అన్ని రంగాల్లో అభివృద్ధి
ABN , Publish Date - Aug 16 , 2025 | 01:15 AM
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని రాష్ట్ర ఐటి, ఎలకా్ట్రనిక్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు.
- ప్రతి నియోజక వర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు
- రైతులకు ఎకరాకు 12 వేలు రైతు భరోసా
- బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు
- ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం
- ఆహార భద్రత పేదలకు సన్నబియ్యం
- రాష్ట్ర ఐటి ఎలకా్ట్రనిక్స్ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు
కరీంనగర్, ఆగస్టు 15(ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి పర్చడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నదని రాష్ట్ర ఐటి, ఎలకా్ట్రనిక్స్, పరిశ్రమలు, వాణిజ్య శాఖ, శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. శుక్రవారం కరీంనగర్‌లోని పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో 79వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని జెండాను అవిష్కరించిన అనంతరం మాట్లాడారు. ప్రపంచ వేదికపై తెలంగాణను సగర్వంగా నిలబెట్టే సంకల్పంతో తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని, అందులో భాగంగానే జిల్లాలో కూడా వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నదని అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో జరిగిన నష్టాన్ని భర్తీ చేస్తూనే, శాశ్వత హక్కుల సాధనలో విజయం సాధించేలా మన ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో పని చేస్తుందన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పేద ప్రజల ఆహార భద్రతకు భరోసా ఇస్తున్నామన్నారు. అదే స్ఫూర్తితో ప్రజా ప్రభుత్వం ఉగాది నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభించిందన్నారు. 13 వేల కోట్ల రూపాయల వ్యయంతో, 3.10 కోట్ల మందికి సన్నబియ్యం అందిస్తున్నామన్నారు. ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీకగా రాష్ట్రం వ్యాప్తంగా నూతన రేషన్ కార్డుల పంపిణీ ప్రారంభించామన్నారు. గత ఏడాది ఆగస్టు 15 రైతు రుణమాఫీకి శ్రీకారం చుట్టి రాష్ట్రంలోని 25.35 లక్షల మంది రైతులకు, రూ.20,616 కోట్ల రుణమాఫీ చేసి ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అందించని విధంగా చరిత్ర సృష్టించామన్నారు. ఆర్థిక పరిస్థితి సహకరించకపోయినా, గత పాలకుల పాపాలు వెంటాడుతున్నా. రైతుల విషయంలో రాజీ పడలేదన్నారు. తెలంగాణ రైతును రుణ విముక్తి చేసి, దేశంలో అత్యధిక పంట పండిచే దిశగా ప్రోత్సహించామన్నారు. ’ఇందిరమ్మ రైతు భరోసా కింద ఎకరాకు రూ.12 వేల పెట్టుబడి సాయం ప్రకటించామన్నారు. పరిమితులు లేకుండా ప్రతి రైతుకు సాయం చేశామన్నారు. జూన్ 16న ప్రారంభించి కేవలం తొమ్మిది రోజుల్లో తొమ్మిది వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేశామన్నారు. రాష్ట్రంలోని 70,11,184 మంది రైతులకు సాయం అందించామన్నారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న 1,2 లక్షల మంది రైతులకు కూడా పెట్టుబడి సాయం అందించామన్నారు. సన్నాలకు క్వింటాల్ కు రూ.500 బోనస్ ఇస్తున్నామని, ధాన్యం కొనుగోలు చేసిన48 గంటల్లోనే డబ్బులను రైతుల ఖాతాల్లో జమ చేస్తున్నామన్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్, దీని కోసం రూ.16,691 కోట్ల సబ్సిడీని విద్యుత్తు సంస్థలకు చెల్లిస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్ర వ్యవసాయ చరిత్రను తిరగ రాసి అన్నదాతల సంక్షేమానికి రూ ఒక లక్ష 13 వేల కోట్ల రూపాయల ఖర్చు చేశామన్నారు. తొలి విడతగా ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామన్నారు. దీనికి రూ.22,500 కోట్లు వెచ్చిస్తున్నామన్నారు. స్థానిక సంస్థలలో విద్యా, ఉద్యోగాలలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించే బిల్లులను ఈ ఏడాది మార్చి 17న రాష్ట్ర శాసనసభ ఆమోదించిందని గుర్తు చేశారు. సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా రాష్ట్రంలోని ఎస్సీల్లో ఉన్న 59 ఉప కులాలను మూడు గ్రూపులుగా విభజించామన్నారు.
ఫ ఆరోగ్య శ్రీ పరిధి రూ. 10 లక్షలకు పెంపు
ఆరోగ్య శ్రీ పథకానికి పూర్వవైభవం తీసుకు వచ్చామన్నారు. బాధ్యతలు స్వీకరించిన వెంటనే ఆరోగ్య శ్రీ పరిధిని రూ.5 లక్షల నుండి 10 లక్షలకు పెంచామన్నారు. 27 ఎకరాల విస్తీర్ణంలో 2,700 కోట్ల రూపాయల వ్యయంతో నూతన ఉస్మానియా ఆసుపత్రి భవన సముదాయాన్ని నిర్మిస్తున్నామన్నారు. రాష్ట్రంలో అనేక చోట్ల వైద్య విద్యా కళాశాలలు నిర్మిస్తున్నామన్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వైద్యా ఆరోగ్య రంగంపై 16,521 కోట్ల రూపాయలు వ్యయం చేశామన్నారు. ప్రజా ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే మహాలక్ష్మీ పథకం కింద ఆడబిడ్డలకు ఆర్టీసీలో ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించామన్నారు. యువత ఉద్యోగ, ఉపాధికి పెద్ద పీట వేస్తున్నామని, టీజీపీఎస్సీని సంస్కరించి. 20 నెలల కాలంలో దాదాపు 60 వేల ఉద్యోగాలు భర్తీ చేశామన్నారు.
ఫ పెండింగ్ ప్రాజెక్టుల పూర్తికి చర్యలు
తెలంగాణ మాగాణాలకు చివరి ఆయకట్టు వరకు సాగునీరు ఇచ్చే ప్రణాళికలతో పెండింగ్ ప్రాజెక్టులను లక్ష్యాలు నిర్దేశించుకుని పూర్తి చేస్తున్నామన్నారు. 2047 నాటికి భారతదేశ ముఖచిత్రాన్ని మార్చడంలో తెలంగాణ పాత్ర కీలకంగా ఉండాలన్న సంకల్పంతో పనిచేస్తున్నా మన్నారు. గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్లలోపు విద్యుత్ వాడే వినియోగదారులందరికీ జీరో బిల్లులు జారీ చేస్తున్నామన్నారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో ముందుకు తీసుకువెళ్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి , జిల్లా సర్వతోముఖాభి.వృద్దికి నిర్మాణాత్మక సహకారం, సూచనలు అందిస్తున్న పార్లమెంటు సభ్యులకు, శాసనమండలి సభ్యులకు, శాసన సభ్యులకు, స్థానిక ప్రజా ప్రతినిధులకు, జిల్లా ఉన్నతాధికా రులకు, పోలీస్ సిబ్బందికి, న్యాయాధికారులకు, ఉద్యోగులకు, స్వచ్చంధ సంస్థల ప్రతినిధులకు, స్వాతంత్య్ర సమరయోధులకు, జర్నలిస్టులకు, జిల్లా ప్రజలకు, ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో శాసన సభ్యులు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్తి సత్యం, జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, పోలీస్ కమిషనర్ గౌస్‌అలం, అదనపు కలెక్టర్లు అశ్విని తానాజి వాకడే, లక్ష్మీకిరణ్, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్ దేశాయ్, సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, గ్రంధాలయ ఛైర్మన్ సత్తు మల్లేశం, ఆర్‌డిఓ మహేశ్వర్, తదితరులు పాల్గొన్నారు.
పరేడ్‌గ్రౌండ్‌లో సాంస్కృతిక ప్రదర్శనలు
కరీంనగర్ అర్బన్/ కరీంనగర్ కల్చరల్, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి) : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం పోలీసు పరేడ్‌గ్రౌండ్‌లో చిన్నారుల సాంస్కృతిక ప్రదర్శనలు అలరించాయి. పలు దేశభక్తి గీతాలపై రీజినల్ స్పోర్ట్ స్కూల్-కరీంనగర్, జెడ్‌పి హెచ్‌ఎస్ మానకొండూరు-బాలురు, టీజి ఎస్‌డబ్ల్యు చింతకుంట, బాలికలు, పారమిత-కరీంనగర్ పాఠశాలల విద్యార్థుల నృత్యాలు ఆకట్టుకున్నాయి.
ఫ సైన్ లాంగ్వేజ్ టీంతో నృత్యం చేసిన అధికారులు
ఇటీవల బదిర, మూగ పాఠశాలల చిన్నారులచే జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సైన్ లాంగ్వేజ్ టీం ఏర్పాటు చేసి వివిధ శాఖల అధికారులకు శిక్షణ ఇప్పించారు. ఈ క్రమంలో జనగణమన గీతంపై చిన్నారులతో కలసి కలెక్టర్‌తో పాటు ఇతర అధికారులు నృత్యం చేసి ఆకట్టుకున్నారు.
ఫ టెన్త్, ఇంటర్ విద్యార్థులకు ప్రోత్సాహక బహుమతులు
గత యేడు 10వ, ఇంటర్ తరగతుల్లో ఉత్తమ మార్కులు సాధించిన 8 మంది విద్యార్థులకు 10 వేల రూపాయల చొప్పున చెక్కుల రూపంలో ప్రోత్సాహక నగదు బహుమతులను మంత్రి శ్రీధర్‌బాబు, కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. బహుమతులు అందుకున్న వారిలో 10వ తరగతికి చెందిన సిద్ధం నాగలక్ష్మి టీజిఎంఎస్-గంగాధర, మాచర్ల రిషిక టీజిఎంఎస్-మానకొండూర్, సురోజుల సాయి అక్షయ్ టీజిఎంఎస్-కరీంనగర్, దురిశేటి అక్షయ్-టీజీ ఎంఎస్-గంగాధర, ఇంటర్‌కు చెందిన జిహర్షిణి, ఎం కీర్తన-ప్రభుత్వ జూనియర్ కళాశాల కరీంనగర్, టి విష్ణువర్ధన్- ప్రభుత్వ జూనియర్ కళాశాల, చొప్పదండి, ఎండి రేహాన్‌అలీ-ప్రభుత్వ జూనియర్ కళాశాల-సైన్స్ వింగ్, కరీంనగర్ ఉన్నారు. ంత్రి శ్రీధర్‌బాబు మున్సిపల్ కార్పొరేషన్‌కు అందజేశారు.