Share News

చిన్న నీటి వనరుల.. సర్వేపై జాప్యం

ABN , Publish Date - Sep 14 , 2025 | 01:03 AM

గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఉండే చిన్న నీటి వనరులు, ఇతర నీటి వనరుల లభ్యత, తద్వారా ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయో ప్రతి ఐదేళ్ల గురించి చేపట్టే చిన్న నీటి వనరుల సర్వేలో జాప్యం జరుగుతున్నది.

చిన్న నీటి వనరుల.. సర్వేపై జాప్యం

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

గ్రామాలు, పట్టణ ప్రాంతాల్లో ఉండే చిన్న నీటి వనరులు, ఇతర నీటి వనరుల లభ్యత, తద్వారా ఎంత విస్తీర్ణంలో పంటలు సాగవుతున్నాయో ప్రతి ఐదేళ్ల గురించి చేపట్టే చిన్న నీటి వనరుల సర్వేలో జాప్యం జరుగుతున్నది. సర్వే ఆరంభించాలని కేంద్రప్రభుత్వం ముఖ్యప్రణాళిక శాఖాధికారులకు ఆదేశించినప్పటికీ, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది సహకారంతో ఈ సర్వే చేపట్టాల్సి ఉంటుంది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తగిన ఉత్తర్వులు జారీచేయాల్సి ఉండగా, ఇప్పటివరకు జారీ కాలేదు. సర్వే కోసం పంచాయతీ కార్యదర్శిని గానీ, వ్యవసాయ విస్తీర్ణాధికారి గానీ, ఉపాధిహామీ పథకం ఫీల్డ్‌ అసిస్టెంట్లను గానీ వినియోగించుకోవాల్సి ఉంటుంది. ఎవరితో సర్వే చేపట్టాలనే విషయమై ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. దీంతో జిల్లాలో చిన్న నీటి వనరుల సర్వేలో జాప్యం జరుగుతున్నది. మండలాల్లో పనిచేస్తున్న మండలపరిషత్‌ స్టాటిస్టికల్‌ ఆఫీసర్లచే రెండు గ్రామాల్లో సర్వే చేయాలని సీపీవో సూచించారు. ఆ గ్రామంలో ఉండే నీటివనరుల లభ్యత, తద్వారా సాగవుతున్న పంటల వివరాలను సేకరించాలని ఆదేశించారు. ప్రతి ఐదేళ్లకోసారి దేశవ్యాప్తంగా ఉన్న అన్నిగ్రామాల్లో గల చిన్ననీటి వనరులైన చెరువులు, కుంటలు, బావులు, బోరు బావులు, ఎత్తిపోతల పథకాల్లో ఉన్న నీటిలభ్యత, సాగవుతున్న పంటల వివరాల గురించి సర్వేచేస్తారు. ఇప్పటివరకు ఆరుసార్లు సర్వే నిర్వహించగా, ప్రస్తుతం చేపట్టనున్న సర్వే 7వసారి కావడం గమనార్హం. ఈసారి గ్రామాల్లోనే గాకుండా పట్టణాలు, వాటి పరిసరాల్లో ఉండే నీటివనరులపై కూడా సర్వే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ సర్వే ఆధారంగా కేంద్రం ప్రభుత్వం దేశ అవసరాలకు, పంటల అవసరాలకు సరిపడా నీటి లభ్యత ఉందా, లేదా అని పరిశీలించనున్నారు. ఈ సర్వేను అనుసరించి నీటి వనరులను పెంపొందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసి పలు పథకాలను అమల్లోకి తీసుకరానున్నారు.

ఫ ఈసారి యాప్‌ ద్వారా సర్వే..

గ్రామాలు, పట్టణాల్లో గల చిన్న నీటివనరుల ద్వారా నీటిలభ్యత ఎంత ఉంది, వాటికింద ఎన్ని ఎకరాల భూములకు సాగు నీరు అందుతున్నాయి?. సాగు నీటి అవసరాలకే గాకుండా, తాగునీటి అవసరాలకు కూడా సద్వినియోగం అవుతున్నాయా, ఇతరత్రా అవసరాలకు కూడా సద్వినియోగం అవుతున్నాయా?. తదితర అంశాలపై సర్వే చేయనున్నారు. గతంలో మాన్యువల్‌గా కాగితాలపై సర్వే చేయగా, ఈసారి ఈ సర్వే కోసం రూపొందించిన యాప్‌ ద్వారానే సర్వే చేయనున్నారు. చిన్న నీటి వనరుల వద్దకు వెళ్లి సెల్‌ ఫోన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న యాప్‌ ఓపెన్‌ చేసి వివరాలను నమోదు చేయాలి. చెరువులు, కుంటల వద్దకు వెళ్లి అక్షాంశ, రేఖాంశాల ఆధారంగా జియో ట్యాగింగ్‌తో ఫొటోలు తీసి అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. మొదట 100ఎకరాల లోపు ఆయకట్టు గల నీటి వనరులపై సర్వేచేసి, ఆ తర్వాత 100 ఎకరాలకు పైగా ఉన్న వాటి గురించి సర్వే చేయనున్నారు. 250ఎకరాల ఆయకట్టుకు పైబడిన వాటి గురించి వేర్వేరుగా సర్వే నిర్వహించనున్నారు. ఇవేగాకుండా బిందు, తుంపర సేద్యంలో నీటి లభ్యత, నిల్వ సామర్థ్యం, విద్యుత్‌ వాడకం, పంటల వివరాలను కూడా సేకరించాల్సి ఉంటుంది. వ్యవసాయ శాఖ అధికారుల లెక్కల ప్రకారం జిల్లాలో 1090చెరువులు, కుంటలు ఉన్నాయి. 24,172వ్యవసాయ బోర్‌వెల్స్‌, 43,049 వ్యవసాయ బావులు ఉన్నాయి. వీటిద్వారా 1,51,854ఎకరాల ఆయకట్టు భూములు ఉన్నాయి. గ్రామాల్లో చిన్నచిన్న కుంటలు కబ్జాకు గురై కనుమరుగయ్యాయి. కాగితాల్లో ఉన్న లెక్కల ప్రకారం క్షేత్ర స్థాయిలో నీటి వనరులు కనబడడం లేదు. ఈ సర్వే ద్వారా జిల్లాలో సజీవంగా ఎన్ని చెరువులు, కుంటలు ఉన్నాయో తెలియనున్నది. ఈసారి సర్వే వివరాలను యాప్‌లో ఆన్‌లైన్‌లో నమోదు చేస్తుండడంతో పక్కాగా జరగనున్నది. సర్వేద్వారా వెల్లడయ్యే వివరాలప్రకారం చిన్ననీటి వనరులను కాపాడుకునేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించనున్నది. ఈసర్వే ఒక్కకేంద్ర ప్రభుత్వానికే గాకుండా, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా ఉపయోగపడనున్నది. ఈ విషయమై ‘ఆంధ్రజ్యోతి’ ఫోన్‌లో సీపీవో గంప రవీందర్‌ను సంప్రదించగా చిన్న నీటి వనరుల సర్వే ప్రస్తుతం ఎంపీఎస్‌వోల ద్వారా మండలానికి రెండు గ్రామాల్లో చేయాలని నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత ఆయా శాఖల సిబ్బందితో కలిపి అన్ని గ్రామాలు, పట్టణాల్లో సర్వే చేస్తామని చెప్పారు.

Updated Date - Sep 14 , 2025 | 01:03 AM