బల్దియాలో డీజిల్ గోల్‌మాల్
ABN , Publish Date - May 29 , 2025 | 12:46 AM
జగిత్యాల మున్సిపల్ వాహనాల్లో డీజిల్ వినియోగంలో గోల్‌మాల్ జరిగింది. గతంలో ఆస్తి పన్ను వసూళ్లు, శానిటేషన్‌లో లక్ష్యాలను అధిగమించి ప్రశంసలు అందుకున్న జగిత్యాల మున్సిపాలిటీలో ప్రస్తుతం అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల మున్సిపాలిటీలో ప్రతివారం శానిటేషన్ కోసం వాహనాలకు డీజిల్ పోయిస్తున్నారు. బల్దియాలో మొత్తం 72 శానిటేషన్‌కు వినియోగించే వాహనాలు ఉన్నాయి. వీటికి వారానికి సుమారు 2 వేల లీటర్ల డీజిల్ వినియోగం అవుతుందని అంచనా ఉంది.
-రూ.లక్షల నిధులు పక్కదారి
-వాహన నంబర్లు లేని బిల్లులతో అక్రమాలు
-జగిత్యాల శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు మెమో జారీ
జగిత్యాల, మే 28 (ఆంధ్రజ్యోతి): జగిత్యాల మున్సిపల్ వాహనాల్లో డీజిల్ వినియోగంలో గోల్‌మాల్ జరిగింది. గతంలో ఆస్తి పన్ను వసూళ్లు, శానిటేషన్‌లో లక్ష్యాలను అధిగమించి ప్రశంసలు అందుకున్న జగిత్యాల మున్సిపాలిటీలో ప్రస్తుతం అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జగిత్యాల మున్సిపాలిటీలో ప్రతివారం శానిటేషన్ కోసం వాహనాలకు డీజిల్ పోయిస్తున్నారు. బల్దియాలో మొత్తం 72 శానిటేషన్‌కు వినియోగించే వాహనాలు ఉన్నాయి. వీటికి వారానికి సుమారు 2 వేల లీటర్ల డీజిల్ వినియోగం అవుతుందని అంచనా ఉంది. 2023-24 ఆర్థిక సంవత్సరం మార్చి వరకు రూ.10 లక్షల డీజిల్ వినియోగం కాగా 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి నెల వరకు రూ.16.27 లక్షలకు పెరగడం అనుమానాలకు తావిస్తోంది. ఏడాది కాలంలో డీజిల్ వినియోగం రూ.6 లక్షలకు పైగా పెరగడం ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఈ విషయమై కొందరు కలెక్టర్ సత్యప్రసాద్‌కు ఫిర్యాదు చేయగా ఆయన ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశించి పది రోజులు గడిచినా నేటికీ విచారణ నివేదిక బయటకు రాకపోవడం గమనార్హం. డీజిల్ వ్యవహారంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు మెమో జారీ చేశారు.
ఫకూపన్ విధానానికి ఎసరు..
గతంలో వాహనాల్లో డీజిల్ పోయించేందుకు ఎలాంటి అవకతవకలకు తావు లేకుండా అప్పటి పాలకులు కూపన్ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు. పారిశుధ్య వాహనంలో వారానికి ఒకసారి సుమారు 30 లీటర్ల డీజిల్ పోయిస్తుండేవారు. కమిషనర్ కూపన్ రాసి ఇస్తే, వాహనదారులు ఆ రశీదులను శానిటరీ ఇన్‌స్పెక్టర్‌కు ఇవ్వాల్సి ఉండేది. శానిటరీ ఇన్స్‌పెక్టర్ పర్యవేక్షణలో వాహనాల్లో డీజిల్ పోయించే విధానం ఉండేది. ఈ పద్ధతి ద్వారా ప్రతి ఏడాది సుమారు రూ.8 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు డీజిల్ ఖర్చు వచ్చేది. కానీ కూపన్ వ్యవస్థకు ఎసరు పెట్టడంతో గత ఏడాదిగా రూ.16 లక్షల పైచిలుకు బిల్లులు రావడం అనుమానాలకు తావిస్తోంది. కాగా మున్సిపల్ కార్యాలయంలోని వేరే విభాగంలో పనిచేస్తున్న ఓ సీనియర్ అసిస్టెంట్‌కు డీజిల్ బిల్లులు అప్పగించారు.
ఫమాన్యువల్ బిల్లులు సమర్పణ
మున్సిపల్ వాహనాలకు సంబంధించి డీజిల్ పోయించేపుడు సదరు పెట్రోల్ బంకు నిర్వాహకులు కంప్యూటర్ బిల్లులు ఇస్తుంటారు. సదరు బిల్లులో వాహన నంబర్, ఎన్ని లీటర్ల డీజిల్, ఎంత ధర, ఏ సమయానికి పోయించారనే పూర్తి వివరాలు రశీదులో నిక్షిప్తమై ఉంటాయి. ఆ బిల్లులనే రిజిస్టర్‌లో ఎంట్రీ చేయాల్సి ఉంటుంది. కానీ కంప్యూటర్ బిల్లులు రావడం లేదనే నెపంతో మాన్యువల్ బిల్లులు తీసుకొని రికార్డులు నమోదు చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మాన్యువల్ బిల్లుల్లో వాహన నెంబర్లు లేకపోవడం మరింత అనుమానాలకు తావిస్తోంది. ఈ విషయంపై వచ్చిన ఫిర్యాదుల మేరకు విచారణకు కలెక్టర్ సత్యప్రసాద్ ఆదేశించిన నివేదిక బహిర్గతం చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది.
ఫఉన్నతాధికారుల పర్యవేక్షణ లేమి
జగిత్యాల మున్సిపాలిటీపై పర్యవేక్షణ లోపంతో అవినీతి పెరిగిపోయిందన్న విమర్శలున్నాయి. ఈ మధ్య కాలంలో ఏసీబీ, విజిలెన్స్ దాడులు జరుగుతున్నా ఉన్నతాధికారులు కనీసం కార్యాలయాన్ని సందర్శించడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. మున్సిపల్ శాఖ అధికారులు, సిబ్బందితో సమీక్ష నిర్వహించకపోవడం, ఆకస్మిక తనిఖీలు లేకపోవడంతో కార్యాలయంలో సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉన్నతాధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి మున్సిపల్ ఆదాయానికి గండిపడకుండా చర్యలు చేపట్టాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
డీజిల్ అక్రమాలపై చర్యలు తీసుకుంటున్నాం
-స్పందన, మున్సిపల్ కమిషనర్, జగిత్యాల
మున్సిపాలిటీలో డీజిల్ అక్రమాల ఆరోపణలపై దృష్టి సారించాం. పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఇందుకు కారణమైన శానిటరీ ఇన్‌స్పెక్టర్ మారుతికి మెమో జారీ చేశాం. డీజిల్ వినియోగంపై బాధ్యతలను కొత్త అధికారులను అప్పగించాం. డీజిల్ బిల్లును తగ్గించడానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకున్నా.