Share News

సౌకర్యాలు ఉన్నా.. ఆదరణ కరువు

ABN , Publish Date - Apr 30 , 2025 | 12:48 AM

అర్హత కలిగిన ఉపాధ్యాయులు..సొంత భవనాలు..చక్కటి సదుపాయాలు...సాంకేతిక బోధనకు పెద్దపీట...వెరసి ప్రభుత్వ పాఠశాలలు ప్రత్యేకతను చాటుతున్నాయి. కానీ విద్యార్థుల సంఖ్య పరంగా మాత్రం అనేక ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడుతున్నాయి.

సౌకర్యాలు ఉన్నా.. ఆదరణ కరువు

జగిత్యాల, ఏప్రిల్‌ 29 (ఆంధ్రజ్యోతి): అర్హత కలిగిన ఉపాధ్యాయులు..సొంత భవనాలు..చక్కటి సదుపాయాలు...సాంకేతిక బోధనకు పెద్దపీట...వెరసి ప్రభుత్వ పాఠశాలలు ప్రత్యేకతను చాటుతున్నాయి. కానీ విద్యార్థుల సంఖ్య పరంగా మాత్రం అనేక ప్రభుత్వ పాఠశాలలు వెనుకబడుతున్నాయి. గతంతో పోలిస్తే జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుండడం ఆందోళన కలిగిస్తోంది. తల్లిదండ్రుల ఆలోచనా ధోరణిలో కూడా మార్పు రావాల్సి ఉందని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు కృషి చేయాలంటూ రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి యోగితారాణి ఇటీవల ఉపాధ్యాయ సంఘాలకు, ఉపాధ్యాయులకు సూచించడంతో సమష్టిగా పనిచేయాల్సిన ఆవశ్యకత ఉందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

ఫవిద్యార్థుల సంఖ్య పెంచేలా కసరత్తు

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేలా జిల్లా విద్యాశాఖ ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తోంది. మౌలిక సదుపాయాల కల్పన, మధ్యాహ్న భోజనం, ఉచితంగా పాఠ్య పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేస్తున్నా విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలల్లో చేర్పించడానికి మొగ్గు చూపడానికి కారణాలను అన్వేషిస్తున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంపుపై దృష్టి సారించింది. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కళకళలాడేలా చేయడానికి కసరత్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను ఆకట్టుకునేలా వినూత్న శైలిలో బోధన చేయడానికి ప్రాధాన్యం తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుండడం తల్లిదండ్రులకు వివరించే ప్రయత్నాలు చేయడంపై దృష్టి సారించారు.

ఫఇదే అనువైన సమయం..

ప్రస్తుతం వేసవి సెలవులున్నాయి. ఈ సమయంలో ఉపాధ్యాయులు తమ పాఠశాల పరిధిలో కొత్తగా బడుల్లో చేరే పిల్లల వివరాలను ముందుగా సేకరించడంపై దృష్టి సారించారు. తల్లిదండ్రుల ఇంటికి వెళ్లి ప్రభుత్వ బడిలో చేర్పిస్తే కలిగే ప్రయోజనాలను వివరించే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో బోధనా ఫీజులు, పాఠశాల బస్సు చార్జీలు, పుస్తకాలు, ఏడాదికి విద్యార్థికి అయ్యే ఖర్చు తదితర వివరాలు తెలియజేయడంపై పలు పాఠశాలల ఉపాధ్యాయులు దృష్టి సారించారు. ప్రభుత్వ పాఠశాలల్లో లభిస్తున్న సౌకర్యాలు, నాణ్యమైన విద్యా బోధన చేస్తామని ప్రచారం నిర్వహిస్తున్నారు.

ఫప్రత్యేక కార్యాచరణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో పలు పాఠశాలల రూపురేఖలు మారుతున్నాయి. అయినప్పటికీ విద్యార్థుల సంఖ్య ఏ యేటికి ఆ యేడు తగ్గుముఖం పడుతుంది. ప్రతి సంవత్సరం జూన్‌ తొలివారంలో బడిబాట నిర్వహిస్తున్నప్పటికీ కొన్ని చోట్ల మాత్రమే సీట్లు నిండుతుండగా అనేక చోట్ల ఖాళీగా ఉంటున్నాయి. జిల్లా వ్యాప్తంగా 2022-23 విద్యా సంవత్సరంలో 8,670 మంది విద్యార్థులు బడిబాటలో భాగంగా పాఠశాలల్లో చేరారు. 2023-24 విద్యా సంవత్సరంలో 7,908 మంది మాత్రమే చేరారు. 2024-25 విద్యా సంవత్సరంలో సంఖ్య మరింతగా తగ్గి 6,078 మంది విద్యార్థులు బడిబాటలో భాగంగా పాఠశాలల్లో చేరినట్లుగా విద్యాశాఖ రికార్డులు తెలుపుతున్నాయి. ఈ పరిస్థితుల్లో మార్పు తీసుకొస్తూ రానున్న విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచడంపై విద్యాశాఖ కసరత్తులు చేస్తోంది.

ఫజిల్లాలో ప్రభుత్వ పాఠశాలల పరిస్థితి ఇలా..

జిల్లా వ్యాప్తంగా వివిధ 838 ప్రభుత్వ, కేజీబీవీ, జడ్పీ, మినీ గురుకులాలు, టీఎస్‌ మోడల్‌ స్కూల్స్‌, అర్బన్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ తదితర పాఠశాలలున్నాయి. ఇందులో 514 ప్రాథమిక పాఠశాలలు, 91 ప్రాథమికోన్నత పాఠశాలలు, 233 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో 3,568 ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. 1,173 మంది ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు, 454 మంది ప్రాథమికోన్నత పాఠశాల ఉపాధ్యాయులు, 1,706 మంది ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు, 285 కళాశాలలు, ఉన్నత పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులున్నారు. జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 57,771 మంది విద్యార్థులున్నారు. ఇందులో 25,604 మంది ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, 6,438 మంది ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులు, 25,729 మంది ఉన్నత పాఠశాల విద్యార్థులున్నారు.

ఫముందస్తు బడిబాట..

ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా పలు ప్రాంతాల్లో ఉపాధ్యాయులు కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. బడిబాట నిర్వహణపై ప్రభుత్వ ఆదేశాలు రానప్పటికీ పలు పాఠశాలల ఉపాధ్యాయులు ముందుగానే గ్రామాల బాట పట్టారు. ప్రైవేటు పాఠశాలల మాదిరిగా కరపత్రాలు ముద్రించి ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు, విద్యార్థులు అందే సౌకర్యాలను తల్లిదండ్రులకు వివరిస్తూ పిల్లలను చేర్పించాలని కోరుతున్నారు. ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ఉన్న వసతులు, నమోదైన ఫలితాలు ఉదాహరణలతో సహా వివరిస్తున్నారు. మా బడి ఎలా ఉందంటే అంటూ...ప్రభుత్వ పాఠశాలల్లో జరిగే బోధన, సౌకర్యాలు, ఉచిత పుస్తకాలు, ఉచిత యూనిఫాంలు, మధ్యాహ్నా భోజనం, రాగిజావ, స్కాలర్‌ షిప్‌లు అందుతుండడం తదితర వాటిని కరపత్రాల్లో వివరిస్తున్నారు. పలు ప్రభుత్వ పాఠశాలల కరపత్రాలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

సమన్వయంతో కృషి చేస్తున్నాం

-రాము, జిల్లా విద్యాశాఖాధికారి

ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో విద్యార్థుల సంఖ్య పెంచడానికి కృషి చేస్తున్నాం. ప్రస్తుత వేసవి సెలవుల్లో సైతం పలు పాఠశాలల ఉపాధ్యాయులు స్వచ్ఛందంగా బడుల్లో చేరే పిల్లల తల్లిదండ్రులను కలిసి అవగాహన కల్పించే బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పిస్తే నాణ్యమైన విద్యను పొందవచ్చు.

Updated Date - Apr 30 , 2025 | 12:48 AM