యూరియా కోసం రైతుల ఇబ్బందులు కనిపించడం లేదా?
ABN , Publish Date - Aug 31 , 2025 | 01:00 AM
రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు.
ఇల్లంతకుంట, ఆగస్టు 30(ఆంధ్రజ్యోతి): రైతులు యూరియా కోసం పడుతున్న ఇబ్బందులు ప్రభుత్వానికి కనిపించడం లేదా అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. మండలంలోని దాచారం గ్రామంలో శనివారం విలేకరులతో మాట్లాడారు. రైతులు యూరియా కోసం కొనుగోలు కేంద్రాల వద్ద క్యూ కడుతుంటే ప్రతిపక్షాల కుట్ర అని పేర్కొంటు రైతులను ప్రభుత్వం అవమానిస్తుందని విమర్శించారు. గత ప్రభుత్వ హయాంలో ఏనాడు రైతులు యూరియా కోసం ఇబ్బంది పడలేదన్నారు. సీఎం, వ్యవసాయ శాఖ మంత్రి చేతకానితనం వల్లనే రాష్ట్రంలో యూరియా కొరత ఏర్పడిందన్నారు. బూటకపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకులకు పరిపాలన చేతకావడం లేదన్నారు. భారీవర్షాలతో ప్రజలు ఇబ్బంది పడుతుంటే కనీసం పట్టించుకునే వారు కరువయ్యారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యూరియా కొరత తీర్చాలని లేనట్లయితే రైతుల పక్షాన ఆందోళన ఉధృతం చేస్తామన్నారు. తొలుత బోటిమీదిపల్లె, దాచారం గ్రామాలలో బాధిత కుటుంబాలను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ సిద్దం వేణు, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు పల్లె నర్సింహారెడ్డి, నాయకులు కేవీఎన్‌రెడ్డి, మీసరగండ్ల అనీల్‌కుమార్, బాలకిషన్, సంజీవరెడ్డి, కుడుముల నాగరాజు, భాస్కర్, బర్ల తిరుపతి, పర్శరాం, గౌరవేని సుమన్, దేవయ్య పాల్గొన్నారు.