందుకు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 200 మండలాల్లో మండలానికి ఒకటిచొప్పున తెలంగాణ పబ్లిక్‌ స్కూల్స్‌ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు.

జిల్లాకు మంచిపేరు తీసుకురావాలనేఉద్దేశంతో విద్యారంగంలో నూతన కార్యక్రమాలను చేపడుతూ వాటి అమలు కోసం కష్టపడుతున్నామని కలెక్టర్‌ పమేలాసత్పతి తెలిపారు. విద్యాశాఖ అధికారులతో కలిసి సమష్టిగా విద్యారంగ అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు తల్లిదండ్రులు సహకరిస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డీఈవో మొండయ్య, క్వాలిటీ కో ఆర్డినేటర్‌ అశోక్‌రెడ్డి, జిల్లా సైన్స్‌ ఆఫీసర్‌ జైపాల్‌రెడ్డి, ప్లానింగ్‌ కో ఆర్డినేటర్‌ శ్రీనివాస్‌, జెండర్‌ కో ఆర్డినేటర్‌ కృపారాణి, డీసీఈబీ సెక్రెటరీ భగవంతయ్య, ఓపెన్‌ స్కూల్‌ కో ఆర్డినేటర్‌ రవీందర్‌, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.

ఫ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి

వీణవంక: ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ప్రతి విద్యార్థిపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి అన్నారు. వీణవంక మండలం చల్లూరుజిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలను ఆయన గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి విద్యార్థి మార్కుల జాబితాను ఉపాధ్యాయులు పరిశీలించాలని, తక్కువ మార్కులు వచ్చే సబ్జెక్‌లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు. మండలంలోని పాఠశాలల వివరాలను ఎంఈవో శోభరాణిని అడిగి తెలుసుకున్నారు. చల్లూరు పాఠశాల నిర్వహిస్తున్న యూట్యూబ్‌ చానల్‌లో విద్యార్థులు వార్తలు చదవడం అభినందనీయం అని ప్రశంసించారు. ఓ విద్యార్థికి పెను బహుకరించారు. మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి మెనూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం యూపీఎస్‌ ఉర్దుమీడియం పాఠశాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజన కార్మికులు తమ సమస్యలను విద్యా కమిషన్‌ చైర్మన్‌ దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కారిస్తామని తెలిపారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ అనుపమారావు, ఎంపీవో సురేందర్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 14 , 2025 | 12:05 AM