రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ..
ABN , Publish Date - Aug 18 , 2025 | 01:03 AM
వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది.
వేములవాడ కల్చరల్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. శ్రావణ మాసం ఆదివారాన్ని పురస్కరించకుని రాజన్న ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ధర్మగుండంలో పవిత్రస్నానాలు ఆచరించి, కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. రాజన్నకు కోడెమొక్కు చెల్లించుకునేందుకు భక్తులు గంటల తరబడి క్యూలైన్‌లో బారులు తీరారు. సుమారుగా రెండు గంటలపాటు కోడెమొక్కు టికెట్‌ల కోసం భక్తులు క్యూలైన్‌లో వేచి ఉన్నట్లు తెలిపారు. కాగా ధర్మదర్శనం, శీఘ్రదర్శనం, బ్రేక్‌దర్శనం క్యూలైన్‌ల ద్వారా భక్తులు ఆలయంలోకి చేరుకుని పార్వతిరాజరాజేశ్వర స్వామివారలను దర్శించుకున్నారు. పరివార దేవతాలయాలైన సీతరామచంద్రస్వామి, అనంతపద్మనాభస్వామి, సోమేశ్వర, బాలత్రిపురసుందరీదేవి, బాలరాజరాజేశ్వర స్వామి, శ్రీవల్లిసుభ్రహ్మణ్యస్వామి, దక్షిణమూర్తి స్వామి వారలను దర్శించుకుని కుంకుమ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం భీమేశ్వర స్వామి, బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. అలాగే నాంపల్లి లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. సమీప గ్రామాల ప్రజలు స్వామివారికి బియ్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.