దడ పుట్టిస్తున్న శునకాలు..
ABN , Publish Date - Nov 14 , 2025 | 01:05 AM
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీధికుక్కలు రెచ్చిపోతున్నాయి...
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
రాజన్న సిరిసిల్ల జిల్లాలో వీధికుక్కలు రెచ్చిపోతున్నాయి... భౌ..భౌమంటూ జనాన్ని పరుగులు పెట్టిస్తున్నాయి. గుంపులు గుంపులుగా ప్రజలపై దాడి చేస్తుండటంతో వీధుల్లో కుక్కలను చూసి భయపడుతున్నారు. రాత్రుల్లో వాహనదారులను పరుగులు పెట్టిస్తున్నాయి. బస్‌స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాల్లో చేతుల్లో బ్యాగులు ఉంటే లాకెళ్లుతున్నాయి. జిల్లాలో గడిచిన పది నెలలు 4642 మంది కుక్క కాటుకు గురైన బాధితులు ఉన్నారు. జిల్లా కేంద్రంలో గత నెలలో గంట వ్యవధిలోనే ఒక కుక్క 40 మందిపై దాడి చేసి భయభ్రాంతులకు గురిచేసింది. జిల్లా కేంద్రంతో పాటు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, గంభీరావుపేట, ముస్తాబాద్, ఇల్లంతకుంట, తంగళ్ళపల్లి, బోయిన్‌పల్లి, వేములవాడ, కోనరావుపేట, చందుర్తి, రుద్రంగి మండలాల్లో ప్రతిరోజు ఏదో ఒకచోట కుక్కల దాడుల సంఘటలు జరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరం ముస్తాబాద్ మండలం సేవాలాల్ తండాకు చెందిన రాజ్యలక్ష్మి అనే వృద్ధురాలు కుక్కలు దాడిలో చనిపోయింది. తీవ్ర గాయాలతో మంచాన పట్టిన వారు ఉన్నారు. జిల్లాలో వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చే భక్తులు, జిల్లా కేంద్రానికి వివిధ పనుల నిమిత్తం వచ్చేవారు కుక్క కాటుకు గురవుతున్నారు. కుక్కలతో ప్రజలు బిక్కుబిక్కుమనే పరిస్థితి ఏర్పడింది. రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్న కుక్కలను నియంత్రించాలని సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఆదేశాల మేరకు వాటి కోసం షెడ్లు వేసి తరలించడానికి బల్దియా అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాల ప్రకారం వీధి కుక్కలకు రేబీస్ టీకాలు, సంతాన నియంత్రణ ఆపరేషన్లు చేయడానికి గత సిరిసిల్ల మున్సిపల్ కౌన్సిల్ భారీగానే ఖర్చు పెట్టింది. గతంలో వెయ్యి కుక్కలకు వ్యాక్సినేషన్, శస్త్ర చికిత్సలకు రూ 16 లక్షలు ఖర్చు చేశారు. గత సంవత్సరం రూ ఒక్కో కుక్కకు రూ.1650 చొప్పున రూ.16.50 లక్షలు జనరల్ నిధుల నుంచి మంజూరీ ఇచ్చింది.
మాంసం వ్యర్థాలకు అలవాటుపడి...
జిల్లాలో చికెన్, మటన్, దుకాణాల వద్ద మాంసం వ్యర్థాలకు అలవాటు పడిన కుక్కలు క్రూరంగా దాడి చేస్తున్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అంతేకాకుండా రోడ్లపై కూడా వ్యర్థాలు ఎక్కువగా పడేయడంతో కుక్కలు వాటికి అలవాటు పడి జనవాసాల మధ్య తిరుగుతూ దాడులు చేస్తున్నాయని తెలుస్తోంది. రోడ్లపై సంచులతో వెళ్తున్న వారిపై దాడి చేసి వాటిని లాగుతున్నాయి. గ్రామాల్లో మేకలు, గొర్రెల మందలపై దాడులు చేస్తూ పీక్కుతింటున్నాయి. గ్రామాల్లో మందలపై దాడిచేయడం వల్ల వందల సంఖ్యలోనే చనిపోయిన సంఘటనలు ఉన్నాయి.
తల్లిదండ్రుల్లో భయాందోళనలు..
జిల్లాలో ప్రధానంగా వీధి కుక్కలు చిన్నారులపై దాడి చేస్తుండడంతో తల్లిదండ్రులు భయాందోళనలకు గురవుతున్నారు. పాఠశాలకు సైకిళ్లపై, నడుచుకుంటూ వస్తున్న కుక్కలు గుంపులుగా దాడి చేస్తున్న సంఘటనలు ఉన్నాయి. ఒంటరిగా పిల్లలను పంపించడానికే భయపడుతున్నారు. మరోవైపు రాత్రి వేళల్లో వివిధ పనుల నిమిత్తం వెళ్లి వచ్చేవారు కూడా భయపడుతున్నారు.
రేబీస్‌పై అప్రమత్తంగా ఉండాలి..
బుల్లెట్ అకారంలో ఉండే రాబ్డీడో అనే వైరస్ వైద్య పరిభాషలో రేబీస్‌గా పిలుస్తాం. పెంపుడు జంతువుల ద్వారా వచ్చే రేబీస్ మనకు ప్రధానంగా కుక్క కాటు ద్వారా వస్తోంది. రేబీస్ ఉన్న కుక్క కరవకపోయినా, ప్రాణాంతకంగా మారే సంఘటనలు ఉన్నాయి. గోళ్లతో గీరినా, రక్కినా, పండ్లు గీచుకుపోయినా, అంతకుముందు ఉన్న గాయాల మీద నాకినా, తినే అహారంలో మూతి పెట్టినా, చొంగ కార్చినా, పిల్లలు అటవస్తువులను ముందుగా కుక్క నాకి ఉంటే వాటిని పిల్లలు నోట్టో పెట్టుకోవడం వల్ల రేబీస్ వ్యాధి రావడానికి మార్గాలుగా ఉన్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. రేబీస్ వ్యాధి ఎక్కువ శాతం పిచ్చికుక్క కరవడం ద్వారా సోకుతుంది. కుక్క కరవగానే నరాల ద్వారా వేగంగా మెదడుకు చేరి వ్యాధిని కలిగిస్తుంది. కుక్క కరిచిన తొమ్మిది రోజుల నుంచి కొన్ని నెలల్లోపు ఎప్పుడైనా లక్షణాలు కనబడవచ్చు. సాధారణంగా నాలుగు నుంచి 8 వారాల్లో బయటపడుతుంది. మెదడు దగ్గర కుక్క కరిస్తే త్వరగా, ఇతర ప్రాంతాల్లో కరిస్తే కొంత ఆలస్యంగా లక్షణాలు బయటపడుతాయి. గీచుకుపోయిన గాయం ద్వారా అయితే కొంత సమయం పడుతుంది. లోతుగా పండ్లు దిగి కండను పీకేసీనా త్వరగా లక్షణాలు బయటపడుతాయి. కరిచిన చోట నొప్పి, పొడిచినట్లు బాధ తలనొప్పి, గొంతువాపు, ఒళ్లు నొప్పులు, నీరసం ఆకలి మందగించడం, వాంతులు, పొడిదగ్గు, నాడీ మండలానికి సంబంధించిన లక్షణాలు కనిపిస్తాయి. రోగ నిరోధక శక్తి ఉన్న సమయంలోనే పిచ్చికుక్క కరిస్తే వారం రోజులకు ఒకటి చొప్పున ఇంజక్షన్లు తీసుకోవాలి. రేబీస్ వ్యాధి రాకుండా ముందే ఇంజక్షన్లు తీసుకోవడం ద్వారా నియంత్రించవచ్చు. రేబీస్ వ్యాధి వచ్చిన తరువాత చికిత్స లేదనే చెప్పుకోవచ్చు.
జిల్లాలో నెలల వారీగా కుక్కకాటు బాధితులు
మాసం బాధితులు
జనవరి 829
ఫిబ్రవరి 494
మార్చి 498
ఏప్రిల్ 444
మే 398
జూన్ 342
జూలై 406
ఆగస్టు 372
సెప్టెంబరు 396
అక్టోబరు 463
మొత్తం 4642