Share News

‘ఉపాధి’లో కోత

ABN , Publish Date - Apr 26 , 2025 | 12:59 AM

మహాత్మాగాంఽధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ఉపాధి పొందుతున్న కూలీలకు ఇక సరిపడా పనులు దొరకవు. ప్రతి ఏటా ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించే పనిదినాలను సగానికి కుదించడం కూలీలకు శరాఘాతంగా మారింది.

‘ఉపాధి’లో కోత

- జిల్లాకు 13.99 లక్షల పనిదినాలే కేటాయించిన కేంద్రం

- ప్రతీఏటా 22 నుంచి 26 లక్షల పనిదినాల లక్ష్యం

- ఆందోళన చెందుతున్న ఉపాధిహామీ కూలీలు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

మహాత్మాగాంఽధీ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా ఉపాధి పొందుతున్న కూలీలకు ఇక సరిపడా పనులు దొరకవు. ప్రతి ఏటా ఆయా రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించే పనిదినాలను సగానికి కుదించడం కూలీలకు శరాఘాతంగా మారింది. రాష్ట్రానికి 12 కోట్ల పనిదినాలకు బదులు 6.5 కోట్ల పని దినాలను కేటాయింది. జిల్లాకు 13.99 లక్షల పని దినాలను కేటాయించారు. దీంతో ఉపాధిహామీ కూలీలకు చేతి నిండా పనిదొరికే పరిస్థితి లేదు. గ్రామీణ ప్రాంతాలకు చెందిన వ్యవసాయ కూలీలు, ఇతరులు ఉపాధిలేక ఇతర ప్రాంతాలకు వలస పోకుండా ఉండేందుకు గాను 2005లో అప్పటి యూపీఏ ప్రభుత్వం గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకువచ్చి చట్టబద్ధత కల్పించింది. ఈ పథకం ద్వారా ప్రతి ఏటా జాబ్‌ కార్డులు కలిగిన కుటుంబాలకు 100 పనిదినాలు కల్పించాలని లక్ష్యం విధించారు. ఈ పథకం కింద కేంద్రప్రభుత్వమే నిధులను కేటాయిస్తుంది. కేటాయించిన నిధుల్లో 60 శాతం నిధులను కూలీల కోసం, 40 శాతం నిధులను మెటీరియల్‌ కాంపొనెంట్‌ పనులకు వెచ్చించాలని చట్టంలో పేర్కొన్నారు. ఏడాదికి సరిపడా ఉపాధి పనులను గుర్తించేందుకు ప్రతి ఏటా నవంబరు, డిసెంబరు నెలలో పనులను గుర్తిస్తారు. కేంద్ర ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు కేటాయించే పని దినాలు, బడ్జెట్‌ను, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాలకు కేటాయిస్తుంది.

1.19లక్షల కుటుంబాలకు జాబ్‌ కార్డులు..

జిల్లాలో 1.19 లక్షల కుటుంబాలకు జాబ్‌ కార్డులను జారీ చేయగా, వీటిలో 2.44 లక్షల మంది కూలీలు నమోదై ఉన్నారు. ప్రతి ఏటా పెద్దపల్లి జిల్లాకు 20 నుంచి 27 లక్షల వరకు పనిదినాలను లక్ష్యంగా విధిస్తున్నది. ఒక్కో ఏడాది కేటాయించిన పనిదినాలు పూర్తికాకపోగా, మరొక ఏడాది కేటాయించిన పని దినాలు పూర్తయితే, అదనపు పనిదినాలను కల్పించారు. ప్రతి ఏటా కేటాయిస్తున్న పనిదినాల్లో ఈ ఏడాది 40 నుంచి 45 శాతం పనిదినాల్లో కోత విధించడంతో ఉపాధిహామీ కూలీలు లబోదిబోమంటున్నారు. కేవలం 13.99 పనిదినాలను మాత్రమే కేటాయించడం గమనార్హం. గత ఐదేళ్లలో చేపట్టిన పనిదినాలతో పోలిస్తే ఈ ఏడాది కేటాయించిన పనిదినాలు చాలా తక్కువ. 2020-21లో 27.43 లక్షల పని దినాలను కూలీలు సద్వినియోగం చేసుకున్నారు. 2021-22లో 25.60 లక్షల పనిదినాలు, 2022-23లో 23.27 లక్షల పనిదినాలు, 2023-24లో 20.61 లక్షల పనిదినాలు, 2024-25లో 25.55 లక్షల పని దినాలను ఉపాధి హామీ కూలీలు పనిదినాలను సద్వినియోగం చేసుకున్నారు. పనిదినాలను తగ్గించడంపై ఉపాధి కూలీలు మండిపడుతున్నారు.

గ్రామాల్లో తగ్గనున్న అభివృద్ధి పనులు..

కేంద్ర ప్రభుత్వం ఉపాధిహామీ కూలీల పని దినాల్లో కోత విధించడంతో గ్రామాల్లో అభివృద్ధి పనులు తగ్గనున్నాయి. కూలీలకు ఎన్నిపనులు కల్పిస్తే అందులో 40 శాతం నిధులను శాశ్వత నిర్మాణ పనులకు ఉపయోగించుకుంటున్నారు. గ్రామాల్లో మౌలికవసతులు కల్పించేందుకుగాను కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా నిధులను కేటాయిస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం ఎస్‌ఎఫ్‌సీ ద్వారా నిధులకు కేటాయిస్తున్నది. వీటికి తోడు ఉపాధిహామీ నిధులు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. ఈ నిధులతో గ్రామాల్లో సిమెంట్‌ రోడ్లు, మురికి కాలువల నిర్మాణాలు, స్వశక్తి సంఘాల భవనాల నిర్మాణాలు, రైతు వేదికలు, అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీల భవనాలు, తదితర పనులను ఉపాధి హామీ నిధులతోనే చేపడుతున్నారు. ప్రతి ఏటా జిల్లాకు ఉపాధి పనుల ద్వారా 20 నుంచి 25 కోట్ల రూపాయల నిధులను మెటీరియల్‌ కంపోనెంట్‌ పనులకు వినియోగించుకుంటున్నారు. కానీ కేంద్రప్రభుత్వం పని దినాలను తగ్గించడం వల్ల గ్రామాల్లో అభివృద్ధి పనులు చేయలేని పరిస్థితి నెలకొననున్నది.

Updated Date - Apr 26 , 2025 | 12:59 AM