మత్తు కేఫ్‌లు...
ABN , Publish Date - Nov 16 , 2025 | 01:08 AM
చాయ్ దుకాణాలు, కేఫ్‌ల మాటున జిల్లాలో పెద్ద ఎత్తున మత్తు కేంద్రాల నిర్వహణ కొనసాగు తోంది... గ్రామాల నుంచి నగరాల దాకా ఇప్పుడు చాయ్ హోటళ్లలో కొత్తగా స్మోకింగ్ జోన్‌లు వెలిశాయి. ఈ స్మోకింగ్ జోన్‌ల పేర కొత్త దందాకు తెర తీశారు... మైనర్లే టార్గెట్‌గా రహదారులు, విద్యాసంస్థల సమీపాల్లో ఏర్పాటు చేసి వారిని ఆకర్షిస్తున్నారు.
స్మోకింగ్ జోన్‌లతో మైనర్లకు గాలం...
విద్యా సంస్థలు, హైవేల పక్కన నిర్వహణ...
గంటకు రూ.20 నుంచి రూ.50 వసూళ్లు...
పోలీస్ నిఘా లేకపోవడంతో విచ్చలవిడిగా దందా...
మేజర్ గ్రామాల నుంచి నగరాల దాకా వ్యాపారం
ఒక రామగుండంలోనే 40 నుంచి 50సెంటర్లు
కోల్‌సిటీ, నవంబరు 15(ఆంధ్రజ్యోతి): చాయ్ దుకాణాలు, కేఫ్‌ల మాటున జిల్లాలో పెద్ద ఎత్తున మత్తు కేంద్రాల నిర్వహణ కొనసాగు తోంది... గ్రామాల నుంచి నగరాల దాకా ఇప్పుడు చాయ్ హోటళ్లలో కొత్తగా స్మోకింగ్ జోన్‌లు వెలిశాయి. ఈ స్మోకింగ్ జోన్‌ల పేర కొత్త దందాకు తెర తీశారు... మైనర్లే టార్గెట్‌గా రహదారులు, విద్యాసంస్థల సమీపాల్లో ఏర్పాటు చేసి వారిని ఆకర్షిస్తున్నారు. మొదట సిగరేట్లు తాగేందుకు వెళుతున్న మైనర్లు తరువాత గంజాయి వంటి మత్తు పదా ర్థాలకు అలవాటు పడుతున్నారు. గంజాయి వ్యాపారులు వీటికి అలవాటు పడిన మైనర్లతోనే మరికొందరు పిల్లలను ఆకర్శించి దందా విస్తరించు కుంటున్నారు. అమ్మకాలు సాగించేది, సేవించేది మైనర్లే అనే రీతిలో వ్యాపారాలు కొనసాగిస్తున్నారు. స్మోకింగ్ జోన్‌లో సౌకర్యాలను బట్టి గంటకు రూ.20 నుంచి రూ.50 వసూలు చేస్తున్నారు.
జిల్లాలో మేజర్ గ్రామ పంచాయతీలు మొదలు నగరాల వరకు ఏడాది కాలంలో కొత్తగా వివిధ పేర్లతో చాయ్ అమ్మకాల పేర కేఫ్‌లు వెలిశాయి. ఈ కేఫ్‌లు ఎక్కువగా ప్రధాన రహదారులు ఉన్న ప్రాంతాలు, విద్యా సంస్థలు ఉన్న ప్రాంతాల్లో ఏర్పాటు చేస్తున్నారు. ముందట టీ అమ్మకాలు జరుపుతూ వెనుక స్మోకింగ్ జోన్‌లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ స్మోకింగ్ జోన్‌లో ప్రత్యేకంగా టేబుళ్లు, కుర్చీలు వేసి సౌకర్యాలు కల్పిస్తున్నారు. మైనర్లే ఎక్కువగా ఈ జోన్‌లకు వెళుతున్నారు. పాఠశాల స్థాయిలో 9, 10వ తరగతి విద్యార్థుల నుంచి ఇంటర్, ఐటీఐ విద్యార్థులు ఈ జోన్‌లకు ఆకర్షితులవుతున్నారు. నిర్వాహకులు స్మోకింగ్ జోన్‌లకు సమయాన్ని బట్టి బిల్లులు వసూలు చేస్తున్నారు. అదే సమయంలో కొందరు గంజాయి వ్యాపారులు మైనర్లను ఉచ్చులోకి దింపుతున్నారు.
రామగుండంలోనే 40కిపైగా స్మోకింగ్ జోన్ కేఫ్‌లు...
జిల్లాలో విద్యా సంస్థలు ఎక్కువగా ఉండే మేజర్ గ్రామాలు, మున్సిపా లిటీలు, కార్పొరేషన్ ఏరియాల్లో స్మోకింగ్ జోన్ కేఫ్‌లను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లా కేంద్రం పెద్దపల్లితోపాటు సుల్తానాబాద్, మంథని, కాల్వ శ్రీరాంపూర్, తదితర ప్రాంతాలతోపాటు రామగుండంలో ఈ తరహా కేఫ్‌లను నిర్వహిస్తున్నారు. ఒక్క రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోనే 40కిపైగా స్మోకింగ్ జోన్ కేఫ్‌లు నిర్వహిస్తున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. విద్యాసంస్థలు ఎక్కువగా ఉండే మార్కండేయకాలనీ ఏరియా, అడ్డగుంటపల్లితోపాటు మేదరిబస్తీ, గౌతమినగర్, ఇందిరానగర్ పెట్రోల్‌బంక్ ఏరియా, ఆర్‌సీఓఏ క్లబ్, ఎల్‌ఐసీ ఆఫీస్ ఏరియాల్లో ఎక్కువగా స్మోకింగ్ జోన్ కేఫ్‌లు ఉన్నాయి.
గంజాయి విక్రయాలు...
జిల్లాలో గంజాయికి బానిసైన విద్యార్థులు, యువకులు నిర్మాణుష్యమైన ప్రాంతాలు, పొలాల్లో గంజాయి సేవించే వారు. ఇప్పుడు కేఫ్‌లు, పాన్ షాప్ ఏరియాల్లో స్మోకింగ్‌జోన్‌లు ఏర్పాటు కావడం, గంజాయి విక్రయా లకు, వినియోగాలకు సులభతరంగా మారాయి. పలు సందర్భాల్లో ఈ కేఫ్‌లలో మత్తు పదార్థాలు సేవించి యువకులు బయటకు వచ్చి గొడవలు పడి దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
నిఘా లేకపోవడంతో నిర్భయంగా దందా...
జిల్లాలో స్మోకింగ్ జోన్ కేఫ్‌లను విచ్చలవిడిగా నిర్వహిస్తున్నా పోలీ సులు నిఘా పెట్టకపోవడంతో దందా విచ్చలవిడిగా సాగుతోంది. ముఖ్యంగా యువత, మైనర్లు చెడు అలవాట్లకు బానిస కావడమే కాకుండా గంజాయి వంటి మహమ్మారి బారిన పడుతున్నారు. కొన్ని చోట్ల వీటిపై సమాచారం ఉన్నా పోలీసులు నిర్లక్ష్యం చేస్తున్నారనే ఆరోపణలు సైతం ఉన్నాయి. ప్రధాన రహదారులు, విద్యా సంస్థల సమీపంలో ఈ సెంటర్లు నిర్వహిస్తున్నా వాటిని కట్టడి చేయకపోవడంపై పోలీస్ యం త్రాంగం దృష్టి పెట్టడం లేదనే విమర్శలున్నాయి. ఎక్సైజ్‌శాఖ అయితే కనీసం తనిఖీలు చేసిన పరిస్థితి కూడా లేదు.