Share News

జోరుగా క్రిప్టోకరెన్సీ దందా

ABN , Publish Date - Aug 31 , 2025 | 01:08 AM

మెటా ఫండ్‌, నెక్స్ట్‌ బిట్‌, జీబీఆర్‌ క్రిప్టో, రెక్సిట్‌, బిట్‌కాయిన్‌, మరికొన్ని పేర్లతో ఆన్‌లైన్‌ చెయిన్‌ సిస్టం బిజినెస్‌ జిల్లాలో జోరుగా నడుస్తోంది.

జోరుగా క్రిప్టోకరెన్సీ దందా

కరీంనగర్‌ క్రైం, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): మెటా ఫండ్‌, నెక్స్ట్‌ బిట్‌, జీబీఆర్‌ క్రిప్టో, రెక్సిట్‌, బిట్‌కాయిన్‌, మరికొన్ని పేర్లతో ఆన్‌లైన్‌ చెయిన్‌ సిస్టం బిజినెస్‌ జిల్లాలో జోరుగా నడుస్తోంది. 50 లక్షల రూపాయల పెట్టుబడి పెడితే 10 నెలల్లో మూడు రెట్ల డబ్బులు వస్తాయని కొందరు నమ్మబలికి ఈ ఆన్‌లైన్‌ చెయిన్‌సిస్టం బిజినెస్‌లోకి లాగుతున్నారు. తక్కువ కాలంలో రెట్టింపు, మూడు రెట్లు డబ్బు వస్తుందనే ఆశతో చాలా మంది వ్యాపారులు మొదలుకొని సామాన్యుల వరకు అప్పు తెచ్చిమరీ ఈ బిజినెస్‌లో పెట్టుబడులుగా పెట్టి మోసపోతున్నారు. ఈ ఆన్‌లైన్‌ చెయిన్‌ సిస్టంలో జిల్లా నుంచి వందలాది మంది 400 నుంచి 500 కోట్ల వరకు పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. ఎక్కడ కూడా గ్యారంటీ లేకుండా మొత్తం వ్యాపారం ఆన్‌లైన్‌లోనే నడుస్తుంది. ఆన్‌లైన్‌లో కొన్ని కంపెనీల్లో వారి ఖాతాలకు పెట్టుబడుల డబ్బులను జమ చేస్తున్నారు. పెట్టుబడులు పెట్టిన వారికి ఆయా కంపెనీటు, ఏజెంట్లు ఒక యాప్‌ ద్వారా ఐడీని ఇస్తున్నారు. ఐడీ ద్వారా ఆ యాప్‌లోకి ఎంటర్‌ అయి ఎప్పటికప్పుడు బిజినెస్‌ను పరిశీలించవచ్చు. ఈ ఐడీ ద్వారానే వారి కంపనీ ప్రొడక్ట్‌లు ఆన్‌లైన్‌లోనే అమ్ముకునేందుకు వీలుంటుంది. కొన్ని కంపెనీలు ఆన్‌లైన్‌ ద్వారా కస్టమర్ల ఖాతాలకు డబ్బులు జమ చేస్తుండగా మరికొన్ని కంపెనీలు హవాలా ద్వారా డబ్బులు ముట్టజెబుతున్నట్లు తెలుస్తోంది. ఈ దందాలో 20 వేలపైగా కంపెనీలు ఉన్నట్లు చెబుతున్నారు.

ఫ మొదట్లో లాభాలు.. తరువాత షరతులు

పేరు ఏదయినప్పటికీ ఆన్‌లైన్‌ చైన్‌ దందాలన్నీ ఒకేలా పనిచేస్తున్నాయి. మొదట్లో అద్భుతమైన లాభాలు చూపుతున్నాయి. ఆ తరువాత మరో అయిదుగురిని నీ కిందచెయిన్‌గా చేర్పిస్తేనే నీకు లాభాలు వస్తాయని షరతులు పెడుతాయి. అధిక లాభాలు వస్తాయనే అత్యాశకుపోయి లక్షల్లో పెట్టిన పెట్టుబడినవారు భారీగా నష్టపోతున్నారు. ఇందులో అధికశాతం మధ్య తరగతి కుటుంబాలవారే ఉండడం గమనార్హం.

ఫ సెక్యూరిటీతో కూడా అవకాశం.....

ఈ ఆన్‌లైన్‌ క్రిప్టో కరెన్సీ వ్యాపారంలో ఎక్కడా.. ఎవరూ సెక్యూరిటీగా ఉండరు. ఈ ఆన్‌లైన్‌ చెయిన్‌ సిస్టం బిజినెస్‌లన్ని ఇతర దేశాల నుంచి నడుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ ఆన్‌లైన్‌ చెయిన్‌ సిస్టం బిజినెస్‌లో రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు, డాక్టర్లు, ప్రభుత్వ ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజాప్రతినిధులు మొదలుకొని సామాన్యుల వరకు పెట్టుబడులు పెడుతున్నారు. కొందరు ఈ ఆన్‌లైన్‌ బిజినెస్‌లో భారీగా నష్టపోతుుతున్నారు. ఈ మధ్య రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం తగ్గడంతో రియల్టర్లు పెద్ద ఎత్తున ఈ ఆన్‌లైన్‌ చెయిన్‌ సిస్టంలో పెట్టుబడులు పెడుతున్నారు. ఈ బిజినెస్‌లో పెట్టుబడులు పెట్టించేవారికి కమీషన్లు, బైక్‌లు, కార్లు, విదేశీ పర్యటనలు వంటి ఆకర్షణీయమైన ఆఫర్లను ఇస్తున్నారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు వస్తున్నాయనే ఆశతో అటువైపు మొగ్గుచూపుతున్నారు. కరీంనగర్‌కు చెందిన ఒక వ్యాపారిని నమ్మి వందలాది మంది కోట్లాది రూపాయలు పెట్టుబడులు పెట్టగా మొదట్లో వారికి ఆరు నుంచి 10శాతం వరకు కమిషనర్‌ వచ్చింది. దీంతో వారు మరింత ఆశతో ఇంకోంత మొత్తంలో డబ్బులను పెట్టుబడిగా పెట్టారు. ఆ తర్వాత కొద్ది రోజులకు ఆ వ్యక్తి తన ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ చేసుకుని బిచాణా ఎత్తివేయడంతో బాదితులు లబోదిబోమన్నారు.

ఫ్ఞ మెటాఫండ్‌ క్రిప్టోకరెన్సీ స్కీంలో పెట్టుబడులు పెడితే 10 నెలల్లో 3 రెట్ల డబ్బులు వస్తాయని నమ్మించి 8 మంది బాధితుల వద్ద 55 లక్షల రూపాయలు కాజేసి మోసానికి పాల్పడిన ఘటనలో కరీంనగర్‌ రెండో ఠాణా పోలీసులు జూలై 17న కేసు నమోదు చేశారు. కేసు వివరాలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. నిందితులు తప్పించుకుంటారనే ఉద్దేశంతో కేసు వివరాలు బయటకు చెప్పడం లేదని పోలీసు అధికారులు చెబుతున్నారు.

Updated Date - Aug 31 , 2025 | 01:08 AM