ధర్మపురి క్షేత్రాన్ని అభివృద్ధి చేస్తా
ABN , Publish Date - Dec 31 , 2025 | 12:55 AM
ధర్మపురి క్షేత్రాన్ని ఆశించిన రీతిలో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.
-మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్
ధర్మపురి, డిసెంబరు 30 (ఆంధ్రజ్యోతి): ధర్మపురి క్షేత్రాన్ని ఆశించిన రీతిలో అభివృద్ధి చేస్తానని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వికలాంగుల సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా స్థానిక లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఆవరణలో కాంగ్రెస్ కోరుట్ల నియోజకవర్గ ఇంఛార్జ్ జువ్వాడి నర్సింగరావుతో కలిసి మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ధర్మపురి క్షేత్రానికి శతాబ్దాల చరిత్ర కలిగి ఉందని ఆయన తెలిపారు. ఈ క్షేత్రానికి నిత్యం వేలాది మంది భక్తులు చేరుకుని గోదావరి నదిలో స్నానాలు చేసి స్వామి వారిని దర్శనం చేసుకుంటారని ఆయన పేర్కొన్నారు. భక్తుల సౌకర్యార్థం ఈ క్షేత్రంలో ఎంతో అభివృద్ది జరగాల్సి ఉందని ఆయన తెలిపారు. ఈ క్షేత్రాన్ని పర్యాటక ప్రదేశంగా తీర్చిదిద్దుతానని ఆయన హామీ ఇచ్చారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం కోసం ముందుకు సాగుతున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే గోదావరి పుష్కరాల కోసం ఒక ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లి సీఎం రేవంత్‌రెడ్డి ద్వారా నిధులు తీసుక వచ్చి అభివృద్ధి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. దివంగత మాజీ మంత్రి రత్నాకర్‌రావు హయాంలో అభివృద్ధి ఎంతో జరిగిందని, ఆయనను ఆదర్శంగా తీసుకుని ముందుకు వెళుతానని ఆయన అన్నారు. ఈ సమావేశంలో టీపీసీసీ సభ్యులు, ధర్మపురి మండల కాంగ్రెస్ అధ్యక్షులు సంగనభట్ల దినేష్, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ జక్కు రవీందర్, ధర్మపురి బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు కుంట సుధాకర్, మండల కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల రాజేష్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు చీపిరిశెట్టి రాజేష్, సర్పంచలు రాందేని మొగిలి, కాసారపు బాలాగౌడ్, పందిరి అశోక్, చిలుముల లక్ష్మణ్, నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.