రాజన్న ఆలయానికి పోటెత్తిన భక్తులు
ABN , Publish Date - Oct 01 , 2025 | 11:13 PM
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు.
వేములవాడ కల్చరల్, అక్టోబరు 1 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయానికి బుధవారం భక్తులు పోటెత్తారు. వివిధ ప్రాంతాల నుంచి రాజన్న ఆలయానికి తరలివచ్చిన భక్తులు ముందుగా తలనీలాలు సమర్పించుకుని ఆలయ ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించారు. ధర్మదర్శనం, శీఘ్రదర్శనం క్యూలైన్‌ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకుని శ్రీరాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. రాజన్నకు ఎంతో ప్రీతిపాత్రమైన కోడెమొక్కును చెల్లించుకున్నారు. భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో రమాదేవి ఆధ్వర్యంలో ఉద్యోగులు ఏర్పాట్లను పర్యవేక్షించారు.
సిద్ధిదా అలంకారంలో అమ్మవారు..
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారి ఆలయంలో దేవీనవరాత్రోత్సవాలు వెభవంగా కొనసాగుతున్నాయి. పదో రోజు బుధవారం తెల్లవారుజాము నుంచే ఆలయంలో అర్చకులు శ్రీలక్ష్మీగణపతి, శ్రీరాజేశ్వర స్వామివారలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీరాజరాజేశ్వరీదేవి అమ్మవారు శ్రీ సిద్ధిదా అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈవో రమాదేవితో పాటుగా భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు.