Share News

విపత్తు సమయంలో ‘ఆపద మిత్ర’లు ముందుండాలి

ABN , Publish Date - Jul 04 , 2025 | 12:31 AM

ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దుర్ఘటన సమయంలో ప్రజలను రక్షించేందుకు ‘ఆపద మిత్ర’ వలంటీర్లు ముందుండాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు.

విపత్తు సమయంలో ‘ఆపద మిత్ర’లు ముందుండాలి
విద్యార్థులనుద్దేశించి మట్లాడుతున్న కలెక్టర్‌ పమేలా సత్పతి

- కలెక్టర్‌ పమేలా సత్పతి

కరీంనగర్‌ క్రైం, జూలై 3 (ఆంధ్రజ్యోతి): ప్రకృతి వైపరీత్యాలు, ప్రమాదాలు, దుర్ఘటన సమయంలో ప్రజలను రక్షించేందుకు ‘ఆపద మిత్ర’ వలంటీర్లు ముందుండాలని కలెక్టర్‌ పమేలా సత్పతి అన్నారు. రెవెన్యూ శాఖ విపత్తుల నిర్వహణ విభాగం ఆధ్వర్యంలో జిల్లాలోని 120 మంది డిగ్రీ విద్యార్థులు, ఎన్‌సీసీ వలంటీర్లకు 12 రోజులపాటు ఇవ్వనున్న ఆపదమిత్ర శిక్షణను గురువారం బీసీ స్టడీ సర్కిల్‌లో కలెక్టర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ పమేలా సత్పతి మాట్లాడుతూ మొదటి విడతలో గ్రామాల్లో, పట్టణాల్లో పనిచేసే ప్రభుత్వ రంగ ఉద్యోగులతో పాటు స్వచ్ఛందంగా ముందుకు వచ్చిన వలంటీర్లకు ఆపద మిత్ర శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. రెండో విడతలో డిగ్రీ కళాశాల స్థాయి, ఎన్‌సీసీ విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నామన్నారు. ఆపదమిత్ర శిక్షణలో భాగంగా పలు అధికారుల ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తామని కలెక్టర్‌ తెలిపారు. కార్యక్రమంలో డీఆర్వో వెంకటేశ్వర్లు, జిల్లా అగ్నిమాపక అధికారి ఎం శ్రీనివాసరెడ్డి, బీసీ సంక్షేమ అధికారి అనిల్‌ ప్రకాష్‌ పాల్గొన్నారు.

టీబీ ముక్త్‌ భారత్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో..

కరీంనగర్‌ (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): టీబీ ముక్త్‌ భారత్‌ కార్యక్రమంపై కేంద్ర ప్రభుత్వ టీబీ విభాగం అధికారులు ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్‌ పమేలా సత్పతి, డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ, జిల్లా క్షయ నివారణ అధికారి డాక్టర్‌ రవీందర్‌రెడ్డి వీడియో కాన్ఫరెన్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ టీబీ ముక్త్‌ భారత్‌లో భాగంగా జిల్లాలో నిర్దేశించిన లక్ష్యం కంటే ఎక్కువగా 108 శాతం క్షయ నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు. రెండో దశలో క్షయ నిర్ధారణ పరీక్షలు వేగవంతం చేశామన్నారు. ప్రతిమ వైద్య కళాశాల వారి సహకారంతో మొబైల్‌ ఎక్స్‌రే వాహనం ఏర్పాటు చేసి టీబీ వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Updated Date - Jul 04 , 2025 | 12:31 AM