జోరుగా ధాన్యం కొనుగోళ్లు
ABN , Publish Date - Nov 18 , 2025 | 01:12 AM
ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరమయ్యాయి. మొంథా తుఫానుతో పొలాల్లో నీరు చేరి వరి కోతలు ఆలస్యమయ్యాయి.
- ఇప్పటికే 1.05 మెట్రిక్ టన్నుల కొనుగోలు
- కొనుగోలు చేసిన ధాన్యం విలువ రూ. 213.85 కోట్లు
- రైతులకు చెల్లించింది రూ. 138.5 కోట్లు
- అందుబాటులో లేని టార్పాలిన్లు
(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్)
ఖరీఫ్ వరి ధాన్యం కొనుగోళ్లు ముమ్మరమయ్యాయి. మొంథా తుఫానుతో పొలాల్లో నీరు చేరి వరి కోతలు ఆలస్యమయ్యాయి. పొలాల్లో బురద ఇప్పటికీ ఎండకపోయినా రైతులు ట్రాక్ హార్వెస్టర్ల ద్వారా పొలాలు కోపిస్తున్నారు. దీంతో కొనుగోలు కేంద్రాలకు వరి ధాన్యం ఎక్కువగా వస్తున్నది. జిల్లాలో ఏర్పాటు చేసిన 325 కేంద్రాల్లో ఏడుకేంద్రాలు మినహా అన్నిప్రాంతాల్లో కొనుగోళ్లు ప్రారంభమయ్యాయి. ఇప్పటికే 16,783 మంది రైతులకు చెందిన 1,05,149 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈ ధాన్యం విలువ 251.2 కోట్ల రూపాయలు. ఇప్పటికే 138.5 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. ఇంకా 112.7 కోట్ల రూపాయలు రైతులకు చెల్లించాల్సి ఉన్నది.
ఫ ధ్రువీకరణలో మిల్లర్లు, కొనుగోలు వివరాల నమోదులో జాప్యం
కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని మిల్లులకు వెంటనే తరలిస్తున్నారు. మిల్లర్ల నుంచి ధాన్యం తమకు చేరినట్లు ధ్రువీకరంచిడంలో కొంత జాప్యం జరుగుతుండడంతో సివిల్ సప్లయిస్ శాఖ నుంచి రైతుల ఖాతాల్లో డబ్బు వెంట వెంటనే జమ కావడం లేదని తెలుస్తున్నది. కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేసిన ఽధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో కూడా కొంత ఆలస్యం జరుగుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి.
ఫ జిల్లాలో 2,75,398 ఎకరాల్లో వరి సాగు
జిల్లాలో ఈ సీజన్‌లో 2,75,398 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఎకరాకు 21 క్వింటాళ్ల నుంచి 22 క్వింటాళ్ల చొప్పున సుమారు ఆరు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేశారు. అందులో విత్తన పంట, రైతుల సొంత అవసరాలకు నిల్వ చేసుకునే ధాన్యంతోపాటు ప్రైవేట్ వ్యాపారులు కొనుగోలు చేసే ధాన్యం మూడు లక్షల మెట్రిక్ టన్నులు ఉంటుందిు. మరో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం రైతులు కొనుగోలు కేంద్రాలకు తీసుకు వస్తారని భావించారు. జిల్లా వ్యాప్తంగా 325 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోతలు ఆలస్యం కావడంతో ఇప్పటి వరకు 1.05,148 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు కేంద్రాలకు వచ్చింది.
ఫ వాతావరణ పరిస్థితులపై ఆందోలన
అన్ని కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం ఉన్నా తేమశాతం అధికంగా వస్తోంది. రైతులు కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యం ఆరబోసి తేమ శాతం తగ్గగానే విక్రయిస్తున్నారు. వర్షాలు కురిస్తే తమ పరస్థితి ఏంటని రైతులు ఆందోళన చెందుతున్నారు. చలి గాలులు పెరగడంతో తీవ్రంగా మంచు పడుతూ ఆరబోసిన వరి ధాన్యంలో తేమ చేరుతున్నది. జిల్లాలో ఉన్న కొనుగోలు కేంద్రాలకు 10,552 టార్పాలిన్లు అవసరమవుతాయని అధికారులు భావించారు. 6,948 టార్పాలిన్లు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. టార్పాలిన్లు తెప్పించడానికి ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ అందుబాటులోకి రాలేదని సమాచారం. దీంతో రైతులు సొంతగా ధాన్యానికి టార్పాలిన్లు తెచుకుంటన్నారు. రోజుకు మూడు వందల నుంచి నాలుగు వందల రూపాయల అద్దె చెల్లించి టార్పాలిన్లను సమకూర్చుకుంటున్నారు. ురో వారం రోజులు వాతావరణం ఇలాగే ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో వెంటనే టార్ఫాలిన్లును అందుబాటులోకి తేవాలని రైతులు కోరుతున్నారు.
ఫ క్వింటాల్‌కు నాలుగు కిలోలు అదనం
ధాన్యం కొనుగోలు సమయంలో గోనె సంచిబరువు కలుపుకుని 40 కేజీల తూకం వేయాల్సి ఉండగా 42 కేజీల ధాన్యం తీసుకుంటున్నారని రైతులు అంటున్నారు. ఒక్కో క్వింటాలుపై నాలుగు నుంచి ఐదు కేజీల ధాన్యం తరుగు పేరిట ఎక్కువగా తీసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.