వేములవాడలో ఘనంగా దసరా వేడుకలు
ABN , Publish Date - Oct 03 , 2025 | 11:55 PM
వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి.
వేములవాడ కల్చరల్, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న దేవీ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ముగిశాయి. విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని గురువారం పదకొండో రోజు రాజరాజేశ్వరీ దేవి అమ్మవారు మహాలక్ష్మి (పాలవెల్లి) అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు శ్రీస్వామి వారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై అమ్మవారిని దర్శించుకున్నారు.
అంబారీ సేవపై శ్రీస్వామి వారి ఊరేగింపు..
వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని పదకొండో రోజున పార్వతిపరమేశ్వరులు, లక్ష్మీసమేతపద్మనాభస్వామి వారి ఉత్సవమూర్తులను అంబారీ సేవపై ఏర్పాటు చేసి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం పెద్ద సేవతో పట్టణ పురవీధుల్లో శమీయాత్ర నిర్వహించారు. మహిళలు మంగళహారతుతో స్వాగతం పలికారు.
రాజన్న ఆలయంలో ఆయుధ పూజ..
రాజరాజేశ్వర స్వామి ఆలయంలో గురువారం అర్చకులు ఆయుధ పూజ కార్యక్రమాన్ని చేపట్టారు. శ్రీలక్ష్మీపద్మనాభ ఆలయ ప్రాంగణంలో ఆయధాలను ఒక్కచోటు ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమానికి ఈవో రమాదేవి హాజరయ్యారు.
ఆకట్టుకున్న ఎడ్ల బండ్ల ర్యాలీలు..
దసరా ఉత్సవాల్లో భాగంగా గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన ఎడ్ల బండ్ల ర్యాలీలో ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. తన నివాసం నుంచి ఎడ్లబండ్లపై మహాలక్ష్మీ అమ్మవారి ఆలయం వద్దగల జమ్మివరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం జమ్మిచెట్టు వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏనుగు మనోహర్‌రెడ్డి, రామతీర్థపు రాజు, నిమ్మశెట్టి విజయ్‌లు గురువారం ఎడ్లబండ్ల ర్యాలీని నిర్వహించారు.
శ్రీభీమేశ్వర ఆలయంలో కోడెమొక్కు ధ్వజస్తంబం ప్రతిష్ఠాపన..
రాజన్న ఆలయంలో చేపడుతున్న ఆలయ విస్తరణ పనుల్లో భాగంగా భక్తుల దర్శనాలను శ్రీభీమేశ్వర ఆలయంలోకి మారుస్తున్న విషయం తెలిసిందే. అయితే దసరాను పురస్కరించుకుని గురువారం శ్రీభీమేశ్వర ఆలయ ముందుభాగంలో కోడెమొక్కులు చెల్లించుకునేందుకు ధ్వజస్తంభాలను ప్రతిష్ఠించారు. ఈ కార్యక్రమంలో ఈవో రమాదేవి ఆలయ ఉద్యోగులు పాల్గొన్నారు.