Share News

ముక్కిపోయి.. పురుగులు పట్టి..

ABN , Publish Date - Oct 18 , 2025 | 12:52 AM

పేదలకు ఉగాది నుంచి రేషన్‌ దుకాణాల ద్వారా సర్కార్‌ సన్న బియ్యం పంపిణీ చేస్తూ వారిలో సంతోషాన్ని నింపింది. సన్న బియ్యం పంపిణీకి ముందు మార్చి మాసంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చౌక ధరల దుకాణాలు, గోదాముల్లో నిల్వ ఉంచిన దొడ్డు రకం బియ్యంపై నిర్లక్ష్యమే చూపుతోంది.

ముక్కిపోయి.. పురుగులు పట్టి..

  • రేషన్‌ షాపుల్లో దొడ్డు బియ్యం నిల్వలు

  • ఆరు నెలలుగా రేషన్‌ డీలర్ల ఇబ్బందులు

  • సర్కారు వేలం పాటపై స్పష్టత కరువు

  • జిల్లాలో 346 రేషన్‌ దుకాణాలు.. 5.65 లక్షల మంది లబ్ధిదారులు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల): పేదలకు ఉగాది నుంచి రేషన్‌ దుకాణాల ద్వారా సర్కార్‌ సన్న బియ్యం పంపిణీ చేస్తూ వారిలో సంతోషాన్ని నింపింది. సన్న బియ్యం పంపిణీకి ముందు మార్చి మాసంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో చౌక ధరల దుకాణాలు, గోదాముల్లో నిల్వ ఉంచిన దొడ్డు రకం బియ్యంపై నిర్లక్ష్యమే చూపుతోంది. దీంతో జిల్లాలో నిల్వ ఉన్న దొడ్డు రకం బియ్యం ముక్కి పోయి, పురుగులు పట్టి పాడైపోతున్నాయి. మరోవైపు రేషన్‌ డీలర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం దొడ్డు రకం బియ్యానికి వేలం వేయనున్నట్లు ప్రకటించిన ఆచరణలోకి రాలేదు. సర్కార్‌ వేలంపాట ఎటూ తేలకపోవడంతో ఆరు నెలలుగా దొడ్డు బియ్యం పురుగులు పట్టడమే కాకుండా ఎలుకల బెడద డీలర్లను కలవరపెడుతోంది.


సన్న బియ్యం రాకతో దొడ్డు బియ్యం కష్టాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో 346 రేషన్‌ దుకాణాలు ఉన్నాయి. 1.92 లక్షల రేషన్‌ కార్డులు ఉండగా, 5.65 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరికి ప్రతినెలా 3275364 కిలోల బియ్యాన్ని కేటాయిస్తున్నారు. ఇందులో ప్రతినెల రేషన్‌ డీలర్ల వద్ద 4నుంచి 6 లక్షల కిలోల బియ్యం నిల్వలు ఉంటున్నాయి. ఏప్రిల్‌ మాసంలో సన్న బియ్యం పంపిణీ ముందు దొడ్డు బియ్యం నిల్వల లెక్కలు తీసి రేషన్‌ దుకాణాల్లో నిల్వ ఉంచారు. పోర్టబులిటీ విధానంతో కార్డుదారుడు రాష్ట్రంలో ఎక్కడైనా బియ్యం తీసుకునే వెసులుబాటు వచ్చింది. దీంతో రేషన్‌ డీలర్లు నిర్ణీత కోటాకు మించి బియ్యం నిల్వ ఉంచుకున్న వారు ఉన్నారు. ఇలా ఒక్కో రేషన్‌ డీలర్‌ వద్ద సుమారుగా 10 నుంచి 15 క్వింటాళ్ల వరకు దొడ్డు బియ్యం నిల్వలు ఉన్నాయి. సన్న బియ్యం పంపిణీకి ముందు మార్చి నెలలో రేషన్‌ డీలర్ల వద్ద జిల్లాలో 471629 కిలోల బియ్యం నిల్వలు ఉన్నాయి. దీంతోపాటు సిరిసిల్ల గోదాములో 320 బ్యాగుల వరకు నిల్వ ఉన్నాయి. రేషన్‌ దుకాణాలు అద్దె గదులు కొనసాగుతున్నాయి. ఇరుకుగా ఉండడంతో దొడ్డు బియ్యం నిల్వలతో ఇబ్బంది పడుతున్నారు. అల్పపీడన ప్రభావంతో బారీగా కురిసిన వర్షాలకు బియ్యం ముక్కిపోతున్నాయి. బియ్యానికి పురుగులు పట్టడంతో పాటు ఎలుకల బెడదతో బియ్యం పనికి రాకుండాపోతున్నాయి. సన్న బియ్యం, దొడ్డు బియ్యం నిల్వలు ఒకే చోట ఉండడంతో సన్న బియ్యానికి కూడా పురుగు వస్తోంది. లబ్ధిదారులు దొడ్డు బియ్యం కలుపుతున్నారని ఆరోపణలు కూడా చేస్తున్నారు.


తేలని సర్కార్‌ వేలంపాట..

రేషన్‌ దుకాణాలు, గోదాములో నిల్వ ఉన్న దొడ్డు రకం బియ్యాన్ని వేలం వేయడానికి ప్రభుత్వం నిర్ణయించిన ఇప్పటికి ఆచరణలోకి రాలేదు. వేలంపాట ఎటూ తేలకపోవడంతో దొడ్డు బియ్యం నిల్వలు ఇబ్బందికరంగానే మారాయి. జిల్లాలోని బియ్యం నిల్వలు వివరాలను జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు కూడా పంపించారు. దొడ్డు బియ్యం వేలం వేయని పరిస్థితుల్లో బియ్యం పురుగులు పట్టి నాణ్యత కోల్పోయిన తర్వాత వ్యాపారులు కూడా ముందుకు వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని భావిస్తున్నారు.

Updated Date - Oct 18 , 2025 | 01:20 PM