రాజన్న సన్నిధిలో భక్తజన సందడి
ABN , Publish Date - Nov 10 , 2025 | 12:22 AM
వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో భక్తజన సందడి నెలకొంది.
వేములవాడ టౌన్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): వేములవాడ రాజరాజేశ్వరస్వామి దేవస్థానంలో భక్తజన సందడి నెలకొంది. కార్తీకమాసం సందర్భంగా రెండు రోజులు సెలవు రావడంతో ఆదివారం వేలాదిమంది భక్తులు తరలివచ్చారు. ముందుగా రాజరాజేశ్వరస్వామి వారిని భక్తులు లఘు దర్శనం చేసుకున్నారు. అనంతరం భీమేశ్వరాలయంలో భక్తులు కోడెల మొక్కులు చెల్లించి అన్నపూజ, అభిషేకం పూజలు చేశారు. నిత్యాన్నదాన సత్రంపై నిత్యకళ్యాణం, సత్యనారాయణ వ్రతాలు చేయించుకున్నారు. దీంతో రాజరాజేశ్వరాలయం, భీమేశ్వరాలయంలో భక్త జనసంద్రమైంది.
బద్దిపోచమ్మకు బోనాలు
రాజన్న సన్నిధిలో స్వామివారి దర్శించుకున్న భక్తులు బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఆదివారం బద్దిపోచమ్మ ఆలయంలో అమ్మవారికి బోనం మొక్కులు చెల్లించేందుకు బారులుతీరారు. ఆలయంలో వేలాదిమంది భక్తులతో రద్దీ ఏర్పడింది.
భక్తిశ్రద్ధలతో కార్తీక దీపాలు వెలిగించిన భక్తులు
వేములవాడ రాజరాజేశ్వరాలయం ఆవరణలో భక్తులు కార్తీకదీపాలు వెలిగించారు. మరోవైపు భీమేశ్వరాలయంలోనూ భక్తులు కార్తీక దీపాలు వెలిగించారు.