Share News

భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యం చేయవద్దు

ABN , Publish Date - Oct 25 , 2025 | 12:28 AM

భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి జాప్యం చేయవద్దని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు.

భూభారతి దరఖాస్తుల పరిశీలనలో జాప్యం చేయవద్దు

కలెక్టర్‌ సత్యప్రసాద్‌

కథలాపూర్‌, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): భూభారతి రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిశీలనలో ఎలాంటి జాప్యం చేయవద్దని కలెక్టర్‌ సత్యప్రసాద్‌ సూచించారు. మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయంను శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులు ఎన్ని పరిష్కరించారు.. ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయని అధికారులను అడిగి తెలసుకున్నారు. క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపారా అని ప్రశ్నించారు. నిర్ణీత గడువులోగా దరఖాస్తులను పరిష్కరించాలని లేకపోతే తిరస్కరణకు గల కారణాలను మాడ్యూల్‌లో పేర్కొనాలని సూచించారు. మీసేవలో ధ్రువీకరణ పత్రాలు పెండింగ్‌లో ఉంచకుండా ఎప్పటికప్పుడు సర్టిఫికేట్లు జారీ చేయాలని అన్నారు. అనంతరం దుంపెట, కథలాపూర్‌ గ్రామాల్లో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను పరిశీలించి లబ్ధిదారులతో పలు విషయాలపై చర్చించారు. ఇళ్ల నిర్మాణాలు నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేసి బిల్లులు పొందాలని చెప్పారు. నిరుపేదలైన లబ్ధిదారులకు అవసరమైతే మహిళా సంఘాల ధ్వారా రుణాలు అందించేందుకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేయాలన్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇసుక ఉచితంగా అందిస్తోందని కూలీల, రవాణా ఖర్చులు లబ్ధిదారులే భరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. వారం వారం ఇళ్ల నిర్మాణ ప్రగతిని తెలుసుకుంటూ వారికి బిల్లులు సకాలంలో అందేలా చూడాలని ఎంపీడీవోను ఆదేశించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజన అమలు తీరును పరిశీలించారు. తరగతి గదుల్లో విద్యార్థులను పలు పాఠ్యాంశాలపై ఎంతమేర అవగాహన ఉందో పరిశీలించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. పాఠశాలలో టాయ్‌లెట్స్‌ అవసరం ఉందని ఉపాధ్యాయులు, విద్యార్థులు కలెక్టర్‌ దృష్టికి తెచ్చారు. ఆయన వెంట కోరుట్ల ఆర్డీవో జివాకర్‌రెడ్డి, తహసీల్దార్‌ వినోద్‌, ఎంపీడీవో శంకర్‌నాయక్‌, పంచాయతీ కార్యదర్శులు, కారోబార్లు ఉన్నారు.

Updated Date - Oct 25 , 2025 | 12:28 AM