దండాలయ్యా.. ఉండ్రాలయ్యా
ABN , Publish Date - Aug 27 , 2025 | 01:09 AM
జిల్లాలో బుధవారం నుంచి వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
జగిత్యాల, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో బుధవారం నుంచి వినాయక నవరాత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. రంగు రంగుల అలంకరణతో మండలపాలను ముస్తాబు చేయగా విద్యుత్ కాంతులతో మెరిసిపోతున్నాయి. జిల్లాలోని ప్రధాన పట్టణాలయిన జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, రాయికల్, ధర్మపురిలతో పాటు పలు మండల కేంద్రాలు, గ్రామాల్లో పలు స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, యువజన సంఘాలు వినాయక ఉత్సవాలను వైభవంగా జరుపుకోవడానికి అవసరమైన ఏర్పాట్లు చేశాయి.
జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యికిపైగా వినాయక మండపాలను ఏర్పాటు చేస్తున్నారు. జిల్లాలోని కోరుట్ల విగ్రహాల తయారీ, విక్రయాలకు ప్రసిద్ధి గాంచింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కోరుట్లకు వచ్చి విగ్రహాలను కొనుగోలు చేసి తీసుకువెళ్తున్నారు. వినాయక మండపాల నిర్వహణ కోసం పోలీసు శాఖ ప్రత్యేక పోర్టల్‌ను రూపొందించింది. తమ వివరాలను సంబంధిత పోర్టల్‌లో నిర్వాహకులు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతీ మండపాన్ని జియో ట్యాగింగ్ చేస్తున్నారు. నవరాత్రోత్సోవాల్లో మండపాల నిర్వాహకులు పాటించిన అంశాలపై పోలీసులు విస్తృత ప్రచారం చేస్తున్నారు. అన్ని ప్రాంతాల్లో పోలీసులు శాంతి కమిటీ సమావేశాలను నిర్వహించి పలు సూచనలు ఇచ్చారు.
ఫపెరిగిన విగ్రహాల ధరలు
జిల్లాలో ఒక్కో వినాయక విగ్రహం రూ.500 నుంచి రూ.50 వేల వరకు సైజులను బట్టి విక్రయిస్తున్నారు. అన్నింటి పైనా గత యేడాది కంటే సుమారు పాతిక శాతం ధరలు పెరిగాయి. వివిధ ఆకారాల్లో రంగు రంగుల ఎత్తయిన విగ్రహాలు అందుబాటులో ఉన్నాయి. గత యేడాది రూ.25 వేలకు లభించిన విగ్రహం ప్రస్తుత సీజన్‌లో రూ. 32 వేల వరకు పలుకుతోంది. దీంతో మండపాల నిర్వాహకులపై అదనపు భారం పడుతోంది. జిల్లాలోని పలు చోట్ల అర ఫిట్ విగ్రహం నుంచి 15 ఫిట్ల వరకు ఎత్తయిన భారీ విగ్రహాలు లభిస్తున్నాయి. దీనికి తోడు పూజా సామగ్రి ధరలు, మైక్ సెట్ సామాగ్రి, మండపానికి వినియోగించే వస్తువుల అద్దెలు పెరిగాయి.
ఫనవరాత్రోత్సవాలకు రాజకీయ రంగు..
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పలువురు ఆశావహులు గణేష్ నవరాత్రి ఉత్సవాలతో ఓటర్లకు చేరువయ్యేందుకు యత్నిస్తున్నారు. పలు కాలనీల్లో సొంతంగా వినాయక విగ్రహాలను కొనుగోలు చేసి ఇస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీల్లోని ఆశావహులు, నాయకులు వినాయకుడి ఆశీస్సులతో తమ లక్ష్య సాధన వైపు అడుగులు వేయాలని ప్రయత్నిస్తున్నారు. రానున్న ఎన్నికల్లో సత్తా చాటేందుకు పలు పార్టీల్లోని ఆశావహులు ఉవ్విళ్లూరుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో తమ అనుచరుల ద్వారా మండపాలు ఏర్పాటు చేయిస్తుండగా, మరికొన్ని చోట్ల నిర్వాహకులకు అండగా నిలుస్తున్నారు. మండపాలు ఏర్పాటు చేయించడం, చందాలు ఇవ్వడం, ఉత్సవ నిర్వహణకు తమ వంతు ఏదో ఒక రకంగా సహకరించడం వంటివి చేస్తున్నారు.
ఫమట్టి గణపతులపై అవగాహన కార్యక్రమాలు..
జిల్లాలో పర్యావరణహిత గణపతి విగ్రహాలను ప్రతిష్టించడానికి అటు అధికారులు, ఇటు స్వచ్ఛంద సంస్థలు, యువజన సంఘాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ప్రజలకు ఇబ్బందులు కలిగించే పీవోపీ విగ్రహాల స్థానంలో మట్టి విగ్రహాలను ప్రతిష్టించి పూజించాలని సూచిస్తున్నారు. పలువురు స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు, అధికారులు, రాజకీయ నాయకులు భారీ మొత్తంలో మట్టి విగ్రహాలను పంపిణీ చేస్తున్నారు.
ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలి
-అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి
జిల్లాలో గణేష్ ఉత్సవాలను భక్తి శ్రద్ధలతో శాంతియుతంగా జరుపుకోవాలి. ప్రతీ మండప నిర్వాహకులు నిబంధనలు పాటించాలి. మండపాల వద్ద ఎటువంటి సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా ఉత్సవాలు నిర్వహించాలి. పోలీసులు, అధికారులకు భక్తులు సహకరించాలి.
మట్టి వినాయక ప్రతిమలను పూజించాలి
-సంజయ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే
పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక ప్రతిమలను పూజించాలి. మండపాల నిర్వాహకులు నిబంధలను కచ్చితంగా పాటించాలి. వినాయక విగ్రహాల ప్రతిష్ట మొదలుకొని నిమజ్జనోత్సవం పూర్తయ్యే వరకు నిర్వాహకులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలి.