పంటల సాగుపై డిజిటల్ సర్వే
ABN , Publish Date - Aug 27 , 2025 | 01:11 AM
వ్యవసాయ శాఖాధికారులు, విస్తీర్ణాధికారులు ఇక పొలం బాట పట్టనున్నారు.
(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)
వ్యవసాయ శాఖాధికారులు, విస్తీర్ణాధికారులు ఇక పొలం బాట పట్టనున్నారు. వానాకాలం సీజన్‌లో రైతులు ఎంత విస్తీర్ణంలో ఏఏ పంటలు సాగు చేశారనే విషయమై డిజిటల్ సర్వే చేయనున్నారు. సర్వే వెంటనే ఆరంభించాలని ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 28వ తేదీ నుంచి సర్వే ఆరంభించనున్నారు. వాస్తవానికి మంగళవారం నుంచే ఆరంభం కావాల్సి ఉన్నప్పటికీ, డిజిటల్ క్రాప్ సర్వే యాప్ సాంకేతిక కారణాల వల్ల సర్వర్ పని చేయలేదు. జిల్లాలో ఈ సీజన్‌లో 2,76,076 ఎకరాల్లో వరి, పత్తి, మొక్కజొన్న, వివిధ రకాల పంట లను రైతులు సాగు చేస్తారని వ్యవసాయ శాఖాధి కారులు అంచనా వేశారు. ఇప్పటి వరకు 2 లక్షల 60 వేల ఎకరాల్లో వరి, పత్తి సాగు చేశారు. ఇంకా పెరిగే అవకాశాలున్నాయి. జిల్లాలో ఈ సీజన్‌లో ఆలస్యంగా వర్షాలు పడిన కారణంగా పంటల సాగు కూడా ఆలస్య మయ్యింది. జిల్లాలో 1,61,032 మంది రైతులు పట్టా భూములు కలిగి ఉన్నారు. ఇందులో 2.5 ఎకరాల వరకు 1,24,730 మంది రైతులు, 2.5 ఎకరాల నుంచి 5 ఎకరాల వరకు 28,297 మంది రైతులు, 5 నుంచి 10 ఎకరాల వరకు 6,222 మంది రైతులు, 10 నుంచి 25 ఎకరాల వరకు 744 మంది రైతులు, 25 ఎకరాలకు పైగా భూములు కలిగిన రైతులు 39 మంది ఉన్నారు. సాగు భూములు 2 లక్షల 80 వేల ఎకరాల వరకు ఉన్నాయి. రైతులు ప్రతి సీజన్‌లో ఏ పంటలను సాగు చేస్తున్నారనే విషయమై రాష్ట్ర ప్రభుత్వం ఐదేళ్లుగా పంటల సర్వే చేస్తున్నది. ఇందుకోసం ఒక యాప్‌ను రూపొందించింది. జిల్లాలో 54 క్లస్టర్లు ఉండగా, వాటి పరిధిలో 54 మంది వ్యవసాయ విస్తీర్ణాధికారులు పని చేస్తున్నారు. పంటలు సాగు చేసే సమయం పూర్తి కావడంతో ప్రభుత్వం సర్వేకు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే సర్వేతోపాటు కేంద్ర ప్రభుత్వం కూడా డిజిటల్ క్రాప్ సర్వే చేయిస్తున్నది. డిజిటల్ క్రాప్ సర్వే చేయాలంటే తప్పనిసరిగా క్షేత్రస్థాయికి వెళ్లాల్సిందే. పొలాల వద్దకు వెళ్లి పంటలను రైతుతో కలిసి ఫొటోలు తీసి రైతు వివరాలు, సర్వే నంబర్, పట్టాదారు పాసు పుస్తకం నంబర్, సాగు చేస్తున్న పంట, విస్తీర్ణం వివరాలు నమోదు చేసి అప్‌లోడ్ చేయాలి. ఆ తర్వాత సర్వే వివరాలన్నింటినీ ఆన్‌లైన్‌లో నమోదు చేయాలి. పంటల సాగు వివరాలు నమోదు చేయడం వల్ల రైతులకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందేందుకు దోహదపడతాయి. అలాగే ప్రభుత్వం ఏర్పాటు చేసే కొనుగోలు కేంద్రాల్లో పంట ఉత్పత్తులను విక్రయించేటప్పుడు తప్పుడు వివరాలు నమోదు చేయకుండా ఉంటుంది. ఉదాహరణకు ప్రభుత్వం సన్న రకం వరి సాగు చేసే రైతులకు క్వింటాలు ధాన్యానికి 500 రూపాయల బోనస్ ఇస్తామని ప్రకటించింది. డిజిటల్ క్రాప్ సర్వేలో ఒక రైతు తాను పండించిన పంటల వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తారు. ఎంత విస్తీర్ణంలో సన్నరకం వరి పంట వేశారో, తద్వారా ఎంత దిగుబడి వస్తుందో, అంతకు మాత్రమే బోనస్ చెల్లిస్తారు. అక్రమాలకు తావు లేకుండా ఉపయోగ పడనున్నది. అలాగే పంటల సాగు విస్తీర్ణాన్ని బట్టి పంట ఉత్పత్తుల కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, విత్తనాలు, ఎరువులను సిద్ధం చేసుకునేందుకు దోహద పడనున్నది. అక్టోబర్ నెలాఖరు వరకు సర్వేను పూర్తి చేయనున్నారు.