రైతులను పట్టించుకోరా..
ABN , Publish Date - Oct 31 , 2025 | 11:39 PM
మొంథా తుఫానుతో పంట నష్టపోయిన రైతులను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవ్వకుంట్ల కవిత విమర్శించారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా తిమ్మాపూర్ మండలంలో కవిత శుక్రవారం పర్యటించారు.
తిమ్మాపూర్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): మొంథా తుఫానుతో పంట నష్టపోయిన రైతులను అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవ్వకుంట్ల కవిత విమర్శించారు. జనంబాట కార్యక్రమంలో భాగంగా తిమ్మాపూర్ మండలంలో కవిత శుక్రవారం పర్యటించారు. నుస్తులాపూర్ గ్రామంలో నేలకొరిగిన వరి పంటను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వర్షానికి భారీ నష్టం జరిగినా కలెక్టర్, ఎమ్మెల్యే, ఎంపీ ఇక్కడికి రాలేదని విమర్శించారు. కోతలు ప్రారంభించి నెల రోజులు గడిచినా ఇంత వరకు కొనుగోలు కేంద్రాలు ఎందుకు ప్రారంభించలేదన ప్రశ్నించారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేశారు. ఒక్క అధికారి కూడా పొలాల వద్దకు రాలేదని, కలెక్టర్ ఏం చేస్తున్నరని కవిత ప్రశ్నించారు.
ఫ ప్రభుత్వానికి విద్యార్థుల ఉసురు తలుగుతుంది
హుజూరాబాద్‌రూరల్: గురుకులాల్లో విద్యార్థులు పిట్టల్లా రాలిపోతున్నారని, వారి ఉసురు ప్రభుత్వానికి తగులుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. ఇటీవల వంగర గురుకులంలో అనుమానాస్పదంగా మృతి చెందిన హుజూరాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీవర్షిత కుటుంబ సభ్యులను ఆమె పరామర్శించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శ్రీవర్షిత మృతిపై అనుమానాలున్నాయని, సిట్ వేసి ప్రత్యేకంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవ తీసుకోవాలని కోరారు. శ్రీవర్షిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు తెలంగాణ జాగృతి అండగా ఉంటుందని తెలిపారు.
ఫ అంబేద్కర్ విగ్రహానికి నివాళులు
హుజూరాబాద్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత హుజూరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కవితకు కార్యకర్తలు, నాయకులు, అభిమానులు పెద్దఎత్తున స్వాగతం పలికారు.
ఫ కల్వల ప్రాజెక్టు మరమ్మత్తు చేయాలి
శంకరపట్నం: రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని కల్వల ప్రాజెక్టుకుక మరమ్మతులు చేయాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. కల్వల ప్రాజెక్టును ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాజెక్టు మరమ్మతు పనుల కోసం గత ప్రభుత్వం 70 కోట్లు విడుదల చేస్తూ జీవో ఇచ్చిందన్నారు. ప్రభుత్వం మారడంతో పనులు ముందుకు సాగలేదన్నారు. ప్రాజెక్టులో నీరు నిలవక ఆయకట్టు రైతులు ఇబ్బంది పడుతున్నారన్నారు. హుజూరాబాద్, మానకొండూర్ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు స్పందించి మరమ్మతులు చేయించాలని కోరారు.
ఫ అమరులకు నివాళి
సుభాష్‌నగర్: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితకు నాయకులు ఘన స్వాగతం పలికారు. అల్గునూరు నుంచి అమరవీరుల స్తూపం వరకు 250 మందితో బైక్ ర్యాలీ నిర్వహించారు. స్తూపం వద్దకు చేరుకున్న కవిత అమరులకు నివాళులర్పించారు. అనంతరం ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం వద్దకు చేరుకొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఫ బొమ్మలమ్మ గుట్టను కాపాడాలి
గంగాధర: బొమ్మలమ్మ గుట్టను గ్రానైట్ మాఫియా నుంచి కాపాడాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. గంగాధర మండలం కొండన్నపల్లి శివారులోని బొమ్మలమ్మ గుట్టను ఆమె సందర్శించారు. అనంతరం సహస్ర లింగేశ్వరాలయంలో పూజలు చేశారు.
ఫ చేతి వృత్తులను ఆదుకోవాలి
గంగాధర (రామడుగు): చేతి వృత్తి కళాకారులను ప్రభుత్వం ఆదుకోవాలని జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. రామడుగు మండలంలో శిల్పకళాకారులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈసందర్బంగా వారు తయారుచేస్తున్న విగ్రహాలను పరిశీలించారు.