అభివృద్ధి, సంక్షేమానికే పంచాయతీ ఎన్నికల్లో పట్టం
ABN , Publish Date - Dec 20 , 2025 | 12:42 AM
అభివృద్ధి, సంక్షేమానికే పంచా యతీ ఎన్నికల్లో ఓటర్లు పట్టం కట్టారని, మెజార్టీ సర్పంచ స్థానాలు కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.
- మెజార్టీ సర్పంచ స్థానాలు కాంగ్రెస్ కైవసం
- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అభివృద్ధి, సంక్షేమానికే పంచా యతీ ఎన్నికల్లో ఓటర్లు పట్టం కట్టారని, మెజార్టీ సర్పంచ స్థానాలు కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులు కైవసం చేసుకున్నారని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జిల్లా కేంద్రంలోని మెడికల్ కళాశాల గెస్ట్ హౌజ్‌లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్, డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్యలతో కలిసి శుక్రవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ మాట్లా డారు. జిల్లాలోని జగిత్యాల, ధర్మపురి, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ మద్దతు పలికిన అభ్యర్థులు సర్పంచలు విజయం సాధించారని వెల్లడించారు. ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గంలో 140 స్థానాలకు గానూ 104 సర్పంచ స్థానాలు, జగిత్యాల నియోజకవర్గంలో 101 స్థానాలకు గానూ 94 సర్పంచ స్థానాలు, కోరుట్ల అసెంబ్లీ నియోజకవర్గంలో 78 స్థానాలకు గానూ 44 సర్పంచ స్థానాలు కాంగ్రెస్ మద్దతు దారులు గెలుచుకున్నార న్నారు. రానున్న మండల పరిషత, జిల్లా పరిషత, మున్సిపల్ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఇవే ఫలితాలు పునరావృత్తం అవుతాయన్న ధీమాను వ్యక్తం చేశారు. ధర్మపురి నియోజకవర్గంలో ఐటీఐ కళాశాల, డిగ్రీ కళాశాల మంజూరు చేయడం జరిగిందన్నారు. సాధ్యమైనంత తొందరలో పాలిటెక్నిక్ కళాశాల మంజూరు చేయిస్తానన్నారు. పంచాయతీ ఎన్నికల్లో ధర్మపురి నియోజకవర్గంలోని వెల్గటూరు మండలం పైడిపల్లి గ్రామంలో జరిగిన అల్లర్లు, లాఠీచార్జీ, గాలిలోకి కాల్పుల సంఘటనపై విచారణ జరుగుతుందని, దోషులు ఎవరైనా వదిలిపెట్టేది లేదన్నారు.
మాజీ మంత్రి కొప్పుల ఆరోపణలు అర్థరహితం..
మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ చేస్తున్న ఆరోపణలు అర్థరహితమని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. పదేళ్లలో బీఆర్‌ఎస్ చేయని అభివృద్ధిని రెండేళ్లలో కాంగ్రెస్ సర్కారు చేసి చూపిందన్నారు. పదేళ్లలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ధర్మపురి నియోజకవర్గానికి చేసిన అభివృద్ధి శూన్యమన్నారు. ఏది పడితే అది మాట్లాడడం మాజీ మంత్రి కొప్పుల, ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్‌లు మానుకోవాలని హెచ్చరించారు.
కోరుట్ల ఎమ్మెల్యే హుందాగా వ్యవహరించాలి..
కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ హుందాగా వ్యవహరించాలని డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య సూచించారు. ఇటీవల జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్‌పై అనవసర విమర్శలను కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ చేయడం సమంజసం కాదన్నారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ పార్టీ ఫిరాయింపు పాల్పడ్డారని ఆరోపించారని, ఈ వ్యవహారం అసెంబ్లీ స్పీకర్ పరిధిలో పరిశీలనలో ఉందన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకున్న కాంగ్రెస్ కట్టుబడి ఉంటుందని స్పష్టం చేశారు.కోరుట్ల నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల హయాంలో జరిగిన అభివృద్ధి శూన్యమని, మాజీ మంత్రి జువ్వాడి రత్నాకర్ రావు హయాంలో అభివృద్ధి జరిగిందని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.