13,378.17 కోట్లతో జిల్లా రుణ ప్రణాళిక
ABN , Publish Date - May 15 , 2025 | 12:34 AM
కరీంనగర్, మే 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ 13378 కోట్ల 17 లక్షలతో రూపొందించిన 2025-26 జిల్లా రుణ ప్రణాళికను కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ఆవిష్కరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఈ ప్రణాళికను ఆవిష్కరించారు.
- ఆవిష్కరించిన కలెక్టర్ పమేలా సత్పతి
- గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ. 11,627 కోట్ల రుణాలు
- వ్యవసాయ రంగానికి 5157.33 కోట్లు
- ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌కు 3239.40 కోట్లు
- గృహ రుణాలకు 310.50 కోట్లు కేటాయింపు
- స్వయం సహాయక సంఘాలకు రూ. 875 కోట్లు
కరీంనగర్, మే 14 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వ్యవసాయ రంగానికి పెద్ద పీట వేస్తూ 13378 కోట్ల 17 లక్షలతో రూపొందించిన 2025-26 జిల్లా రుణ ప్రణాళికను కలెక్టర్ పమేలా సత్పతి బుధవారం ఆవిష్కరించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ సమీక్షా సమావేశంలో కలెక్టర్ ఈ ప్రణాళికను ఆవిష్కరించారు.
ఫ వ్యవసాయ రంగానికి ప్రాధాన్యం
జిల్లా రుణ ప్రణాళికలో వ్యవసాయ రంగానికి ఎప్పటి మాదిరిగానే అత్యధిక ప్రాధాన్యమిచ్చారు. పంట రుణాలకు, వ్యవసాయ రంగంలో ఇతర అవసరాలకు 5,137 కోట్ల 33 లక్షల రూపాయలు రైతులకు రుణంగా ఇవ్వాలని నిర్ణయించారు. సూక్ష్మ, చిన్న, మధ్య, తరహా పరిశ్రమలకు 3239.4 కోట్లు, గృహ రుణాలకు 310.5 కోట్లు, విద్యా రుణాలకు 49.5 కోట్లు అందజేయాలని ప్రణాళికలో నిర్దేశించారు. ఎగుమతి రంగాలకు 6.4 కోట్లు, సామాజిక మౌళిక సదుపాయాలకు 20.32 కోట్లు, పునరుత్పాదక ఇంధనానికి 50.97 కోట్ల రుణాలు అందజేయనున్నారు. ఇతర ప్రాధాన్య రంగాలకు 255 కోట్లు, స్వయం సహాయక సంఘాలకు 875 కోట్లు రుణాలుగా అందజేయాలని నిర్ణయించారు. ఇతర రంగాలకు 3413.75 కోట్లు రుణాలుగా సమకూర్చాలని నిర్ణయించారు.
ఫ 2024-25 రుణ ప్రణాళిక అమలు తీరుపై సమీక్ష
2024-25లో రూపొందించిన రుణ ప్రణాళిక అమలు తీరును ఈ సమావేశంలో సమీక్షించారు. 2025 మార్చితో ముగిసిన ఆర్థిక సంవంత్సరంలో 11,627 కోట్లు రుణాలుగా అందజేశామని బ్యాంకర్లు వివరించారు. వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ రంగాలకు 4829.61 కోట్లు ఎంఎస్‌ఎంఈ రంగంలో 2092.79 కోట్లు రుణాలుగా అందజేశారు. విద్యా రుణాలకు గాను 17.11 కోట్లు, గృహ నిర్మాణం కోసం 166.21 కోట్లు ఇతర రంగాలకు 4521.32 కోట్లు ఆర్థిక సాయంగా అందించినట్లు సమీక్షలో అధికారులు వివరించారు. గత సంవత్సర రుణ ప్రణాళిక 108.31 శాతం అమలైందని బ్యాంకర్లు తెలిపారు.
ఫ రుణాల రికవరీపై దృష్టి సారించాలి..
కలెక్టర్ పెండింగ్‌లో రుణాల ప్రతిపాదనలను బ్యాంకర్లకు అందించి త్వరగా వాటిని మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వివిధ పథకాలలో రుణాలు మంజూరైనా లబ్ధిదారులు, స్వయం సహాయక సంఘాలు బ్యాంకులకు సకాలంలో రుణాలను చెల్లించేలా ఆయా శాఖల అధికారులు రికవరీపై శ్రద్ధ చూపించాలని ఆదేశించారు. జిల్లాలోని యువతకు ఉపాధి అందించే విఽషయంలో అధికారులు చొరవ చూపించాలని సూచించారు. జిల్లాలో వివిధ పథకాలకు ఆర్థిక మద్ధతు అందించడంలో బ్యాంకర్లు సంపూర్ణ లక్ష్య సాధన కోసం సహకరించాలని కలెక్టర్ కోరారు. ఈ లక్ష్య సాధనలో ఆయా శాఖల జిల్లా అధికారులు, బ్యాంకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. రైతులు తమ రుణాలను తిరిగి చెల్లించి రెన్యూవల్ చేసుకునే అంశంపై అవగాహన కల్పించాలని, బ్యాంకర్లు వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ప్రపుల్ దేశాయ్ మాట్లాడుతూ రాజీవ్ యువ వికాసం కోసం స్వీకరించిన దరఖాస్తులను బ్యాంకర్లకు పంపించామన్నారు. దరఖాస్తులన్నింటిని పరిశీలించి అర్హత గల లబ్ధిదారుల వివరాలను మూడు రోజుల్లో సమర్పించాలని సూచించారు. సమావేశంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, లీడ్ బ్యాంకు మేనేజర్ ఆంజనేయులు, ఆర్బీఐ అధికారి సాయితేజరెడ్డి, నాబార్డ్ డీడీఎం ఎస్ జయప్రకాశ్, ఎస్‌బీఐ ఏజీఎం వెంకటేష్, చీఫ్ మేనేజర్ రామచంద్రుడు, టీజీబీ ఆర్‌ఎం బాలనాగు, కేడీసీసీబీ డీజీఎం, అన్ని బ్యాంకుల కంట్రోలర్స్, కో-ఆర్డినేటర్స్, బ్రాంచ్ మేనేజర్లు, డీఏవో భాగ్యలక్ష్మి, డీడబ్ల్యూవో సరస్వతి, ఉద్యాన శాఖ డీడీ శ్రీనివాస్, అడిషనల్ డీఆర్డీఏ సునీత పాల్గొన్నారు.
రుణాల లక్ష్యాలు ఇలా..
=========================
వివిధ రంగాలు రుణాలు (రూ. కోట్లలో)
==================================
వ్యవసాయం 5,137.33
సూక్ష్మ, చిన్న, మధ్య, తరహా పరిశ్రమలు 3239.4
గృహ రుణాలు 310.5
విద్యా రుణాలు 49.5
ఎగుమతి రంగాలు 6.4
సామాజిక మౌలిక సదుపాయాలు 20.32
పునరుత్పాదక ఇందనం 50.97
ఇతర ప్రాధాన్య రంగాలు 255
స్వయం సహాయక సంఘాలు 875
ఇతర రంగాలు 3413.75
============================================
మొత్తం 13,356.17 కోట్లు
================================================