Share News

ప్రింటింగ్‌ ప్రెస్‌, వాహనాలకు గిరాకీ

ABN , Publish Date - Dec 10 , 2025 | 12:00 AM

హుజూరాబాద్‌ డివిజన్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ మంగళవారంతో ముగిసింది.

ప్రింటింగ్‌ ప్రెస్‌, వాహనాలకు గిరాకీ

హుజూరాబాద్‌, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): హుజూరాబాద్‌ డివిజన్‌లో గ్రామపంచాయతీ ఎన్నికల నామినేషన్ల ఉపసంహరణ మంగళవారంతో ముగిసింది. బరిలో ఉన్న సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు గుర్తులు కేటాయించడంతో ప్రచారం చేయడానికి ప్రింటింగ్‌ ప్రెస్‌, వాహనదారులకు డిమాండ్‌ పెరిగింది. ఓటర్లను ఆకర్షించుకునేందుకు అభ్యర్థులు రకరకాల పద్ధతులు అవలంబిస్తున్నారు. ఎన్నికల ప్రచారానికి ప్రధానంగా ఆటోలు, మైక్‌లు అమర్చిన మినీ వాహనాలకు విపరీతమైన గిరాకీ పెరిగింది. తమ ప్రచారాన్ని హోరెత్తించడానికి వాహనాలకు రోజు వారీగా అద్దెకు తీసుకుంటున్నారు. సాధారణ రోజుల కంటే ఎన్నికల సమయంలో రోజు వారి కంటే అదనంగా ఆదాయం లభిస్తుంది. వాహనాలకు అమర్చే మైక్‌ సెట్టు ఆపరేటర్లకు గ్రామాల్లోనూ ఉపాధి లభిస్తుంది. అభ్యర్థులకు గుర్తులు కేటాయించడంతో కరపత్రాలు, గోడపత్రికలు, పోస్టర్లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటున్నారు. దీంతో స్థానిక ప్రింటింగ్‌ ప్రెస్‌ వారికి వ్యాపారం జోరందుకుంది. నామినేషన్ల ఘట్టం పూర్తయిన వెంటనే అభ్యర్థులు తమకు కేటాయించిన గుర్తులను కరపత్రాల రూపంలో ఆర్డర్లు ఇస్తున్నారు. దీంతో రాత్రి పగళ్లు ప్రింటింగ్‌ ప్రెస్‌లు పనిచేస్తున్నాయి. అభ్యర్థుల ఫోటోలు, ఎన్నికల గుర్తులతో ఆకర్షిణీయమైన డిజైన్లను చేయడంలో ఇంటర్‌నెట్‌ సెంటర్ల నిర్వాహకులు పని దొరికింది. కొంత మంది అయితే తమ గుర్తులను పాటల రూపంలో రికార్డు చేయించి వాహనాలకు అమర్చుతున్నారు. రికార్డు స్టూడియోల వారికి కూడా ఉపాధి లభిస్తోంది.

Updated Date - Dec 10 , 2025 | 12:00 AM