Share News

సాగు ప్రణాళిక ఖరారు

ABN , Publish Date - May 02 , 2025 | 01:11 AM

యాసంగి సీజన్‌ ముగిసింది.

సాగు ప్రణాళిక ఖరారు

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి)

యాసంగి సీజన్‌ ముగిసింది. వానాకాలం పంటల సీజన్‌ ప్రారంభం అవుతున్నది. ఈ నేపథ్యంలో జిల్లాలో ఎంత విస్తీర్ణంలో ఏఏ రకాల పంటలను సాగు చేయనున్నారు.. ఆ పంటలకు ఎంత ఎరువులు అవసరం కానున్నాయి.. విత్తనాలు ఎన్ని కావాలి అనే విషయమై జిల్లా వ్యవసాయ శాఖాధికారులు సాగు ప్రణాళిక రూపొందించేందుకు కసరత్తు చేశారు. ఈ నెల 25వ తేదీ నుంచి రోహిణి కార్తె ఆగమనంతో వానాకాలం సీజన్‌ ఆరంభం కానున్నది. ఈ మేరకు 25 రోజుల ముందే సాగు ప్రణాళికను సిద్ధం చేశారు. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి, వ్యవసాయ బావులు, బోరు బావులు, చెరువులు, కుంటల కింద 2,76,076 ఎకరాల్లో వివిధ రకాల పంటలను రైతులు సాగు చేయనున్నారని అంచనా వేశారు. వానాకాలంలో 2,72,678 ఎకరాల్లో సాగు కాగా, ఈ ఏడాది అదనంగా 3,368 ఎకరాల్లో సాగు పెరగనున్నట్లు అధికారులు అంచనా వేశారు. జిల్లాలో అత్యధికంగా వరి, పత్తి, మొక్కజొన్న పంటలనే సాగు చేస్తున్నారు. వానాకాలంలో 2,12,500 ఎకరాల్లో వరి, 705 ఎకరాల్లో మొక్కజొన్న, ఐదెకరాల్లో పెసర, ఐదెకరాల్లో మినుము, 250 ఎకరాల్లో కంది, పదెకరాల్లో వేరుశెనగ, ఐదు ఎకరాల్లో నువ్వులు, 52,500 ఎకరాల్లో పత్తి, 10,086 ఎకరాల్లో మిర్చి, పసుపు, ఆయిల్‌ పామ్‌, కూరగాయల పంటలు సాగు కానున్నాయని అధికారులు అంచనా వేశారు. ఈ పంటల సాగుకు గాను 32,447 మెట్రిక్‌ టన్నుల యూరియా, 7,900 టన్నుల డీఏపీ, 23,453 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు, 6,331 పొటాష్‌ ఎరువులు, 600 టన్నుల సూపర్‌ సల్ఫేట్‌ ఎరువులు, మొత్తం 70,731 టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరం అవుతాయని పేర్కొన్నారు. ప్రస్తుతం మార్క్‌ఫెడ్‌ వద్ద 9,663 టన్నుల ఎరువులు, ప్రైవేట్‌లో 8,478 టన్నులు, ఆయా సొసైటీల్లో 571 టన్నులు, వివిధ కంపెనీల గోడౌన్లలో 2,926 టన్నులు, మొత్తం 21,638 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయి. వరి విత్తనాలు 53,125 క్వింటాళ్లు, పత్తి 1,31,250 ప్యాకెట్లు, మొక్కజొన్న 70.5 క్వింటాళ్లు, కంది 10 క్వింటాళ్లు, ఇతర పప్పు దినుసులు 1.6 క్వింటాళ్ల విత్తనాలు అవసరం ఉంటాయని వ్యవసాయ శాఖాధికారులు అంచనా వేశారు. ప్రస్తుతానికి జిల్లాలో అన్ని రకాల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయ శాఖాధికారి దోమ ఆదిరెడ్డి తెలిపారు.

- సాగు పనుల్లో నిమగ్నం అవుతున్న రైతులు..

యాసంగి వరి కోతలు పూర్తి కావడంతో కొంత మంది రైతులు ధాన్యాన్ని విక్రయించుకోగా, మరికొంత మంది రైతులు కల్లాల్లో, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం కుప్పలు పోశారు. మిగతా రైతులు వేసవి దుక్కుల పనులు చేపడుతున్నారు. వర్షాధారంగా సాగయ్యే పత్తి, మొక్కజొన్న, నువ్వులు, పెసర, బబ్బెర, తదితర పంటలను సాగు చేసేందుకు గాను వేసవి దుక్కులు దున్ని భూములను చదును చేస్తున్నారు. ట్రాక్టర్లతో దుక్కులను దున్నుతున్నారు. జూన్‌లో కురిసే తొలకరి జల్లులకు మరొకసారి దుక్కి దున్ని అచ్చు కొట్టి విత్తనాలు వేయనున్నారు. వరి కోతలు పూర్తి చేసిన రైతులు పొలాల్లో పెద్దగా ఉన్నటువంటి వరి కొయ్యలను కాలుస్తున్నారు. మృగశిర కార్తెలో గానీ, అరుద్ర కార్తెలో గాని వరి నార్లు పోసేందుకు రైతులు విత్తనాలు సేకరిస్తున్నారు. ఈసారి ముందస్తుగానే నైరుతి రుతు పవనాలు వస్తాయని, వర్షాలు బాగానే పడతాయని వాతావరణ కేంద్రం నిపుణులు చెబుతున్నారు. గత ఏడాది ఆశించిన మేరకు వర్షాలు పడడంతో రెండు సీజన్లలో పంటలు సాగయ్యాయి. శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులు నిండాయి. ఈసారి కూడా భారీ వర్షాలు కురిస్తే అవి నిండనున్నాయి. ఈ ఏడాది కూడా కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి ఎత్తిపోతలకు అవకాశం లేదు.

- అందుబాటులో 30 క్వింటాళ్ల పెసర విత్తనాలు..

వానాకాలం సీజన్‌కు ముందు పెసర పంట సాగు చేసేందుకు వీలుగా 30 క్వింటాళ్ల ఐపీఎం-410-3 (శిఖా) రకం విత్తనాలను అందుబాటులో ఉంచామని జిల్లా వ్యవసాయ శాఖాధికారి ఆదిరెడ్డి తెలిపారు. ఈ విత్తనాన్ని 2016లో భారత పప్పు దినుసుల పరిశోధన సంస్థ- కాన్పూర్‌ విడుదల చేసిందన్నారు. దీని పంట కాలం 65 నుంచి 70 రోజులని, ఎకరానికి 8 నుంచి 10 క్వింటాళ్ల దిగుబడి వస్తుందని పేర్కొన్నారు. ఈ రకం విత్తనం వేసవి కాలంలో వేసేందుకు అనుకూలంగా ఉంటుందన్నారు. పెద్దపల్లి డీసీఎంఎస్‌లో 12 క్వింటాళ్లు, సుల్తానాబాద్‌ సింగిల్‌విండోలో ఐదు క్వింటాళ్లు, ఏఆర్‌ఎస్‌కే రామగిరిలో మూడు క్వింటాళ్లు, ఏఆర్‌ఎస్‌కే అడవి సోమన్‌పల్లిలో ఆరు క్వింటాళ్లు, కాల్వశ్రీరాంపూర్‌ సింగిల్‌ విండోలో రెండు క్వింటాళ్లు, నంది మేడారం సింగిల్‌ విండోలో రెండు క్వింటాళ్ల విత్తనాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఎకరానికి ఎనిమిది కిలోల విత్తనాలు అవసరముంటాయని, కిలో విత్తనం ధర 148 రూపాయలు, నాలుగు కిలోల విత్తనాల సంచి 592 రూపాయలకు విక్రయించనున్నారని తెలిపారు. అవసరమున్న రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Updated Date - May 02 , 2025 | 01:11 AM