ఆశల సాగు..
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:05 AM
జిల్లాలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సాగుపై ఆశలు నింపాయి.
జగిత్యాల, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇటీవల ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సాగుపై ఆశలు నింపాయి. రెండు, మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటలు నిండుతున్నాయి. పలుచోట్ల చెరువులు మత్తడి దూకుతున్నాయి. గోదావరి, వాగులు ఉధృతంగా పారుతున్నాయి. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తడంతో నీటి నిల్వ 60 టీఎంసీలు దాటింది. జిల్లాలో వానాకాలం సీజన్‌లో ఇప్పటి వరకు సుమారు 3.5 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. సగం చెరువులు నిండే స్థాయికి చేరుకోవడంతో సాగు, తాగు నీటికి ఢోకా లేని పరిస్థితి ఏర్పడింది. మరోవైపు భూగర్భ జలాల పెరుగుదలకు వర్షాలు దోహదపడుతున్నాయి. జిల్లాకు ఇంకా వర్ష సూచన ఉన్నందున ప్రజలు వరద ప్రవహించే ప్రాంతాలతో పాటు వాగులు, గోదావరి వద్దకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో సహాయక చర్యలు అందించడానికి కలెక్టర్ సత్యప్రసాద్, ఎస్పీ అశోక్ కుమార్‌ల నేతృత్వంలో రెవెన్యూ, పోలీసు అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు.
ఫసాగుకు ప్రాణం పోసిన వర్షాలు
మొన్నటి వరకు వర్షాభావ పరిస్థితులు ఏర్పడడంతో నీటి వనరులు, చెరువులు, కుంటలు బోసిపోతూ కనిపించాయి. వరి నార్లు ముదిరి అన్నదాతకు ఈ సీజన్ కష్టాలు తెచ్చి పెడుతున్న క్రమంలో వరుణుడు కరుణించాడు. జిల్లాలో రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. బోరు బావుల ఆధారంగా వరినారు వేసుకున్న పలువురు రైతులు ప్రస్తుతం వరినాట్లు పూర్తి చేశారు. మొక్కజొన్న, పత్తి, పసుపు, పప్పు ధాన్యాలు, ఇతర ఆరుతడి పంటలకు ఈ వర్షం ఎంతో మేలు చేసింది. చెరువుల్లోకి నీరు వచ్చి చేరుతుండడంతో వీటి కింద వరి పంట సాగు పనులు మరింత పెంచేందుకు అన్నదాతలు సన్నద్ధమవుతున్నారు.
ఫతీరిన వర్షం లోటు
జిల్లాలో ఆగస్టులో ఆశించిన స్థాయిలో వర్షాలు కురుస్తున్నాయి. జూన్, జూలై మాసాలతో పాటు ఆగస్టు మొదటి, రెండవ వారంలో లోటు వర్షాపాతం ఉన్నప్పటికీ ఇటీవల కురిసిన వర్షాల వల్ల లోటు తీరినట్లయింది. ఆగస్టులో ఇప్పటి వరకు జిల్లాలో సగటున 132.7 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 152 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్, సారంగాపూర్, ధర్మపురి, బుగ్గారం, వెల్గటూరు మండలాల్లో సాధారణం కంటే అధికంగా వర్షం కురిసింది. బీర్‌పూర్, జగిత్యాల రూరల్, జగిత్యాల, మేడిపల్లి, కోరుట్ల, మెట్‌పల్లి, కథలాపూర్, కొడిమ్యాల, మల్యాల, ఎండపల్లి, భీమారం మండలాల్లో సాధారణ వర్షాపాతం నమోదైంది. పెగడపల్లి, గొల్లపల్లి మండలాల్లో మాత్రమే లోటు వర్షం కురిసింది. పెగడపల్లిలో 118.3 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా 85.2 మిల్లీ మీటర్లు కురవగా, గొల్లపల్లిలో 122.9 మిల్లీ మీటర్లు కురవాల్సి ఉండగా 73.1 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో అత్యధికంగా ఈనెల 16న 30.9 మిల్లీమీటర్ల వర్షం కురిసింది.
ఫపెరుగుతున్న గోదావరి ప్రవాహం
ధర్మపురి లక్ష్మీ నృసింహస్వామి దేవస్థానం వద్ద, వెల్గటూరు మండలం కోటిలింగాల వద్ద గోదావరిలోకి వరద నీరు చేరి నీటి మట్టం పెరుగుతోంది. కడెం ప్రాజెక్టు గేట్లు ఎత్తి వేసి నీటిని దిగువవకు వదులుతుండడంతో గోదావరి ఉధృతి పెరిగి వరద నీరు పుష్కర స్నాన ఘట్టాలను ఆనుకొని ప్రవహిస్తోంది. జిల్లాలోని ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, రాయికల్, బుగ్గారం తదితర మండలాల్లో సైతం గోదావరి ప్రవాహం పెరిగింది.
ఫనిండిన చెరువులు
జిల్లాలో అధిక శాతం చెరువులు, కుంటలు నీటితో నిండి కళకళలాడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,072 చెరువులున్నాయి. ఇందులో వంద ఎకరాల పైన ఆయకట్టు ఉన్న చెరువులు 153, వంద ఎకరాల లోపు ఆయకట్టు ఉన్న చెరువులు 919 ఉన్నాయి. జిల్లాలోని 220 చెరువుల వద్ద వరద నీరు మత్తడి దూకి ప్రవహిస్తోంది. 75 శాతం నుంచి 100 శాతం వరకు 227 చెరువులు, 50 నుంచి 75 శాతం వరకు 153 చెరువులు, 25 నుంచి 50 శాతం వరకు 202 చెరువులు, 0 నుంచి 25 శాతం వరకు 270 చెరువులలో వరద నీరు వచ్చి చేరింది.
ఫలోతట్టు ప్రాంతాల్లో కలెక్టర్ పర్యటన
జిల్లాలో కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కలెక్టర్ సత్యప్రసాద్‌తో పాటు జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్‌డీవోలు లోతట్టు ప్రాంతాల్లో ఇటీవల పర్యటించారు. ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, ధర్మపురి తదితర ప్రాంతాల్లో గల గోదావరి నదిని కలెక్టర్ సత్యప్రసాద్ సందర్శించి పెరుగుతున్న వరద ప్రవాహాన్ని పరిశీలించారు. పలు ప్రాంతాల్లో నీట మునిగిన లో లెవల్ వంతెనలు, పొంగిన చెరువుల పరిస్థితిని ప్రత్యక్షంగా పరిశీలించి ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎప్పటికప్పుడు అధికారులతో కలెక్టర్ సమీక్షలు నిర్వహిస్తూ భారీ వర్షాల వల్ల నష్టం జరగకుండా ముందస్తుగా అధికారులు, ఉద్యోగులకు దిశానిర్దేశం చేశారు.